గీతోపనిషత్తు - సాంఖ్య యోగము : 11. యోగవిద్య - అభ్యాసము - తాను శరీరము కాదని, శరీరము తాను ధరించిన వస్త్రమని, తెలియుటయే జ్ఞానము. దానిని సాధించే మార్గమే యోగవిద్య.


🌹 11. యోగవిద్య - అభ్యాసము - తాను శరీరము కాదని, శరీరము తాను ధరించిన వస్త్రమని, తెలియుటయే జ్ఞానము. దానిని సాధించే మార్గమే యోగవిద్య. 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 22 📚

చినిగిన, చివికిన బట్టలను విడచి, క్రొత్త బట్టలు వేసుకొనుట బుద్ధి. వాటినే సర్దుబాటు చేసుకొనుట లోభత్వము. అది మోహము నుండి జనించును. శరీరములు కూడ వస్త్రముల వలె చివుకుట, చినుగుట జరుగును. అప్పుడు వానిని వదలి క్రొత్తవి ధరించుటకు సంసిద్ధత కావలెను. అది జ్ఞానము వలన కలుగును.

వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరో-పరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణా
న్యన్యాని సంయాతి నవాని దేహీ || 22

తాను శరీరము కాదని, శరీరము తాను ధరించిన వస్త్రమని, ధర్మముతో కూడిన అర్థకామములను తాననుభవించుటకు ప్రకృతిచే ఈయబడిన వాహనమని, చినిగినచో మరియొక క్రొత్త వస్త్రము ప్రకృతి ఇచ్చునని తెలియుటయే ఈ జ్ఞానము.

వస్త్రములు మార్చినవాడు తాను మారుచున్నానని అనుకొనుట లేదు.

పూర్వవస్త్రములలో తానెట్లుండెనో తనకు జ్ఞప్తి యున్నది. అటులనే దేహములు మార్చినను, అంతకు ముందు దేహములో తానెట్లుండెనో తెలియు విద్య కలదు, అది యోగవిద్య.

అది తెలిసినవారు దేహములను మార్చుట వస్త్రములను మార్చునంత సులభముగా చేయుదురు. ఈ విద్య కోల్పోవుటచే బికారుల వలె చివికినవి, చిరిగినవి అయిన వస్త్రములను పట్టుకొని అజ్ఞానమున జీవులు వ్రేలాడుచున్నారని గీత ఘోషించుచున్నది.

పాత బట్టలు వదలవలె నన్నచో క్రొత్త బట్టలున్నవను దృఢ విశ్వాస మేర్పడవలెను కదా! అట్లేర్పడుటకు నిర్దిష్టమైన, క్రమబద్ధమైన అభ్యాసము కలదు. అదియే యోగ విద్యాభ్యాసము. అట్టి విద్యను బోధించు యోగ శాస్త్రమే గీత.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment