శ్రీ శివ మహా పురాణము - 213


🌹 .  శ్రీ శివ మహా పురాణము - 213  🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

47. అధ్యాయము - 2

🌻. కామప్రాదుర్భావము - 2 🌻

పురా యదా శివో దేవో నిర్గుణో నిర్వికల్పకః | అరూపశ్శక్తిరహితశ్చిన్మాత్రస్సదసత్పరః || 12

అభవత్స గుణస్సోsపి ద్విరూపశ్శక్తిమాన్‌ ప్రభుః | సోమో దివ్యాకృతిర్విప్ర నిర్వికారీ పరాత్పరః || 13

తస్య వామాంగజో విష్ణుర్బ్రహ్మాం దక్షిణాంగజః | రుద్రో హృదయతో జాతోsభవచ్చు మునిసత్తమ || 14

సృష్టి కర్తాsభవం బ్రహ్మా విష్ణుః పాలనకారకః | లయకర్తా స్వయం రుద్రస్త్రిధా భూతస్సదాశివః || 15

శివదేవునకు రెండు రుపములు గలవు. ఒక రూపములో ఆయన నిర్గుణుడు, నిర్వికల్పుడు, రూపము లేని వాడు, శక్తి భేదము లేనివాడు, చైతన్యఘనుడు, మరియు కార్యకారణభావాతీతుడు (12).

ఆయనయే రెండవ రూపములో సగుణుడు, శక్తి భేదమము గలవాడు, జగత్ర్పభువు, ఉమాసహితుడు, దివ్యమగు ఆకారము గలవాడు. ఓ విప్రా! ఆయన వికారములు లేనివాడు, సర్వోత్కృష్టుడు (13).

విష్ణువు ఆయన ఎడమ భాగము నుండి పుట్టెను. బ్రహ్మనగు నేను ఆయన కుడి భాగము నుండి పుట్టితిని. ఓ మునిశ్రేష్ఠా! రుద్రుడు హృదయము నుండి పుట్టెను (14).

బ్రహ్మనగు నేను సృష్టిని చేసితిని. విష్ణువు పాలించుచున్నాడు. రుద్రుడు లయమును చేయును. సదాశివుడు ఈ త్రిమూర్తుల రూపములో స్వయముగా నున్నాడు (15).

తమేవాహం సమారాధ్య బ్రహ్మ లో కపితామహః | ప్రజాస్ససర్జ సర్వాస్తా స్సురాసుర నరాదికాః || 16

సృష్ట్వా ప్రజాపతీన్‌ దక్షప్రముఖాన్‌ సురసత్తమాన్‌ | అమన్యం సుప్రసన్నోsహం నిజం సర్వమహోన్నతమ్‌ || 17

మరీచిమత్రిం పులహం పులస్త్యాంగిరసౌ క్రతుమ్‌ | వసిష్ఠం నారదం దక్షం భృగుం చేతి మహాప్రభూన్‌ || 18

బ్రహ్మాహం మానసాన్‌ పుత్రానసర్జం చ యదా మునే | తదా మన్మనసో జాతా చారురూపా వరాంగనా || 19

లోకపితా మహుడు, బ్రహ్మ అగునేను ఆ సదాశివుని ఆరాధించి, దేవతలు, రాక్షసులు, మానవులు మొదలగు సంతతిని సృష్టించితిని (16).

దక్షుడు మొదలగు దేవ శ్రేష్ఠులగు ప్రజా పతులను సృష్టించి, నేను చాల ప్రసన్నుడనై నన్ను నేను చాల గొప్ప వానినిగా తలపోసితిని (17).

ఓ మహర్షీ! బ్రహ్మనగు నేను మరచి, అత్రి, పులహుడు, పులస్త్యుడు, అంగిరసుడు, క్రతువు, వసిష్ఠుడు, నారదుడు, దక్షుడు, భృగువు మొదలగు గొప్ప సమర్థులైన (18)

మానసపుత్రులను సృష్టించిన తరువాత నా మనస్సునుండి సుందరమగు రూపము, శ్రేష్ఠమగు అవయమములు గల ఒక యువతి జన్మించెను (19).

నామ్నా సంధ్యా దివః క్షాంతా సాయం సంధ్యా జవంతికా | అతీవ సుందరీ సుభ్రూర్ముని చేతో విమోహినీ || 20

న తాదృశీ దేవలోకే న మర్త్యే న రసాతలే | కాలత్రయేsపి వై నారీ సంపూర్ణ గుణశాలినీ || 21

దృష్ట్వా హం తాం సముత్థాయ చింతయన్‌ హృది హృద్గతమ్‌ | దక్షాదయశ్చ స్రష్టారో మరీచ్యా ద్యాశ్చ మత్సుతాః || 22

ఏవం చింతయతో మే హి బ్రహ్మణో మునిసత్తమ | మానసః పురుషో మంజురావిర్భూతో మహాద్భుతః || 23

ఆమె పేరు సంధ్య. ఆమె పగలు క్షీణించి యుండును. సాయంకాలము సుందరముగా ప్రకాశించును. ఆమె మిక్కిలి సుందరి. చక్కని కనుబొమలు గలది. మహర్షుల మనస్సులను వ్యామోహపెట్టునది (20).

సంపూర్ణ గుణములతో విరాజిల్లే అట్టి సుందరి మూడు కాలముల యందు దేవలోక, మనుష్యలోక, పాతాళ లోకములయందు లేదు (21).

ఆమెను చూచి నేను లేచి నిలబడి, నా మనస్సులో నా కుమారులైన దక్షాది ప్రజాపతులను, మరీచి మొదలగు ఋషులను స్మరించుచుండగా (22),

అట్టి నానుండి ఒక పురుషుడు ఉదయించెను. ఓమునిశ్రేష్ఠా! ఆతడు గొప్ప సౌందర్యము గలవాడై, మహాద్భుతముగా నుండెను (23).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము

02 Sep 2020

No comments:

Post a Comment