శ్రీ శివ మహా పురాణము - 257


🌹 . శ్రీ శివ మహా పురాణము - 257 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

60. అధ్యాయము - 15

🌻. నందావ్రతము - శివస్తుతి - 2 🌻

వైశాఖ శుక్ల తదియనాడు సతీదేవి నువ్వుల ఆహారమును, జొన్నల అన్నమును నైవేద్యమిడి రుద్రుని పూజించెను. ఆమె ఆ నెలను అదే తీరున ఆరాధించుచూ గడిపెను (21). జ్యేష్ఠపూర్ణిమనాడు రాత్రియందు ఆమె శంకరుని నూత్న వస్త్రములతో, మరియు బృహతీ పుష్పములతో పూజించి ఉపవాసము చేసెను. ఆమె ఆ మాసమును ఇట్టి ఆరాదనతో గడిపెను (22).

ఆమె ఆషాడ శుక్ల చతుర్దశినాడు నల్లని వస్త్రమును ధరించి బృహతీ పుష్పములతో రుద్రుని పూజించెను (23). శ్రావణ శుద్ధ అష్టమినాడు, మరియు చతుర్దశినాడు ఆమె శివుని యజ్ఞో పతీతములను పవిత్రమగు వస్త్రములను సమర్పించి పూజించెను (24). ఆమె భాద్రపద కృష్ణ త్రయోదశినాడు, మరియు చతుర్దశినాడు నానావిధముల పుష్పములతో, ఫలములతో శివుని పూజించి, నీటిని మాత్రమే త్రాగి ఉపవసించెను (25).

ఆమె అన్ని మాసముల యందు గొప్ప ఆహారనియమము గలదై ఆయా ఋతువులలో లభించు సస్యములతో నైవేద్యమును తయారుచేసెను. ఆయా ఋతువులలో లభించు పుష్పములతో పూజించి ఫలములను కూడా నైవేద్యమిడి శివుని అర్చించి మంత్రమును జపించెను (26). తన ఇచ్ఛచే మానవాకృతిని ధరించిన ఆ సతీదేవి మాసములన్నిటితో ప్రతిదినము దృఢ దీక్షతో శివార్చనయందు లగ్నమయ్యెను (27).

ఆ సతీదేవి మిక్కిలి శ్రద్ధతో నందా వ్రతమును ఈ తీరున ముగించి, ఇతర విషయములపై ప్రసరించకుండగా నిశ్చలముగనున్న మనస్సుతో శివుని ప్రేమ పూర్వకముగా ధ్యానించెను (28). ఓ మహర్షీ! ఇంతలో దేవతలు, మహర్షులు అందరు విష్ణువును, నన్ను ముందిడుకొని, సతీదేవి యొక్క తపస్సును తిలకించుటకు బయలుదేరిరి (29).

దేవతలు అచటకు వచ్చి, మూర్తీభవించిన తపస్సిద్ధి వలెనున్నది, శివుని ధ్యానమునందు పూర్ణముగా నిమగ్నమైనది, సిద్ధుల అవస్థను పొందియున్నది అగు సతీదేవిని దర్శించిరి (30). దేవతలందరు, మునులు మరియు విష్ణువు మొదలగు వారు ప్రీతితో గూడిన మనస్సు గలవారై ఆనందముతో శిరసువంచి దోసిలి యొగ్గి సతీదేవికి నమస్కరించిరి (31).

అపుడు విష్ణువు మొదలగు దేవతలు, ఋషులు మిక్కిలి ఆశ్చర్యమును పొందిరి. వారు సతీదేవి యొక్క తపస్సును చూసి మిక్కిలి ప్రసన్నులై ఆమెను కొనియాడిరి (32). ఆ దేవతలు, ఋషులు ఆ సతీదేవికి మరల ప్రణమిల్లి, వెంటనే శివునికి ప్రియమగు కైలాస పర్వత రాజమునకు వెళ్లిరి (33).

సరస్వతీ సనాథుడనగు నేను, లక్ష్మీదేవితో కూడియున్న వాసు దేవ భగవానుడు కూడా ఆనందించుచూ శివుని సన్నిధికి వెళ్లితిమి (34). అచటకు వెళ్లి శివప్రభువును చూచి తొట్రుపాటుతో ప్రణమిల్లి చేతులు జోడించి వివిధ స్తోత్రములతో సవినయముగా స్తుతించితిమి (35).

దేవతలిట్లు పలికిరి -

భగవంతుడు, పురుషుడు, మహేశ్వరుడు, సర్వేశ్వరుడు, పరమాత్ముడు అగు నీకు నమస్కారము. ఈ చరాచరజగత్తు నీనుండి ఉద్భవించినది (36). సర్వప్రాణుల ఆది కారణము, చిద్ఘనము, ప్రకృతి పురుష వికార రహిత పరబ్రహ్మమునగు నీకు నమస్కారము (37).

ఎవడు ఈ జగద్రూపమున నున్నాడో, ఎవనిచే ఈ జగత్తు ప్రకాశించుచున్నదో, ఎవని నుండి ఉద్భవించినదో, ఎవనికి సంబంధించి ఉన్నదో, ఎవని యందు లీనమగునో అట్టి పరమాత్మవు నీవే. నీకు యత్నపూర్వకముగా నమస్కరించుచున్నాము (38). ఇహ పరలోకములకు అతీతుడు, నిర్వికారుడు, మహాప్రభువు, స్వయంభువు అగు నీకు నమస్కారము. నీవు నీ ఆత్మయందు ఈ జగత్తును దర్శించుచున్నావు (39).

అమోఘమగు దృష్టి గలవాడు, పరమాత్మ, సాక్షి, సర్వాత్మ, అనేక రూపములను ధరించువాడు, అన్నిటికి ఆత్మయైనవాడు, పరబ్రహ్మ, తపస్సును చేయుచున్నవాడు అగు నిన్ను శరణు వేడెదను (40).

నీ పదమును దేవతలు, ఋషులు, మరియు సిద్ధులు కూడా ఎరుంగును. ఇతర ప్రాణులలో ఎవ్వరు నిన్ను ఎరుంగ గలరు? (41). నీ పదమును చూడగోరిన మానవులు సంగమును వీడి సాధువులగుచున్నారు. నీ చరితము మాకు మోక్షమునిచ్చును. లోకములను నీనుండియే సృష్టించిననూ, నీవు వ్రణము (ఛిద్రము) లేని వాడవు (42).

నీకు దుఃఖమునిచ్చే జన్మాది వికారములు లేమియూ లేవు కాని, నీవు మాయాచే దయతో వాటిని స్వీకరించుచున్నావు (43). పరమేశ్వరుడు, ఆశ్చర్యకరమగు కర్మలను చేయువాడు, మాటలకు అందని వాడు, పరబ్రహ్మ, పరమాత్మ అగు నీకు నమస్కారము (44).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


27 Oct 2020


No comments:

Post a Comment