✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -07 🌻
ఎప్పుడైతే నిష్కామ కర్మకి అవకాశం లేదో, అప్పుడు తనలోపలికి తాను ముడుచుకుంటాడన్నమాట! తన యందు తాను రమిస్తూ వుంటాడు. తన యందే తాను స్థిరమై ఉంటాడన్నమాట! అలా లోపలికి ముడుచుకోవడం చేతనైనటువంటి వాడు అన్నమాట. దీనిని ఏమన్నారు అంటే? ఇంద్రియ నిగ్రహం అన్నారు.
ఈ బుద్ధి గుహయందు సర్వేంద్రియములను నిక్షిప్తం చేయడం ఏదైతే ఉన్నదో, దానికి ఇంద్రియ నిగ్రహం అని పేరు. అంతేకానీ, బహిర్ వ్యాపారంలో ఒకచోట చేయుట, ఒక చోట చేయకుండుట కర్మ వ్యాపారంతో ఇంద్రియ నిగ్రహం బోధించబడుట లేదు. ఇంద్రియములు వ్యవహరించినను, వ్యవహరించకున్ననూ, తాను వ్యవహరించుట లేదు. తాను సదా ఈ ఆంతరిక యజ్ఞమునందు నిమగ్నుడై, ఆత్మానందమగ్నుడై ఉన్నాడు.
కాబట్టి సామాన్య వ్యవహారం ఏదైతే ఉన్నదో, అట్టి సామాన్య వ్యవహారమునకు సుఖ దుఃఖ ఆసక్తిని పొందక, శీతోష్ణాది ద్వంద్వముల చేత కుంగక, శరీరాది జరామరణాది వార్థక్యరూప జరా మృత్యు వార్థక్యరూపమైనటువంటి వాటి చేత కుంగక, పొంగక, యవ్వనాది విశేషముల చేత లాభింపక, శరీర ఇంద్రియ వ్యాపార సహితమైనటువంటి చర్యల యందు నిమగ్నము కాక, సంగత్వమును పొందక ఉండేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, వాడు ఈ జ్ఞాని అని పిలువబడుతున్నాడు. అర్థం అయిందా అండి.
‘జ్ఞాని’ అంటే అర్థం ఏమిటంటే “ఎవరైతే ఈ ఆంతరిక యజ్ఞాన్ని చేసి, ఈ ఆత్మానంద భావమునందుకున్నారో, వాళ్ళందరూ జ్ఞానులు” కాబట్టి, వీళ్ళు మాత్రమే ఇలా ఈ క్రమంలో వెళ్ళేటటువంటి అంతర్ముఖులైనటువంటి, వారు మాత్రమే దీన్ని సాధించగలుగుతారు. అంతేకాని, విషయవ్యావృత్తి కలిగినటువంటి, విషయావృత్తం అయినటువంటి, విషయముల యందు రమించేటటువంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళు, ఆత్మను తెలియలేరు. ఎప్పటికీ తెలియలేరు.
జిలేబీ బాగుందా? పులిహోరా బాగుందా? దద్దోజనం బాగుందా? పచ్చిమిరపాకాయ బజ్జీ బాగుందా? ఆవకాయ బాగుందా? మాగాయి బాగుందా? అని పదార్థముల వెంటపడి వెళ్ళేవారు ఇంద్రియార్థములైనటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదుల యందు మనస్సు లగ్నం చేసేవారు కానీ, కర్మల యందు ఫలాపేక్ష చేత, రమించేటటువంటి వారు కానీ, ఈ ఆత్మను తెలుసుకొన లేరు. అనగా ప్రవృత్తి మార్గంలో వున్నటువంటి వారు ఎప్పటికీ ఈ ఆత్మను తెలియలేరు.
జనన మరణ మృత్యురూప భయమును పొందేటటువంటి వారు ఎప్పటికీ ఈ ఆత్మను తెలియలేరు. శబ్ద గ్రాహ్యత యందు కానీ, స్పర్శ గ్రాహ్యత యందు కానీ, రూప గ్రాహ్యత యందు కానీ, రస గ్రాహ్యత యందు గానీ, గంథ గ్రాహ్యత యందు గానీ బుద్ధిని రమింప చేసేటటువంటి వారు, బుద్ధిని బహిర్ముఖముగా వ్యవహరింప చేసేటటువంటి వారు, ఈ ఆత్మను తెలియజాలరు. కాబట్టి బుద్ధిని ఒకదానిని బుద్ధి ఇంద్రియములకు రాజు వంటిది. దానిని వేరు చేయాలి.
ఇంద్రియముల నుంచీ వేరుచేయాలి. ఇంద్రియముల యందు రమించి తాను పొందే సుఖము నుంచీ వేరు చేయాలి. ఇంద్రియములు ఇచ్చే సంవేదనల ద్వారా తాను పొందే దుఃఖము నుంచీ బుద్ధిని వేరుచేయాలి. వేరు చేసి, తాను తానుగా ఉండగలిగేటటువంటి, వ్యవహరించ గలిగేటటువంటి స్థితిని బుద్ధికి కల్పించాలి.
అటువంటి విరమణ అనేటటువంటి యజ్ఞాన్ని, విరమణ అనేటటువంటి క్రతువును, విరమణ అనేటటువంటి అంతర్ముఖత్వాన్ని ఎవరైతే చేస్తాడో, ఈ నిరసించేటటువంటి విధానంలో ఎవరైతే తన యొక్క ప్రయాణాన్ని పూర్తి చేస్తాడో, తానైనటువంటి స్థితిలో తాను నిలబడి ఉంటాడో, తానైనటువంటి స్థితిలో తాను నిలకడ చెంది ఉంటాడో, ఆచలుడై ఉంటాడో, అంతర్ముఖుడై ఉంటాడో, సర్వవ్యాపియై ఉంటాడో, ఫలాపేక్ష రహితముగా వుంటాడో, సంగత్వ రహితంగా ఉంటాడో, అటువంటి వారు మాత్రమే ఆత్మానంద స్థితిలో ఉంటారని స్పష్టముగా చెపుతున్నారు.
ఈ ఆత్మ శరీరము లేనివాడు కనుక అశరీరయనబడును శరీరములు అనిత్యంలు జీర్ణించి పోవునవి. ఆత్మ నిత్యుడు, సర్వవ్యాపకుడును అచలుడునై అంతటా ఎల్లప్పుడూ ఉండును. అందుచేత అనిత్యములైన శరీరములందు నిత్యుడై యుండును. అట్టి గోప్పవాడును, సర్వ వ్యాప్తియునగు ఆత్మను ధ్యానాదులు మూలమున తెలిసికొనిన జ్ఞాని శోకింపడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment