🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 86 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -16 🌻
ఒక కమ్మరివాని దగ్గరకు వెళ్ళినప్పుడు, ఎలా వుందట? అక్కడ ఒక పెద్ద దాగలి ఉంటుంది. దాగలి అంటే ఆధారముగా పెట్టినటువంటి ఒక ఇనుప ముద్ద. దాని మీద అనేక వస్తువులు తయారౌతూ ఉంటాయి. కానీ, దాగలిలో ఏ మార్పు ఉండదు. దాగలిలో ఏ పరిణామము ఉండదు. దాగలిలో ఏరకమైనటువంటి సంపర్కము ఉండదు. అది ఎప్పుడూ విలక్షణమే.
అంటే, కూటస్థుడు సర్వ సృష్టి యందు అనేక పరిణామములు జరుగుతున్నట్లు కనబడుతున్నప్పటికీ, సర్వ వ్యాపకుడై, సర్వ విలక్షణుడై, సర్వ సాక్షియై ఉన్నందువలన, తాను ఎట్టి పరిణామమును పొందుట లేదు. అట్టి కూటస్థ ప్రతిబింబము అయినటువంటి జ్ఞాత పిండాండము నందు స్వయం కూటస్థ స్వరూపుడైనటువంటి జ్ఞాత పిండాండము నందు, అదే లక్షణములతో, సర్వ విలక్షణముగా, సర్వ సాక్షిగా ఉన్నందువలన, నేను అనునది ఎట్టి పరిణామమును పొందుట లేదు. ఎట్టి కర్మలను చేయడం లేదు.
కానీ ఈ జ్ఞాత, ఆ కూటస్థుడు, పిండాండ సాక్షి అయినటువంటి జ్ఞాత, బ్రహ్మాండ సాక్షి అయినటువంటి కూటస్థుడు, ఇరువురు లక్షణరీత్యా సమములు. కాబట్టి, అలా గుర్తెరిగినటువంటి వారు, ఎవరైతే ఉంటారో, వారు బ్రహ్మజ్ఞానులు. వారు బ్రహ్మనిష్ఠులు. వారు బ్రహ్మానుసంధాన పరులు. వారు బ్రహ్మవిదులు. వారు ఆ రకముగా సమస్తమైనటువంటి సృష్టిని కూడా ‘తాను బ్రహ్మమే’ అనే రీతిగా చూచేటటువంటి వారు. ఈ రకముగా ఆత్మను, బ్రహ్మమును ప్రతిపాదిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు.
ఉదాహరణ: కొందరు ఊరేగింపుగా వెళ్ళుచున్నారు, అందులో కొందరు గొడుగులు వైసుకొన్న వారును, కొందరు వేసుకొనని వారును యున్నారు. అయినప్పటికీ గొడుగులు లేని వారును కూడా కలిపి, గొడుగుల ఊరేగింపు వెళ్ళుచున్నదని చెప్పుచున్నాము. అటులనే కర్మఫలము ననుభవించునది జీవాత్మయే అయినప్పటికి సర్వవ్యాపకుడైన పరమాత్మ అంతటా నిండియున్నప్పటికి, పరమాత్మను పొందుటకు శ్రేష్టమైన స్థానము ఈ శరీరములోని హృదయకాశమనబడు బుద్ధి గుహయని చెప్పబడినది.
దీనినే ఛత్రి న్యాయము అంటారు. ఈ ఛత్రీ న్యాయాన్ని ఉపమానంగా ఇక్కడ ఇచ్చారు అన్నమాట. అంటే అర్థం ఏమిటి? మనం రోడ్డుమీద నిలబడి చూస్తున్నాము, అక్కడ ఒక ఊరేగింపు వెళ్తోందట. ఏ ఊరేగింపు అంటే, గొడుగుల ఊరేగింపు వెళ్తోందట. అంటే, అనేక మంది ప్రజలు ఊరేగింపుగా రోడ్డు మీద వెళ్తున్నారు.
వెళ్ళే వాళ్ళల్లో ఎక్కువ భాగం మంది ఆ గొడుగులను వేసుకుని వెళ్తున్నారు. కొంతమంది గొడుగులు వేసుకోకుండా కూడా వెళ్తున్నారు. కానీ ఎక్కువ భాగం మంది గొడుగులు వేసుకుని వెళ్తూ వుండడం కనబడినందువలన, కనపడినటువంటిదే సత్యముగా భావించి, అర్థప్రమాణమును స్వీకరించి, మిగిలిన గొడుగులు వేసుకోనివారిని ప్రధానంగా స్వీకరించక, గొడుగుల ఊరేగింపు జరుగుతున్నది అని స్టేట్‌మెంట్ [Statement] ఇచ్చారు అని ప్రకటించారు.
ఆ రకంగానే జీవాత్మ, పరమాత్మ ఒకే స్థానంలో ఉన్నప్పటికీ, ప్రధానంగా 90 శాతం మంది జీవులందరూ కూడా కర్మఫలమును ఆశ్రయంగా స్వీకరించి, కర్మచక్రములో పరిభ్రమిస్తూ, తాను కర్మఫల సంగి గా ఉండడం చేత, సుఖభోక్తగా ఉండడం చేత, ఆ సుఖ పిపాసగా ఉండడం చేత, జీవాత్మ కర్మఫలం అనేటటువంటి చక్రంలో తిరిగిపోతూ ఉన్నది.
అట్లా వెళ్తున్నవారినందరినీ జీవులు అంటే, అదే స్థానంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క ప్రాసంగికమును విస్మరించినట్లు అవుతుంది కాబట్టి. కానీ ఇది సరియైన విధానం కాదు. యథార్థమునకు జీవులే ప్రధానం అని అనుకోవడం తప్పుకదా! సర్వసాక్షి అయినటువంటి పరమాత్మను ప్రధానంగా స్వీకరించినట్లయితే, వాళ్ళు ఆ బుద్ధిగుహ యందు అట్టి పరమాత్మని పొందగలుగుతున్నారు.
బుద్ధిగుహ అనే హృదయస్థానంలో ఉన్నటువంటి, జీవుడు తాను లేనివాడినని గ్రహించి, తాను ప్రతిబింబమని గ్రహించి, తాను నీడవంటి వాడినని గ్రహించి, తన స్వరూప జ్ఞానమైనటువంటి పరమాత్మ స్థానము వైపుకు తిరిగి చూసిన్నట్లైతే తనను తానే పొందుచున్నాడు. తనను తానే గుర్తించుచున్నాడు. తనను తానే అనుభూతమొనర్చుకొనుచున్నాడు.
కాబట్టి, ఈ రకమైనటువంటి ఆంతరిక సాధనను, అంతర్ముఖ ప్రయాణాన్ని మానవులందరూ తప్పక పూర్తి చేయాలి. ఈ బుద్ధి గుహ అనేటటుంవటి హృదయాకాశ స్థానమును తప్పక పొందాలి. గుర్తించాలి. ఆ గుర్తించడం పేరే నిర్వాణ సుఖము. ‘నిర్వాణం’ అనేది ఇదన్నమాట. - విద్యా సాగర్ స్వామి
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam
https://www.facebook.com/groups/465726374213849/
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom
27 Oct 2020
No comments:
Post a Comment