భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 91


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 91 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పరాశర మహర్షి - 10 🌻

56. యజ్ఞయాగాది క్రతువులన్నీ చేసి, శౌచారలన్నీ బాగా పాటించి నటువంటి యథార్థమయిన బ్రాహ్మణ జీవనము, ఉత్తమోత్తమమయినదై బ్రహ్మలోకప్రాప్తికి దారి తీస్తుంది. అది కొంచెం తక్కువ స్థాయిదైతే, స్వర్గం ప్రాప్తిస్తుంది.

57. స్వర్గానుభవం పూర్తయ్యాక ఆ జీవుడు మళ్ళీ ఈ లోకానికే వచ్చి జన్మించి, జ్ఞానంచేత యోగి అవుతాడు. అది చూచి వచ్చిన తరువాత, కర్మఫలం ఇంతేనని లోపలి జీవాత్మకు అవగత్మవుతుంది.

58. ‘ఓహో! ఇంత ఉత్కృష్టమైన కర్మలకు ఫలముగా ఆ లోకమందు కొంతకాలం ఉనికి(స్థితి) లభిస్తుంది. అంతే! మళ్ళీ ఇక్కడికే వస్తాము’ అన్న వివేకం, జ్ఞానం లోపల జీవుడికి కలుగుతుంది.

59. ఈసారి దానియందు మరి అభిరుచి ఉండదు. జీవలక్షణం మారిందన్న మాట! ఒకమాటు అది చూచిన తరువాతనే జీవలక్షణం మారుతుంది. కాని స్వర్గమును ఎన్నడూ చూడని వాడికి స్వర్గమే గమ్యస్థానమవుతుంది.

60. ఒకసారి స్వర్గానుభవం తరువాత సుఖమందు, సుఖలాలసయందు, ఉత్తమలోకప్రాప్తియందు, అది ఇచ్చేటటువంటి కర్మలయందు వైముఖ్యము చేత, సహజంగా అతడికి ఒక ఉద్బొధం కలిగి యోగి అవుతాడు, ముక్తి పొందుతాడు అని పరాశరవాక్యం.

61. అంటే, ‘బ్రహ్మలోకప్రాప్తి పొంది తిరిగి యోగియై జన్మించి ముక్తినొందగలడు’ అని. అట్టివాడు బ్రహ్మప్రళయం వచ్చేంతవరకు బ్రహ్మలోకంలో ఉండి, తరువాత ముక్తిని పొందుతాడు. సన్యాసి చేసేటటువంటి బ్రహ్మోపాసన, ప్రణవోపాసన ఇవన్నీకూడా ఒకప్పుడు బ్రహ్మలోకప్రాప్తినిస్తాయి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

24.Aug.2020

No comments:

Post a Comment