శ్రీ శివ మహా పురాణము - 300


🌹 . శ్రీ శివ మహా పురాణము - 300 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

73. అధ్యాయము - 28

🌻. సతీ యాత్ర- 1 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను-

దక్షుని యజ్ఞమునకు దేవతలు, ఋషులు వెళ్లుచున్న సమయములోనే సతీదేవి గంధమాదన పర్వతమునందుండెను (1). దక్షపుత్రియగు సతి ఎత్తైన అరుగులతో కూడిన ఈత కొలను యందు సఖురాండ్రతో గూడి చిరకాలము క్రీడించెను (2). దక్షుని పుత్రియగు సతి ఆనందముతో క్రీడించుచూ, రోహిణీతో కలిసి దక్ష యజ్ఞమునకు వెళ్లుచున్న చంద్రుని చూచెను. ఆమె వెంటనే క్రీడలనుండి సెలవు తీసుకొని (3), తనకు ప్రాణ ప్రియురాలు, తనక్షేమమును చేయునది, విజయ అను పేరు గలది అగు తన సఖి కేశాలంకారమును చేసుకొనుచుండగా చూచెను. ఆ సతీదేవి ఆమెతో నిట్లనెను (4).

సతీదేవి ఇట్లు పలికెను -

ఓ విజయా! నీవు నాకు ప్రాణసమమైన ప్రీతిగల, సఖురాండ్రలో కెల్ల శ్రేష్ఠమైన సఖివి. ఈ చంద్రుడు రోహిణితో గూడి ఎచటకు వెళ్లుచున్నాడు? వెంటనే తెలుసుకొని రమ్ము (5).

బ్రహ్మ ఇట్లు పలికెను -

సతి అట్లు ఆజ్ఞాపించగా, విజయ వెంటనే చంద్రుని వద్దకు వెళ్లి ఎచటకు వెళ్లుచుంటివి? అని మర్యాదగా ప్రశ్నించెను (6). విజయ యొక్క ప్రశ్వను విని చంద్రుడు తాను దక్షుని యజ్ఞమనే ఉత్సవమునకు వెళ్లుచున్నానని చెప్పెను. మరియు ఆదరపూర్వకముగా వివరములనన్నిటినీ చెప్పెను (7).

ఆ మాటలను విని ఆశ్చర్యమును పొందిన విజయ వేగముగా సతీదేవి వద్దకు వెళ్లి, చంద్రుడు చెప్పిన ఆ వృత్తాంతమునంతనూ చెప్పెను (8). ఆ మాటను విని నీలవర్ణముగల ఆ సతీదేవి చాల ఆశ్చర్యమును పొందెను. అట్లు జరుగుటకు గల కారణమును గూర్చి ఆలోచించిననూ, ఆమెకు తెలియలేదు. ఆమె తన మనస్సులో ఇట్లు తలపోసెను (9).

నా తండ్రియగు దక్షుడు, తల్లియగు వీరిణి మమ్ములనిద్దరినీ ఏల ఆహ్వానించలేదో! ప్రియకుమార్తెనగు నన్ను మరచినా యేమి? (10). దీనికి గల కారణమును గూర్చి శంకరుని అడిగెదను. ఇట్లు తలపోసి ఆమె ఆ యజ్ఞమునకు వెళ్లుటకై నిశ్చయించుకొనెను (11). అపుడా దాక్షాయణీ దేవి తన ప్రియ సఖియగు విజయను అచటనే యుంచి వెంటనే శివుని వద్దకు వెళ్లెను (12). సభామద్యములో అనేక గణములతో, నంది మొదలగు మహా వీరులతో, శ్రేష్ఠులగు గణాధ్యక్షులతో చుట్టు వారబడియున్న ఆ శివుని చూచెను (13).

ఆ దాక్షాయణి తన భర్తయగు ప్రభువును అచట చూచి, ఆహ్వానము రాకుండుటకు గల కారణమునడుగుటకై శంకరుని సన్నిధికి వెంటనే వెళ్లెను (14). శివుడు తన ప్రియురాలగు ఆమెను తన అంకముపై కూర్చుండబెట్టుకొని ప్రేమతో, ఆదరముతో మాటలాడగా, ఆమె చాల సంతసించెను (15). అపుడు గొప్ప లీలలను ప్రకటించువాడు, సర్వేశ్వరుడు, సత్పురుషులకు సుఖములనిచ్చువాడునగు శంభుడు గణముల మధ్య విరాజిల్లువాడై ఆదరముతో వెంటనే సతీదేవితో నిట్లనెను (16).

శంభుడిట్లు పలికెను -

ఓ సుందరీ! ఈ సభా మధ్యములోనికి విస్మయముతో గూడిన దానవై నీవు వచ్చుటకు గల కారణమును ప్రీతితో నాకు వెంటనే చెప్పుము (17).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! ఆ మహేశ్వరుడు అపుడిట్లు పలుకగా, శివపత్నియగు సతి చేతులు జోడించి నమస్కరించి వెంటనే ఇట్లు పలికెను (18).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


19 Dec 2020

No comments:

Post a Comment