భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 100


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 100 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పిప్పలాద మహర్షి - 2 🌻

7. పరీక్షించాలనే బుద్ధి దేవతలకు ఎందుకు పుడుతుందని సందేహం కలుగవచ్చు. పరీక్షించబడనటువంటి గుణమేదైనా, అది ఋజువు కానట్లే అర్థం. ఉదాహరణకు పతివ్రత ఒకరున్నారు. ఒక పరీక్ష తర్వాతే ఆమే మహత్తు ఈ లోకానికి తెలుస్తుంది.

8. అటువంటప్పుడు ధర్మదేవతకు ప్రమాదం(శాపం) కలిగి, మరి ధర్మదేవత క్షీణిస్తున్నది కదా, దానివల్ల లోకానికేం లాభం! అన్న సందేహం కూడా కలుగవచ్చు. అది విధిలోని యుగధర్మం. ఈ సంఘటన నిమిత్తమాత్రం.

9. ప్రతి ఋషిచరిత్రలో ఈ పరీక్షలో వాళ్ళు గెలిచినట్లు, వాళ్ళ మహిమలు ఋజువయినట్లు గాథలతో చెపుటున్నారు. సామాన్యుడికి పరీక్ష ఉండదు. గొప్పవాళ్ళకే ఈ పరీక్షలన్నీ ఉంటాయి.

10. ధర్మదేవత అంటే సృష్టిలో లోకాలను పరిపాలించి పోషిస్తున్నటువంటి శక్తి. సమస్త దేవతలలోనూ, యక్ష, కిన్నేర, కింపురుషాది దేవతలందరిలో కూడా ధర్మము అనే భావన్-అలాంటి ఒక శక్తి-ఉంది. దేంట్లో ధర్మభావన ఉంటుందో అదే ఈ జగత్తుకు క్షేమంగా ఉండటానికి కారణమౌతోంది.

11. జగత్కల్యాణం కోసం పుణ్యం సంపాదిస్తుంటారు. పుణ్యానికి ముందు ధర్మభావన ఉండాలి.ధర్మమందు నిష్ఠ కలిగిన వాడే పుణ్యం చేస్తాడు. అంటే ధర్మమే లోకలో క్షేమము. ధర్మం ఏం చెబుతుంది? పుణ్యం చేయమని చెబుతుంది. పుణ్యము, తపస్సు, దానము, అన్నీకూడా ధర్మం ఆధీనంలోనే ఉంటాయి.

12. మిగతా దేవతలందరినీ బ్రహ్మ సృష్టించారు కదా! మరి ధర్మదేవతను ఎవరు సృష్టించారు? అంటే, సృష్టి అలాగే ఉంది. దేవతలందరినీ ఈశ్వరుడే సృష్టించారు. అయితే ధర్మదేవతను మాత్రం ఆయన సృష్టించలేదు.

13. ప్రత్యేకంగా ధర్మదేవత అని ఎవరూ సృష్టింపబడలేదు. యముడున్నాడు. ఆయనను ధర్మదేవత అంటాం. యముడి యొక్క అధికారం ఏమిటి? క్రింది లోకాలలోని జీవుల యొక్క పాపపుణ్యాల విచారణ జరిపి వాళ్ళకు ఉత్తరగతులను నిర్ణయించడం ఆయన పని. అంతవరకు మాత్రమే ధర్మదేవత. అతడిని ధర్ముడని, ధర్మదేవత అని అంటారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

02 Sep 2020

No comments:

Post a Comment