19. గీతోపనిషత్ - తుదిమెట్టు : సత్వగుణము నిత్య సత్యముగ నుండుట, అనగా రజస్సును, తమస్సును అధిష్టించి యుండు వాడే త్రిగుణములు దాటిన వాడగును.


🌹  19. గీతోపనిషత్ - తుదిమెట్టు : సత్వగుణము నిత్య సత్యముగ నుండుట, అనగా రజస్సును, తమస్సును అధిష్టించి యుండు వాడే త్రిగుణములు దాటిన వాడగును. అతనికే పూర్ణమైన రసానుభూతి అందిన ఫలము. ఇతరులకు అందని ద్రాక్ష పండే!  🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 45 📚

త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున |
నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్‌ || 45

మానవ జీవితము త్రిగుణములతో అల్లబడి నిర్వర్తింప బడుచున్నది. కొంత తవు రజోగుణము పని చేయుచుండగ విజృంభించి పనిచేయుట యుండును.

అటుపైన తమోగుణ మావరించి కాళ్ళు బారజాపుకొని యుండుట, అనారోగ్యము పొందుట, విశ్రాంతిని కోరుట యుండును. చేయుట, చేయకపోవుట అను రెండు స్తంభముల మధ్య తిరుగాడుచూ జీవుడు క్షణ కాలము, రెండు గుణములను తనయందిముడ్చుకొను సత్వగుణమును అతి స్వల్పముగ రుచిగొనును.

సత్వగుణ రుచి నిజమైన ఆనందమును కలిగించి అట్టి ఆనందము కొరకై అన్వేషించుట జరుగు చుండును. ఈ అన్వేషణముననే కాలము వ్యయమగు చుండును. రజస్సు, తమస్సు అనే గుణములు మనస్సున ద్వంద్వములున్నంత కాలము జీవుని యిటు నటు లాగుచుండును. సత్వగుణము ద్వంద్వముల కతీతమైనది. అందు రజస్సు - తమస్సు యిమిడి అదృశ్యమగును.

జీవితము ద్వంద్వముల క్రీయని గుర్తించిన జీవుడు, అవి కాలానుగుణముగ వచ్చిపోవు చుండునని తెలుసుకొన్నాడు. ప్రజ్ఞ మనస్సు యందు గాక, బుద్ధి యందు స్థిరపడును.

అప్పుడు సత్వగుణము నిత్య సత్యముగ నుండును. అనగా రజస్సును, తమస్సును అధిష్టించి యుండును. అట్టి వాడే త్రిగుణములు దాటిన వాడగును. అతనికే పూర్ణమైన రసానుభూతి అందిన ఫలము. ఇతరులకు అందని ద్రాక్ష పండే!

''నిస్త్రగుణ్యో భవ అర్జునా'' అని కృష్ణు సుతిమెత్తగ అర్జునుని హెచ్చరించుటకు కారణమిదియే. నిత్య సత్యమే పరిపూర్ణ జీవనానుభూతికి ప్రాతిపదిక.

వేదములు కూడ త్రిగుణాత్మకములైన విషయములనే తెలుపుచున్నవి కాని, తదతీతమైన స్థితికి లేదనియు, యోగవిద్య ఒక్కియే పరిష్కారమనియు భగవానుడు స్పష్టముగా తెలిపియున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

01.Sep.2020

No comments:

Post a Comment