🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. నారద మహర్షి - 12 🌻
91. ‘మనో యజ్ఞేన కల్పతాం, వాగ్యజ్ఞేన కల్పతాం, ఆత్మా యజ్ఞేన కల్పతాం, యజ్ఞోయజ్ఞేన కల్పతాం’ – అన్నట్లు అంతాకూడా యజ్ఞమే! “ఆ మానసమైన యజ్ఞం నారాయణుని గురించి చేసి అతడితో సంబంధం, అనుగ్రహంతో ఉంటాను. అతడు విశ్వాత్ముడు, విశ్వేశుడు, విశ్వమయుడు. అతడియొక్క మొదటి అవతారము సహస్రశీర్షాది యుకతమయిన ప్రకృతి ప్రవర్తకమగు ఆదిపురుషరూపము అంటే విరాట్పురుషుడు.
92. ఆయన లీలామాత్రంగా అనేక అవతారములు ఈ ప్రపంచంలో ఎత్తుతూ ఉంటాడు. చుట్టూ ఉండే అవిద్యను నిర్మూలనం చేయటం కొరకే ఆయన అవతరిస్తాడని ఆయన లీలావిశేషములు చెబుతున్నవి. సుయజ్ఞ, కపిల, దత్తాత్రేయ, సనక, నర, నారాయణ, ధ్రువ, పృథ, వృషభ, మత్స్య, కూర్మ, నృసింహ, వామన, శ్రీరమాద్యవతారములు అని వాటికి పేరు.
93. తనను తాను సృష్టించు కుంటాడాయన, పరమేశ్వరౌడు, సర్వాత్మకుడు అయి విశ్వముయొక్క స్థితి, లయ, హేతువులన్నింటికి ఈ హరియే కారణము సుమా!” అని ప్రపంచక్రమాన్ని అంతాకూడా నారదుడికి ఎఱిగించాడు బ్రహ్మ.
94. తరువాత నారదుడు బదరికావనంలో తపస్సు చేసుకుంటున్న నారాయణ ఋషుని దర్శించి తనకు ప్రబోధం చేయవలసిందని అడిగాడు. అప్పుడు ఆయన నారదునితో, “ధృవము అంటే కదలనిది, అచలము. ఇంద్రియములకు గోచరము కానటువంటిది, కంటికి కనబడనిది, చెవులకు వినబడనిది, మనసుకు ఊహించటానికి కూడా సాధ్యం కానటువంటిది అయిన సత్యమొకటి ఉంది.
95. సూక్ష్మముగానైనా, దానితో పోల్చటానికి వీలైన, దాని పోలిక కలిగిన మరొకవస్తువు సృష్టిలో లేకపోవటం చేత; అది ఇలా ఉంటుందని చెప్పటానికి వీలులేదు. అది అంతరాత్మయే ఎఱుగలవసిన తత్త్వం. ఆరాధ్య వస్తువు అది ఒక్కటే. అంతకన్న సృష్టిలో వేరొకటిలేదు. దానికి ఏపేరైనా పెట్టుకో అదే శివుడు, అదే హరి, అదే బ్రహ్మ, అదే బ్రహ్మవస్తువు, నిర్గుణము, అదే సగుణము.
96. ఈ విశ్వమంతా అందులోంచే పుట్టి, అందులోనే ఉండి, అందులోనే లయిస్తున్నది. దానిని నీవు హరి భావన చేసుకో. నేను కూడా ఎల్లప్పుడూ దానినే ధ్యానిస్తూ ఇక్కడే ఉంటూ ఉంటాను. ప్రతీ కల్పంలోనూ ఇలా పుట్టమని ఈశ్వరాజ్ఞ, నారాయణ ఋషి అనే పేరుతో ఈ బదరికావనంలోనే ప్రతీకల్పంలోనూ పుట్టి తపస్సు చెసుకుంటూ ఉంటాను. నాకు వేరే పనిలేదు” అని చెప్పాడాయన.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment