భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 187


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 187 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. విశ్వామిత్రమహర్షి - 7 🌻


39. చాలా సంపాదించాననుకుంటే అది ఉండగా మనంపొతాం. మన పుణ్యం బాగుండకపోతే, మనముండగానే అవి పోతాయి. రెండూ దుఃఖమే. తపోధనం సంపాదించాలి. ఆ తపోధనానికి హేతువైన ఎలాంటి శరీరం ఉండాలి, ఎలాంటి మనస్సు ఉండాలి అంటే – అందుకు శౌచమే విధించారు. మితాహారంవల్ల అది వస్తుంది.

40. ఎంత బలిష్ఠుడయినా, వాడికి ఏదో రోగం వస్తే ఒక మూల పడుంటాడు. వాడిని గౌరవిస్తారా? వాడి ఆత్మగౌరవం అంతా ఏమయింది? వాడి గర్వం అంతా ఏమయింది? నశించలేదా? అతడికి కేవలం పశువుకు చేసినట్లు చికిత్స చెయ్యరా వైద్యులు? కాబట్టి ఈ శరీరాన్ని ఆధారం చేసుకొని ఉన్నటువంటి ప్రతిపత్తి, గౌరవము, దర్పము-వీనియందు ఆధారపడి ఉండకూడదు. ఆత్మగౌరవంతో తనను తాను గౌరవించుకునే స్థితిలో ఎప్పుడూ ఉండాలి. శౌచం చేత, గుణంచేత, “నాలో దోషం లేదు” అని తనను తాను గౌరవించుకోవాలి.

41. ఆత్మగౌరవం అంటే, “ఏ లక్షణములు నాయందు ఉన్నాయో అవి గౌరవహేతువులు. నన్ను నేను అవమానపరచుకోవలసిన ఆవశ్యకత నాకు లేదు. నా గుణములవల్ల నా యందు నాకు గౌరవమే ఉంది” అనుకోవాలి. అయితే అది అహంకారం కాదు, దర్పంకాదు. అట్టి ఆత్మగౌరవానికి యోగ్యత సంపాదించాలి. అంతేకాని ఇంకొకళ్ళు ఇచ్చేది గౌరవంకాదు. తనయందు తనకుండే గౌరవమే గౌరవం. కలియుగంలో ఈ ధర్మాలు ఎక్కువగా చెప్పారు పురాణాలలో.

42. అట్టి అపూర్వధర్మనిర్ణాయకుడు విశ్వామిత్రుడు. దీక్షకు, పట్టుదలకు మరోపేరు ఆయన. పట్టుదలలేని వాడు దానికోసం ఒకసారి విశ్వామిత్రుణ్ణి తలచుకోవాలి. బాగా ఆలోచించి ఒక నిర్ణయంతీసుకున్నాక, ఇక ఎంత కష్టం వచ్చినా దాని అంతు కనుక్కోవలసిందే! ఆ పట్టుదలే ఆర్యుల లక్షణం. ఈ పట్టుదల రజోగుణంవల్లనే వస్తుంది. ఆ రజోగుణంలేనిదే తపస్సులుకూడా ఫలించవు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


19 Dec 2020

No comments:

Post a Comment