కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 136


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 136 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము - 66 🌻


అయితే, ఈ విచారణ క్రమానికి బలం, సమర్థత, సాధన - అంటే నాలుగు సంధ్యలలో నువ్వు చేసేటటువంటి సాధన. జప తప సాధనలు ఏవైతే ఉంటాయో, ధ్యానసాధనలు ఏవైతే ఉన్నాయో, ప్రాణాయామ, ఆసన శుద్ధులు ఏవైతే ఉన్నాయో, వాటి ద్వారా కలిగిన చిత్తశుద్ధి యొక్క బలం చేత, వాటి ద్వారా ఈశ్వరుని యందు కలిగిన విశ్వాసం చేత, దైవ విశ్వాసం చేత, దైవ బలాన్ని అందుకున్నటువంటి వాడై, ఈశ్వరానుగ్రహాన్ని అందుకున్నవాడవై, ఈ అభిమానాన్ని సులభంగా తొలగించుకోగలుగుతావు. ఇదీ ఈశ్వరానుగ్రహం అంటే.

ఈశ్వరానుగ్రహం అని అందరూ అంటూ ఉంటారు. ఈశ్వరానుగ్రహం అంటే ఏమిటంటే, ఈ కర్తృత్వ భోక్తృత్వ అభిమానం అనేటటువంటి తెర సులభంగా తొలగిపోయి, ఈశ్వర సాక్షాత్కారం కలగడమే ఈశ్వరానుగ్రహం. ఇలా మనమందరం, సాధకులందరం తప్పక సాధించాలి. సాధన సాధ్యమిది.

మరియు తపస్సులన్నిటికంటెను, జలము మొదలగు పంచభూతముల ఉత్పత్తి కంటెను, పూర్వమే ఏదియున్నదో, అది బుద్ధి రూప హృదయాకాశమును ప్రవేశించి భూతములతో కూడా ప్రకాశించుచున్నదో, దానిని జ్ఞానులు చూతురు. అదే ఇది. నీవడిగిన ఆత్మ తత్త్వమిదియే.

ఈ రకంగా ఈశ్వర సాక్షాత్కార జ్ఞానం పొందిన తరువాత, ఆ ఈశ్వర సాక్షాత్కార జ్ఞాన ప్రభావం చేత, సదా నేను ఈశ్వరుడననే నిర్ణయంలో నిమగ్నమై పోయి ఉండడం చేత, సత్వగుణం శుద్ధ సాత్వికమై ప్రకాశించడం మొదలౌతుంది. అట్టి శుద్ధ సాత్విక స్థితికి చేరుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఆత్మనిష్ఠులు అవుతారు. వాళ్ళకి ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది. ఈశ్వర సాక్షాత్కారం తరువాతే, ఆత్మసాక్షాత్కర జ్ఞానం కలుగుతుంది. ఇది తప్పక నిర్ణయం అన్నమాట.

కాబట్టి ఆత్మతత్వాన్ని తెలుసుకునేటటువంటి క్రమంలో, మొదట ఈశ్వర సాక్షాత్కారాన్ని మానవులందరూ పొందాలి. సగుణ సాకార పద్ధతిగా కాని, నిర్గుణ నిరాకార పద్ధతిగా కాని, ఈ ఈశ్వర సాక్షాత్కారం జరుగుతూ ఉంది. సాధారణంగా 99శాతం అందరికీ కూడా సగుణ సాకార పద్ధతిగానే, ఈశ్వర సాక్షాత్కారం, ఇష్ట దేవతా సాక్షాత్కారం జరుగుతుంది. ప్రథమంగా ఆ దైవం తన కళ్ళ ఎదుట మూడు అవస్థలలోనూ ఉన్నటువంటి పరిస్థితిని దర్శనవిధిగా సాధిస్తాడు. ఈ దర్శనం అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి.

ఈ దర్శనం మూడు అవస్థలలో చెదిరిపోనిదన్నమాట. అది భావయుక్తమైనటువంటి, తాత్కాలికమైనటువంటి, మనోభావ రూప, బుద్ధి చలన రూప, చిత్త ప్రవృత్తి రూప, దృశ్యములు కావన్నమాట. యథార్థ దర్శనం, ఎవరికైతే సాక్షాత్కార జ్ఞానం కలుగుతుందో, అది మూడు అవస్థలలో చెదిరిపోదు. సదా తన కళ్ళముందు నిలచే ఉంటుంది.

అలా పొందినటువంటి దర్శనాన్ని అనుగమించగా, అనుగమించగా, అనుగమించగా, అనుసరించగా క్రమేపి ఆ దర్శన స్థితితో నీకు సంభాషించే శక్తి కలుగుతుంది. సదా దానితో సంభాషిస్తూ ఉంటాడు. సదా దానితో ఉంటాడు. ఆ దర్శన స్థితిలో ఉన్నటువంటి దైవతము కూడా నీతో సంభాషిస్తూ ఉంటుంది. ఆ శక్తి నీ చైతన్యమే. ఆ దైవము నీ చైతన్యమే. ఆ ఈశ్వరుడు కూడా నీ చైతన్యమే. అది ‘నా చైతన్యమే’ - చైతన్యమే ఆదిదైవతముగా ఉన్నది, చైతన్యమే అధ్యాత్మముగా కూడా ఉన్నది.

కాబట్టి, నేను చైతన్యమే, ఈశ్వరుడు కూడా చైతన్యమే. అనేటటువంటి స్ఫురణ కలగగానే దైవం ఇక బయట ఉండడు. దర్శనంగా ఉండడు. తానైపోతాడు ఇంక. తనకి ఆ దర్శనానికి అభేద స్థితి కలుగుతుంది. ఇట్టి అభేద స్థితి యందు, అంతటా దైవాన్నే చూస్తాడు. అంతటా తన ఇష్టదైవాన్నే చూస్తాడు. అంతటా ఈశ్వరుడినే చూస్తాడు. అంతటా ఈశ్వరీయమైనటువంటి విభూతిని దర్శిస్తాడు. అంతటా ఈశ్వర చిద్విలాసాన్ని గమనిస్తాడు.

సర్వాన్ని ఈశ్వరుని యొక్క భావ ప్రతిభా పాటవ విశేషములతో ఈ సృష్టిని అంతాకూడా, ఈశ్వరుడే తనకు తాను ప్రత్యక్షమయ్యేటట్లుగా తాను ప్రకృతి ద్వారా వ్యక్తమౌతున్న విధానం ఎట్లా అవుతున్నాడో, గమనించగలుగుతాడు.అట్టి ప్రతిభావిశేషం కలుగుతుంది, ప్రజ్ఞా విశేషం కలుగుతుంది. అట్టి చైతన్యవికాసం కలుగుతుంది. ఇది కలుగ గానే, అంతటా ఉన్నది చైతన్యమే. ఒక్క చైతన్యమే, అంతటా ఉన్నది. అనేటటువంటి స్ఫురణ మనకి కలుగుతుంది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


19 Dec 2020

No comments:

Post a Comment