గీతోపనిషత్తు - 55


🌹. గీతోపనిషత్తు - 55 🌹

🍀 15. గుణత్రయ సృష్టి - జీవుని సాన్నిధ్యమున అతని త్రిగుణాత్మక ప్రకృతి వర్తించు చుండును. స్వభావములో సంగము చెందుట చేతనే అతడు జీవుడు. లేనిచో దేవుడే. 🍀

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ



📚. కర్మయోగము - 27 📚


సమస్తమును తానే నిర్వర్తించు చున్నాడు అని తలచుట అహంకారము. మూఢత్వ మున మానవుడట్లు భావించుచున్నాడు.


27. ప్రకృతే: క్రియమాణాని గుణే: కర్మాణి సర్వశః |
అహంకార విమూఢాత్మా కర్తాహ మితి మన్యతే ||


కర్మములన్నియు ప్రకృతి నుండి పుట్టిన గుణములచే ఏర్పడుతున్నవి. సమస్త కర్మలకును గుణత్రయమే కారణము. వాని యందు జీవుడు ఉపస్థితుడై యున్నాడు. తానుండుటచే వానికి కదలిక కలదు. తాను లేనిచో వానికి కదలిక లేదు. ప్రకృతి జడమే. అందు చైతన్యము చేరినపుడు వివిధములుగ వర్తించును.

ఉదాహరణకు విద్యుత్ పరికరములన్నియు జడములే. అనగా తమంత తాము పనిచేయవు. విద్యుత్తు సాన్నిధ్యమిచ్చినచో ఒక్కొక్క పరికరము ఒక్కొక్క రకముగ పని చేయును. వైవిధ్యము పరికరముల యందు వున్నదిగాని, విద్యుత్తుయందు లేదు. విద్యుత్తు ఎప్పుడును విద్యుత్తే.

అట్లే, జీవుని సాన్నిధ్యమున అతని త్రిగుణాత్మక ప్రకృతి వర్తించుచుండును. నర్తించుచుకూడ నుండును. అదియును జీవుడు స్వభావముతో సంగమము నొందినప్పుడే. స్వభావములో సంగము చెందుటచేతనే అతడు జీవుడు. లేనిచో దేవుడే.

దేవుడు సంగము లేక సృష్టి యందుండును. ప్రకృతి తన గుణములతో అంతయు అల్లిక చేయును. గుణముల లోనికి దిగిన జీవుడు అహంకారియై చేయుచున్నా ననుకొనును. లేనిచో స్వభావము జడమై యుండును. తాను చేయువాడు కాడు. స్వభావమే చేయించును. స్వభావమున కాకర్షణ చెందుటచే జీవుడు బంధింపబడు చున్నాడు. తానే చేయుచున్నట్లు భ్రమపడుచున్నాడు.

తన యాధారముగ నిజమునకు గుణములు అంతయు చేయుచున్నవి. తాను కర్త కాదు. సాక్షి, ఆధారము, ప్రకృతికి ఆలంబనము. చేయునది మాత్రము ప్రకృతియే. ఇది తెలిసినవాడు తెలిసినవాడు. తెలియనివాడు అహంకారి. అట్టివాడు మూఢాత్ముడని భగవానుడు తెలుపుచున్నాడు. (3-27)

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

17 Oct 2020

No comments:

Post a Comment