20. గీతోపనిషత్తు - ఆచరణ - ఆచరణము లేని జిజ్ఞాస జీవుని భ్రష్టుని చేయగలదు. ఆచరణములోనే సమస్తమూ అనుభవమునకు వచ్చును.


🌹   20. గీతోపనిషత్తు - ఆచరణ - ఆచరణము లేని జిజ్ఞాస జీవుని భ్రష్టుని చేయగలదు. ఆచరణములోనే సమస్తమూ అనుభవమునకు వచ్చును.  🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 46 📚

వేదమపారము. జ్ఞానమునూ అపారమే. తెలియవలసినది ఎప్పుడునూ యుండును. తెలిసిన దానిని ఆచరించుట అను మార్గమున మరికొంత తెలియుట యుండును.

యావానర్థ ఉదపానే సర్వత: సంప్లుతోదకే |
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత: || 46

ఈ మార్గమున తెలియుటలో అనుభవము వుండును. అనుభూతి యుండును. మరియూ తెలిసినది అక్కరకు వచ్చును. ఊరికే తెలుసుకొనుట వలన ఉపయోగము లేదు. అది అక్కరకు రాదు. అనుభూతి నీయదు. అనుభవమూ కలుగదు. ఆచరణము లేని జిజ్ఞాస జీవుని భ్రష్టుని చేయగలదు. ఆచరణములోనే సమస్తమూ అనుభవమునకు వచ్చును.

ఊరకే తెలుసు కొనుట వలన మెదడు వాచి, తెలిసిన వాడనను అహంకారము బలిసి జీవుడు భ్రష్టుడగును. బ్రహ్మమును తెలిసిన వారందరూ ఆచరణ పూర్వకముగా నెగ్గిన వారే. బోధనలను వినుట వలన, గ్రంథంములను పఠించుట వలన, తెలియునది పుస్తక విజ్ఞానమే.

ఆచరించు వారిదే అసలు విజ్ఞానము. తెలుసుకొనుట, తెలిసినది ఆచరించుట అనునవి అనుశ్యాతముగ ఉఛ్వాస నిశ్వాసములవలె సాగుట క్షేమము. అది తెలిసిన వారే తెలిసినవారని, యితరులు మిధ్యాచారులని

భగవంతుడు బోధించి యున్నాడు.

భారతీయులకిదియే ప్రస్తుత కర్తవ్యము.

ఉదాహరణకు, దాహము కలిగిన వానికి బావి కనపి నప్పుడు, అందుండి తనకు వలసిన జలములను గ్రోలి తృప్తి చెందుట క్షేమము.

అంతియేకాని, అసలా బావియందు ఎంత నీరున్నది? దినమున కెంత ఊరుచున్నది? ఎంతమంది ప్రతి దినమూ త్రాగినచో బావి ఎండక యుండును? అను జిజ్ఞాసలో పినచో, గొంతెండి చనిపోవుటయేయుండును. చదివిన వారందరూ తెలిసినవారు కారనియు, రామకృష్ణ - వివేకానందుల వలె ఆచరించినవారే తెలిసినవారని తెలియవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

02 Sep 2020

No comments:

Post a Comment