✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀 30. బంధమోచనము - బంధమోచన జ్ఞానము, బంధమోచనులైన ముక్తి జీవుల వద్ద దర్శింపవచ్చును. కేవలము విషయ పరిజ్ఞానము వలన ఎవ్వడును జ్ఞాని కాలేడు. నిజమగు జ్ఞాని సాన్నిధ్యము వలననే జ్ఞాని యగుటకు వీలగును. ఇచ్చట జ్ఞాని యనగ బంధములను పరిష్కరించుకొనుచు, చేయు కర్మలవలన మరల బంధములను సృష్టించుకొనక జీవించు విధానము. ఈ విధానమున జీవుడు బంధమోచనుడై, స్వతంత్రుడై దివ్యవైభవమున నుండును. అట్టివాడే జ్ఞాని. అతని నిత్యజీవన ఆచరణమే నిజమగు దర్శన జ్ఞానము. ఈ శ్లోకము సద్గురు శుశ్రూష బంధ మోచనము కోరువానికి ఉపకరణము కాగలదని తెలుపుచున్నది. 🍀
తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా |
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్వదర్శినః 34
తత్వవేత్తలగు జ్ఞానులకు సాష్టాంగ నమస్కారము చేసి, వ్యకిగతముగ వారికి సేవచేసి, వినయముగ వారిని సమయా సమయ వివేకముతో ప్రశ్నించియు, బంధమోచన జ్ఞానమును ఉపదేశపూర్వకముగ పొందుము. బంధమోచన జ్ఞానము, బంధమోచనులైన ముక్తి జీవుల వద్ద దర్శింపవచ్చును. జ్ఞాన మనగ బంధమోచన జ్ఞానమే అని తెలుపబడినది గదా! తెలిపినంత మాత్రమున తెలుసుకొనిన వాడు ఆచరింపలేడు.
ఫలాసక్తి లేక కార్యము నాశ్రయించి, కర్మను నిర్వర్తించవలెనని సర్వసామాన్యముగ అందరు వినియే యుందురు. అంతమాత్రముచేత ఆచరింప గలుగుచున్నారా? కర్మాచరణము దైవము తెలుపురీతిలో ఆచరించుట అంత సులభము కాదని అందరును అంగీకరింతురు. కోరిక ప్రధానముగ జీవించు మానవుడు, తన వ్యక్తిగత కోరిక కన్న కర్తవ్యమే ప్రధానమని భావించుటకు సంస్కారబలముగ చాల మార్పు రావలెను.
కేవలము విషయ పరిజ్ఞానము వలన ఎవ్వడును జ్ఞాని కాలేడు. నిజమగు జ్ఞాని సాన్నిధ్యము వలననే జ్ఞాని యగుటకు వీలగును. ఇచ్చట జ్ఞాని యనగ బంధములను పరిష్కరించుకొనుచు, చేయు కర్మలవలన మరల బంధములను సృష్టించుకొనక జీవించు విధానము. ఈ విధానమున జీవుడు బంధమోచనుడై, స్వతంత్రుడై దివ్యవైభవమున నుండును. అట్టివాడే జ్ఞాని. అతని నిత్యజీవన ఆచరణమే నిజమగు దర్శన జ్ఞానము. జ్ఞానుల జీవన విధానము ఆకర్షణీయమై యుండును. వారు కర్మలాచరించు తీరు, ఫలాసక్తి లేని సూటియైన కర్తవ్యాచరణము, వ్యామోహము లేని జీవనము గమనించినచో ఆచరించుటకు వలసిన స్ఫూర్తి, సంకల్పబలము కలుగును.
అట్లాచరించు బుద్ధిమంతుడు నిర్వర్తించవలసిన మరియొక కర్తవ్యము దైవమిచట బోధించు చున్నాడు. జీవన్ముక్తుడగు జ్ఞాని దరిచేరుట, అతని జీవన విధానమును అవగాహనము చేసుకొనుట, సున్నితముగ అతడు కర్మ నిర్వర్తించు విధానము తెలుసుకొనుట, స్ఫూర్తితో ఆ విధానము ననుసరించుటతో బాటు, అట్టి జ్ఞాన పురుషునికి సేవ చేయుట, సాష్టాంగ దండప్రణామము చేయుట, అనుగ్రహమున వారు తెలిపిన సుళువులను, సూత్రములను హృదయస్థము గావించుకొని, వాచాలత్వము లేక వినయముతో ఆచరించుట.
భగవద్గీత యందలి ఈ శ్లోకము సద్గురు శుశ్రూష బంధ మోచనము కోరువానికి ఉపకరణము కాగలదని తెలుపుచున్నది. స్వంతముగ తమకు తాము నిర్వర్తించుకొనుట కన్న తెలిసిన వారి సాన్నిధ్యమున నిర్వర్తించుకొనుట ఉత్తమము. తెలిసినవారి అనుగ్రహము పొందుట ఉత్తమోత్తమము.
అనుగ్రహ మనునది అయస్కాంతీకరణము వంటిది. అయస్కాంత సన్నిధిని యినుప ముక్క త్వరితగతిని అయస్కాంతము కాగలదు. ఒక మనిషికి సేవ చేయుట, అతనికి సాష్టాంగ దండ ప్రణామము చేయుట, అతనిని వినయముతో అడిగి తెలుసుకొనుట అహంకారులకు సాధ్యము కాదు. అహంకారమున్నంత కాలము బంధమోచనము కలుగదు.
సాధకుని యందు సత్త్వము పెరుగుటకు ఈ మూడు సూత్రములను దైవము సూచించినాడు. అదియే మన పాద నమస్కారము, సేవ, పరిప్రశ్నము. కృష్ణ భక్తుల విషయమున ఈ మూడును గమనింపదగును. దైవభక్తుల జీవితమున ఈ మూడును దినచర్యగ పాటింపబడును. అట్టివారే దైవానుగ్రహ పాత్రులు కాగలరు. సద్గురువు రూపమున దైవమే వారిని అనుగ్రహించు చుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
19 Dec 2020
No comments:
Post a Comment