శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 40




🌹.  శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 40  🌹
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. సిద్ధయ్యకు చేసిన జ్ఞాన బోధ 🌻

వీర బ్రహ్మేంద్ర స్వామి పుష్పగిరి నుండి వచ్చే మార్గమధ్యంలో ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో సిద్దయ్య, స్వామివారి పాదాలు ఒత్తుతూ తనకు జ్ఞానబోధ చేయమని కోరాడు.

దానికి అంగీకరించిన బ్రహ్మేంద్రస్వామి అమూల్యమైన విషయాలను ప్రసంగించడం మొదలుపెట్టారు. “సిద్ధయ్యా, విను, జ్ఞానేంద్రియాలు అయిదు, కర్మేంద్రియాలు అయిదు, ప్రాణాలు ఐదు. ఇవి అన్నీ కలిసి 24 తత్వములవుతాయి. . ధవళ, శ్యామల, రక్త, శ్వేత వర్ణముల మధ్య ప్రకాశించేది ‘ప్రకృతి’. అదే ‘క్షేత్రము’. అదే సర్వసాక్షి అయిన సచ్చిదానంద స్వరూపం.. ధవళ, శ్యామల, రక్త, పీత వర్ణాలలో రక్తవర్ణమే స్థూల శరీరం. శ్వేతవర్ణమే సూక్ష్మదేహం.. శ్యామలవర్ణమే కారణ శరీరం. వీటి నడుమ ప్రకాశించే పీత వర్ణమే మహా కారణ దేహము. ఈ కాయమూలా ప్రమాణం గురించి వివరిస్తాను విను...

''స్థూలకాయము ఒకటిన్నర అంగుళాల వ్యాసము గలది. కాయమూలము అంగుళముపైన వుంటుంది. వీటిని మించి ప్రకాశిస్తూ, వుండేదే ఆత్మ. అదే చైతన్యం. ఇవన్నియూ నేత్రములకు కనిపించేవే! నీకు అవి గోచరమయ్యే విధంగా నేను నా శక్తిని వినియోగిస్తాను’’ అని చెప్పి, సిద్ధయ్యకు వాటిని దర్శింపచేశారు స్వామి.దాంతో సిద్దయ్య సంతృప్తి పడ్డాడు.

🌻. స్వామివారు పంచాననం వారికి కాలజ్ఞానమును చెప్పటం... 🌻

శ్రీముఖ నామ సంవత్సరమున శ్రీ వీరభోగ వసంతరాయులనై వచ్చి పరిపాలనా బాధ్యత స్వీకరిస్తాను. మహానందికి ఉత్తరాన అనేకమంది మునులు పుట్టుకొస్తారు. భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారు.

5000 సంవత్సరం వచ్చేసరికి బ్రాహ్మణులు సంకరవృత్తులను చేస్తూ, తమ వైభవం కోల్పోతారు. ఏ కులం వారు కూడా బ్రాహ్మణులను గౌరవించరు. సిద్ధులు, యోగులు జన్మించిన ఆ బ్రాహ్మణకులము పూర్తిగా వర్ణసంకరం అవుతుంది.

ఆనాటికి ప్రజలలో దుర్భుద్ధులు అధికమవుతాయి. కృష్ణవేణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కుపోగును తాకుతుంది. రాజాధిరాజులు అణిగి వుంటారు. శూద్రులు విలాసాలను అనుభవిస్తూ, రాజుల హోదాలో వుంటారు. వారి ఇంట ధనలక్ష్మి నాట్యమాడుతూ వుంటుంది. నా భక్తులయిన వారికి నేనిప్పుడే దర్శనమిస్తాను. కానీ వారి నెత్తురు భూమిమీద పారుతుంది. కొంత భూభారము తగ్గుతుంది. దుర్మార్గుల రక్తముతో భూమి తడుస్తుంది.

చీమలు నివసించే బెజ్జాల్లో చోరులు దూరతారు. దురాలోచనలు మితిమీరుతాయి. అందువల్ల చోరులు ప్రత్యేకముగా కనపడరు. బిలం నుంచి మహానంది పర్వతము విడిచి వెళ్తుంది.

గడగ్, లక్ష్మీపురం, రాయచూరు, చంద్రగిరి, అలిపిరి, అరవరాజ్యము, వెలిగోడు, ఓరుగల్లు, గోలకొండ మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. నా మఠంలో ఏడుసార్లు దొంగలు పడతారు. క్షత్రియులు అంతరిస్తారు. చలనేంద్రియయములు, ఆయుధాల చేత, బాణముల వల్ల నశిస్తాయి.

ఉత్తర దేశాన భేరి కోమటి ‘గ్రంథి’ అనే మహాత్ముడు అవతరిస్తాడు.

అందరిచే పూజింపబడతాడు. . అందరూ పాటించవలసిన కొన్ని ధర్మములను గురించి నీకు చెబుతాను ... విను …

తాము భోజనము చేయబోయే ముందుగానే ఇతరులకు పెట్టటం ఉత్తమ ధర్మం. తాము భోజనం చేసి యింకొకరికి పెట్టటం మాధ్యమం, ఫలాపేక్షతో ఒకరికి అన్నదానం చేయటం అధమం. చాలకుండా అన్నం పెట్టటం అధమాధమం. దానాలన్నిటిలోనూ అన్నదానం అత్యుత్తమం.

కలియుగం 4808 సంవత్సరములు గడిచిన తరువాత కొట్లాటలు ఎక్కువవుతాయి. నిద్రాహార కాల పరిమితులు పాటించక మానవులు ధర్మహీనులవుతారు. శాంత స్వభావం కలవారు కూడా కోపాన్ని ఆపుకోలేకపోతారు. పిల్లలు పెద్దలను ఆశ్రయించుటకు బదులు, పెద్దలే పిన్నలను ఆశ్రయిస్తారు. దుష్టమానవుల బలం పెరుగుతుంది. రాజ్యాలేలిన వారు భిక్షాటనకు దిగుతారు. భిక్షమెత్తిన వారు ఐశ్వర్యమును పొందుతారు.

కుటుంబాలలో సామరస్యత తొలగిపోతుంది. వావి వరసలు నశిస్తాయి.

బ్రాహ్మణనింద, వేదనింద, గురువుల నిందలు ఎక్కువవుతాయి.

జారుత్వం, చోరత్వం, అగ్ని, రోగ, దుష్టులవలన ప్రజలు పీడింపబడతారు.

అడవిమృగాలు పట్టణాలు, పల్లెలలో తిరుగుతాయి.

మాల, మాదిగలు వేదమంత్రాలు చదువుతారు.

ఏనుగు కడుపున పంది, పంది కడుపున కోతి జన్మిస్తాయి.

రక్త వాంతులు, నోటిలో పుండ్లు వలన, తలలు పగలడం వలన జనం మరణిస్తారు (ఇది అణు దాడి వల్ల సంభవించే కాన్సర్ తదితర వ్యాధుల వల్ల జరగవచ్చు)

కొండల మీద మంటలు పుడతాయి.

జంతువులూ గుంపులు గుంపులుగా మరణిస్తాయి.

భారతదేశము పరుల పాలనలోకి వెళుతుంది.

ఈ పాలనలో అన్ని వర్ణాల వారు చదువుకుంటారు. కులం, ఆచారం నశిస్తాయి. మనుషులందరూ కలిసి మెలిసి, కుల మత వర్ణబేధాలు లేక ప్రవర్తిస్తారు.

ఎడ్లు లేకుండా బండ్లు నడుస్తాయి.

మంచినీటితో జ్యోతులు వెలుగుతాయి.

ఒకే రేవున పులి, మేక నీరు తాగుతాయి.

వెంపలి మొక్కకు నిచ్చెనలు వేసే మనుష్యులు పుడతారు.

విజయనగర వైభవము నశిస్తుంది.

కాశీ నగరం పదిహేను రోజులు పాడుపడిపోతుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment