రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
57. అధ్యాయము - 12
🌻. దక్షునకు వరము - 2 🌻
కాని నీవు ఇంకనూ అవతరించలేదు. ఆయనకు నీవు తక్క మరి ఎవ్వరు భార్య కాగల్గుదురు ? హే శివే! నీవు భూమి యందవతరించి ఆ మహేశ్వరుని మోహింపజేయుము (20).
నీవు తక్క మరియొకరు ఏనాడైననూ ఆయనను మోహింపచేయజాలరు. కావున నీవు నాకు కుమార్తెవై జన్మించి హరునకు పత్నివి కమ్ము (21).
నీవు ఇట్టి చక్కని లీలను ప్రదర్శించి శివుని మోహింపజేయుము. ఓ దేవీ! ఇదియే నేను గోరు వరము. నీ ఎదుట సత్యమును పలికితిని (22).
దీనిలో నా స్వార్థము మాత్రమే గాక, సర్వ జగత్తుల క్షేమము, బ్రహ్మ విష్ణుశివల ఆకాంక్ష కూడ గలవు. ఈ పనికి బ్రహ్మ నన్ను ప్రేరేపించెను (23).
బ్రహ్మ ఇట్లు పలికెను -
జగన్మాత ప్రజాపతి యొక్క ఈ మాటను విని, నవ్వి, మనస్సులో శివుని స్మరించి, ఇట్లు బదులిడెను (24).దేవి ఇట్లు పలికెను -
వత్సా! దక్ష ప్రజాపతీ!నేను చెప్పే హితకరమగు మాటను వినుము. నేను సత్యమును చెప్పెదను. నేను నీ భక్తిచే మిక్కిలి ప్రసన్నురాలనైతిని. నీ కోర్కెలనన్నిటినీ ఈడేర్చెదను (25).
హే దక్షా! మహేశ్వరినగు నేను నీభక్తికి వశురాలనై నీ భార్యయందు నీ కుమార్తెగా జన్మించెదను. దీనిలో సందేహము లేదు (26).
హే అనఘా! ఘోరమైన తపస్సను ను చేసి శివుని వరమును పొంది శివునకు భార్యను కాగల్గే విధముగా యత్నించెదను (27).
కార్యసిద్ధికి తపస్సు తక్క మరియొక మార్గము లేదు. ఆ ప్రభువు వికారరహితుడు. బ్రహ్మ విష్ణువులచే సేవింపబడువాడు. సదాశివుడు మాత్రమే పూర్ణుడు (28).
నేను ఆయనకు జన్మ జన్మల యందు దాసిని, ప్రియురాలను. శివుడు అనేక రూపములను ధరించిననూ నా ప్రభువు ఆయనయే (29).
ఆయన వర ప్రభావముచే బ్రహ్మ యొక్క కనుబొమనుండి అవతరించివాడు. నేను కూడా ఆయన వరము వలన ఆయన ఆదేశముచే ఈ లోకమునందు అవతరించగలను (30).
వత్సా! నీవు ఇంటికి వెళ్లుము. నాకు, శివునకు మధ్య దౌత్యమును చేయవలసిన వ్యక్తిని కూడా నేను ఎరుంగుదును. నేను కొద్దికాలములో నీకు కుమార్తెగా జన్మించి, శివుని భార్య కాగలను (31).
ఆ దేవి దక్షునితో ఇట్లు మంచి వచనములను పలికి, మనస్సులో శివుని ఆజ్ఞను పొంది, శివుని పాదపద్మములను స్మరించి, మరల ఇట్లు పలికెను (32).
హే ప్రజాపతే! కాని, ఒక షరతు గలదు. నీవు దీనిని నీ మనస్సులో దృఢముగా నుంచుకొనుము. నేను నీకు ఆ షరతును చెప్పెదను. అది సత్యమనియు, అసత్యము కాదనియు తెలుసుకొనుము (33).
ఏనాడైతే నీవు నాయందు ఆదరమును కోల్పోయెదవో, ఆనాడు నేను నా దేహమును విడిచి పెట్టెదను. ఇది సత్యము. దేహమును వీడి నేను స్వస్వరూపము నందుండెదను. లేదా, మరియొక దేహమును ధరించెదను (34).
ఓ ప్రజాపతీ! ప్రతికల్పముందు నీకు ఈ వరమీయబడినది. నేను నీ కుమార్తెగా జన్మించి, హరునకు పత్ని కాగలను (35).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ప్రజాపతులలో ముఖ్యుడగు దక్షునితో నిట్లు పలికి ఆ మహేశ్వరి వెంటనే దక్షుడు చూచుచుండగా అచటనే అంతర్థానమయ్యెను (36).
ఆ దక్షుడు దుర్గ అంతర్ధానము కాగానే తన ఆశ్రమమునకు వెళ్లెను. ఆమె కుమార్తెగా జన్మించ బోవుచున్నందుల కాతడు సంతసించెను (37).
శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండములో దక్షవరప్రాప్తి అనే పన్నెండవ అధ్యాయము ముగిసినది (12).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment