కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 42


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 42 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి - 6 🌻

ఆత్మ పెద్ద అగ్ని స్వరూపం అనుకోండి. సూర్యుడువంటి అగ్నిస్వరూపం అనుకోండి. అందులో నుంచి వెడలుతున్నటువంటి విస్పులింగములు (నిప్పురవ్వలు) ఏవైతే వున్నాయో అలాంటివి ఈ మహిమలు, విభూతులు.

ఈ విభూతులన్నీ ఈశ్వర విభూతులనమాట. అవి ఈశ్వర స్థితి కలిగేముందు ఇలాంటి విభూతులు సూక్ష్మంలో నువ్వు ప్రవేశించావు అనేటటువంటి నిర్ణయం తెలియడం కోసం మాత్రమే ఉపయోగపడేటటువంటివి. వీటివల్ల ఏమీ ప్రయోజనం లేదు. యధాతధమైనటువంటి ఈశ్వరత్వం ఎటువంటిదంటే సహజ సూర్య ప్రకాశంవంటిది.

దానియందు ఏ రకమైన మహిమలు, ఏ రకమైన విభూతులు వుండవు. ఎంతగా అయితే సమస్త సృష్టికి ఆధారభూతమై సర్వసాక్షి స్వరూపమై, కర్మ సాక్షి స్వరూపమై సూర్యుడు ప్రకాశిస్తూ వున్నాడో ఆ రకం గా ఆత్మ హృదయ స్థానంలో సహజంగా స్వచ్ఛంగా వున్నది స్వరూప జ్ఞానంతో.

దానికి ఏరకమైనటువంటి చిన్న చిన్న - అంటే అర్ధం ఏమిటంటే - ఒక పైసా రెండు పైసలలాంటివనమాట ఇవన్న. కోట్లరూపాయల ఆస్థితో పోలిస్తే ఒకపైసా రెండుపైసలు అందుట్లో భాగమా కాదా అంటే, ఆ ఒకపైసా రెండు పైసలు కూడా అందుట్లో భాగమే. కాని కోటి రూపాయలతో పోలిస్తే ఈ ఒకపైసా రెండుపైసలు దేనికి ప్రయోజనం? ప్రయోజనం లేదు.

కోహినూరు వజ్రానికి మన పెట్టుకునేటటువంటి రంగు రాళ్ళకీ - అదీ రాయే ఇదీ రాయే కదండీ అంటే. రాయే ఎవరుకాదన్నారు? కాని అనంతవిశ్వంతో పోలిస్తే ఇవన్నీ ఎందుకూ కొరగానటువంటివి. అంతేనా కాదా? భూమండలం మొత్తాన్నీ, నవగ్రహాలు మొత్తాన్నీ మనం రంగురాళ్ళు పెట్టుకుని ఏమార్చగలుగుతామా? ఆలోచించిచూడండి.

మానవుడుకి భ్రాంతి ఎంత దూరం వచ్చేసిందయ్యా అంటే ఏమండీ మీకు కుజగ్రహ దోషం వుంది కాబట్టి మీరీ పచ్చ రంగు రాయి పెట్టుకోండి, ఆ దోషం పోతుంది, అంటే ఆనందపడిపోతాడు అంతే. ఓ పచ్చరాయి పెట్టుకుని నాకు కుజగ్రహ దోషం పోయింది అంటాడు.

ఈశ్వరానుగ్రహం కోసం ప్రయత్నిస్తే పోతుంది గానీ - ఎందుకనీ - దైవానుగ్రహం వున్న గ్రహములేమి చేయును? అందరూ ఈశ్వరుడి మీద ఆధారపడి వున్నారు. సమస్త సృష్టీ ఈశ్వరాధారంగా వుంది. అంతేతప్ప ఎవరికివారు వ్యక్తిగతంగా ఎవరూ ఏమీ చేయలేరు.

మరి అట్టి ఈశ్వరానుగ్రహం కోసం నువ్వు తపమో, జపమో, ఆచరణో, విధానమో, ధ్యానమో, మరొక సాధనా క్రమమో ఆశ్రయించి నువ్వు ఈశ్వరానుగ్రహాన్ని పొంది, నీ మనో బుద్ధులని అధిగమించి, నీ హృదయస్థానంలో నిలబడేటటువంటి ప్రయత్నాన్ని చేయాలేగానీ నీవు గ్రుడ్డివాడు ఏనుగును పట్టుకుని మెత్తగా వుంది, కుచ్చు వలే వుంది, స్తంభము వలే వుంది, కొండవలే వుంది అనేటటువంటి తాత్కాలికమైనటువంటి అనుమాన ప్రమాణములతో పొగ వస్తుంది కాబట్టి నిప్పు వుందని, ఇలాంటి ప్రత్యక్ష అనుమాన ప్రమాణములతో ఈ ఆత్మని నిర్ణయించడానికి వీలు కాదు.

కాబట్టి తర్కము మూలమున ఆత్మను తెలిసికొనలేము. తర్కము బుద్ధిగతమైనటువంటిది. బాగా గుర్తుపెట్టుకోండి ఇది. - విద్యా సాగర్ స్వామి

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

01.Sep.2020

No comments:

Post a Comment