కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 34


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 34 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 23 🌻

అంత ప్రభావశీలమై అవిద్యా బలము, మోహము యొక్క బలము, బంధకారణమైనటువంటి సంసారరూప భ్రాంతి, జగత్ భ్రాంతి జీవులనన్నిటినీ పరివేష్టించి తనలోనే ఇముడ్చుకుని జననమరణ చక్రమునందు బాధితమయ్యేట్లుగా చేస్తుంది కాబట్టి దీని యొక్క విలువను తెలుసుకోమని యమధర్మరాజు బోధిస్తున్నారు.

వివేకవైరాగ్యములు, శమదమాది సద్గుణములు, ముముక్షత్వము గలవారు మాత్రమే ఆత్మజ్ఞానమునకు అర్హులైనట్లుగా శాస్త్రజ్ఞానమొకటే గాక అనుభవజ్ఞానము కలవారు మాత్రమే ఆత్మోపదేశము చేయుటకర్హులని విశదమగుచున్నది. శాస్త్రజ్ఞానమున్నవారు చాలామంది వుండవచ్చును. వారందరును ఆత్మను గురించి బాగుగా చెప్పలేరనియే తెలియుచున్నది.

ఆత్మసాక్షాత్కార మొనర్చుకొనిన అనుభవజ్ఞానులు మాత్రమే ఆత్మను గురించి చక్కగా బోధింపగలరు. అందుచేతనే ఆత్మ తత్వమును బోధించువారు అరుదుగా నుందురు అని చెప్పబడినది. భగవద్గీత కూడ 'తత్వదర్శినః' తత్వదర్శినులైన నీకు జ్ఞానబోధ చేయుదురని చెప్పుచున్నది.

ఇప్పటివరకు చెప్పిన అంశాలని మనం ఒకసారి విచారణా చేద్దాం. ఈ ఆత్మవిచారణ చేయాలి అంటే ఒక ప్రాధమిక నియమం వుంది. ఏమిటా ప్రాధమిక నియమం అంటే? ఎవరైతే బోధిస్తున్నారో వారికి కొన్ని లక్షణాలు వుండాలి. అలా లేనటువంటి వాళ్ళని గనక మనం ఆశ్రయించినట్లయితే ఈ ఆత్మబోధని అందుకోవడం కష్టతరమవుతుంది.

కాబట్టి మనం ఆత్మవిచారణ కొరకు, ఆత్మోపదేశము కొరకు, ఆత్మ బోధ కొరకు, ఆత్మనిష్ఠ కొరకు, ఆత్మానుభూతి కొరకు, ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కొరకు ఏ గురువునైతే ఆశ్రయిస్తున్నామో ఆ గురువుకి వుండవలసినటువంటి లక్షణాల గురించి ఇక్కడ చెప్తున్నారు. అంటే సరియైన గురువుని, తగుపాటి గురువుని - రెండు లక్షణాలు వుండాలి ఎప్పుడూ కూడా. సరియైన గురువుని ఎంపిక ఛేసుకోవాలి. అట్లాగే తగుపాటి గురువుని కూడా ఎంపిక చేసుకోవాలి.

ఇప్పుడు మనమందరం తెలుగుభాషలో మాట్లాడుకుంటే మనందరికీ బాగా అర్ధమవుతోంది. ఒక అరబ్బు దేశంలో వున్నటువంటి అరబ్బీ భాషలో మాట్లాడేటటువంటి గురువుగారిని ఎంపిక చేసుకున్నారు అనుకోండి ఏమవుతుంది? ఆయన చెప్పేది మనకర్ధం కాదు, మనం చెప్పేది ఆయనకి అర్ధం కాదు. కాబట్టి తగుపాటి గురువై వుండటం కూడా అవసరం 

ఇంకొకటి ఏమిటీ? నీవు నిష్కామ కర్మ అనేటటువంటి లక్ష్యంలో నువ్వు గనక జీవించేటటువంటి ప్రమాణాన్ని స్వీకరించినవాడివైతే సకామ్య గురువుని గనక ఆశ్రయించావనుకోండి. అప్పుడు ఆయన బోధించేటటువంటి బోధావిధి నీకు సరిపడదనమాట.

కాబట్టి ఎటువంటి గురువును ఆశ్రయిస్తావు అనేది చాలా ముఖ్యం. యోగపాఠం నేర్చుకోవడానికి యోగాసనాలు మాత్రమే నేర్పేటటువంటి గురువు దగ్గరికి వెళ్ళావనుకోండి అప్పుడు ఆయన శరీరిక దృఢత్వాన్ని దృష్టిలో పెట్టుకుని లక్ష్యంగా పాఠం బోధించేటటువంటి గురువునే పొందుతావనమాట.

ఈ రకంగా ఎనిమిది రకాలైనటువంటి గురువులు వున్నారు. కామ్యక గురువు, వాచక గురువు, సూచక గురువు, నిషిద్ధ గురువు, పరమ గురువు, నిజ గురువు ఈ రకంగా రకరకాలైనటువంటి గురువులు ఉన్నారు. ఇట్లా ఎనిమిదిమంది గురువులు వున్నారనమాట - విద్యా సాగర్ స్వామి

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment