శ్రీ శివ మహా పురాణము - 204


🌹 .  శ్రీ శివ మహా పురాణము - 204  🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴

45. అధ్యాయము - 20

🌻. శివుడు కైలాసమునకు వెళ్లుట - 3 🌻

సర్వే చంద్రావతంసాశ్చ నీలకంఠాస్త్రిలోచనాః | హారకుండలకేయూర ముకుటాద్వై రలంకృతాః || 26
బ్రహ్మేంద్ర విష్ణు సంకాశా అణి మాది గణౖర్వృతాః | సూర్యకోటి ప్రతీకాశాస్తత్రా జగ్ముర్గణశ్వరాః || 27
ఏతే గణాధిపాశ్చాన్యే మహాత్మానోsమలప్రభాః | జగ్ముస్తత్ర మహాప్రీత్యా శివదర్శనలాలసాః || 28

వీరేగాక మహాబలశాలురగు గణాధీశులు ఎందరో లెక్కలేనంత మంది వచ్చిరి. వారందరు అనేక హస్తములను కలిగియుండిరి. వారు జటలను కిరీటములను ధరించి యుండిరి (25).

వీరందరు చంద్రుని శిరస్సుపై ధరించిరి. నల్లని కంఠమును, మూడు కన్నులను కలిగియుండిరి. వారు హారములు, కుండలములు, కేయూరములు, కిరీటములు మొదలగు వాటితో అలంకరించుకొనిరి (26).

వారు బ్రహ్మ, ఇంద్రుడు, విష్ణువులతో సమమగు సామర్థ్యమును కలిగియుండిరి. వారిని అణిమాది సిద్ధులు సేవించుచుండెను. కోటి సూర్యుల కాంతితో ఒప్పు గణపతులు అచటకు వచ్చియుండిరి (27).

మహాత్ములు, దివ్యకాంతితో ఒప్పువారు, శివుని దర్శించుట యందు అభిరుచి గల వారునగు ఎందరో గణాధిపులు అచటకు వచ్చిరి (28).

గత్వా తత్ర శివం దృష్ట్వా నత్వా చక్రుః పరాం నతిమ్‌ | సర్వే సాంజలయో విష్ణుప్రముఖా నతమస్తకాః || 29
ఇతి విష్ణ్వాదిభిస్సార్దం మహేశః పరమేశ్వరః | కైలాసమగమత్ర్పీత్యా కుబేరస్య మహాత్మనః || 30
కుబేరోsప్యాగతం శంభుం పూజయామాస సాదరమ్‌ | భక్త్యా నా నోపహారైశ్చ పరివారసమన్వితః || 31
తతో విష్ణ్వాదికాన్‌ దేవాన్‌ గణాంశ్చాన్యానపి ధ్రువమ్‌ | శివానుగాన్స మానర్చ శివతోషణ హేతవే || 32

విష్ణువు మొదలగు వారందరు శివుని వద్దకు వెళ్లి, ఆయనను చూచి, దోసిలియొగ్గి శిరసా నమస్కరించి గొప్ప స్తోత్రములను చెసిరి (29).

పరమేశ్వరుడగు మహేశుడు విష్ణువు మొదలగు వారితో గూడి, మహాత్ముడగు కుబేరునియందలి ప్రీతితో, కైలాసమునకు వెళ్లెను (30).

కుబేరుడు పరివారముతో గూడి, వేంచేసిన శివుని ఆదరముతో, భక్తితో గూడిన వాడై అనేకములగు ఉపహారములనర్పించి పూజించెను (31).

తరువాత ఆయన శివుని ఆనందింపజేయుట కొరకై విష్ణువు మొదలగు దేవతలను, శివుని అనుచరులగు గణములను ఆదరముతో పూజించెను (32).

అథ శంభుస్సమాలింగ్య కుబేరం ప్రీతమానసః | మూర్ధ్ని చాఘ్రాయ సంతస్థావలకాం నికషాఖిలైః || 33
శాశస విశ్వకర్మాణం నిర్మాణార్థం గిరౌ ప్రభుః | నానాభ##క్తైర్ని వాసాయ స్వపరేషాం యథోచితమ్‌ || 34
విశ్వకర్మాతతో గత్వా తత్ర నానావిధాం మునే | రచయామాస ద్రుతం శంభోరనుజ్ఞయా || 35
అథ శంభుః ప్రముదితో హరిప్రార్థనయా తదా | కుబేరాను గ్రహం కృత్వా య¸° కైలాసపర్వతమ్‌ || 36

అపుడు శంభుడు ఆనందించిన మనస్సు గలవాడై, కుబేరుని ఆలింగనము చేసుకొని, లలాటముపై ముద్దిడి, అందరితో గూడి అలకానగర సమీపములో నుండెను (33).

ప్రభువగు శివుడు తనకు, తన భక్తులందరికీ నివసించుట కొరకై తగిన నివాసములను పర్వతమునందు నిర్మించుమని విశ్వకర్మను ఆజ్ఞాపించెను (34).

ఓ మహర్షీ! విశ్వకర్మ శంభుని యాజ్ఞచే కైలాసమునకు వెళ్లి, అచట నానావిధములగు ప్రాసాదములను శీఘ్రముగా నిర్మించెను (35).

అపుడు మిక్కిలి యానందించిన శివుడు విష్ణువు యొక్క ప్రార్థననాలకించి, కుబేరుని అనుగ్రహించి, కైలాస పర్వతమునకు వెళ్లెను (36).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము

24.Aug.2020

No comments:

Post a Comment