కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 43


🌹.  కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 43  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి - 7 🌻

ఎంతకాలమైతే తర్కిస్తూ వుంటామో, అది బుద్ధి పరిధి వరకే పనిచేస్తుంది.

“బుద్ధిగ్రాహ్యమతీంద్రియం” ఈ బుద్ధిని ఎంతగా పెంచాలయ్యా, ఎంతగా ఓడించాలయ్యా - రెండు పనులు చేయాలి - దీన్ని బాగా పెంచాలి మొదటి దశలో. రెండవ దశలో ఏం చేయాలిట? ఓడించాలి. నీ బుద్ధిని నీవే ఓడించాలి.

నీ బుద్ధియొక్క కర్మ ప్రేరితంగా ఏర్పడుతున్నవాటిని నీవే నిరసించాలి. నీవే అధిగమించాలి. అలా నువ్వు చేయగలిగినప్పుడు మాత్రమే బుద్ధి ఓడిపోయి సాక్షిత్వ స్థితియందు నిలకడ చెందుతుంది.

మనోబుద్ధులు సాక్షిత్వస్థితియందు ఎవరికైతే నిలకడ చెందినాయో అట్టి సాక్షిత్వ జ్ఞానం చేత మాత్రమే ఆత్మను నిర్ణయించడానికి వీలవుతుంది. తర్కము కంటే భిన్నమైనటువంటి ఆత్మవిదుల ఉపదేశం వలన కలిగిన జ్ఞానమే సరియైనటువంటిది. ఇది చాలా ముఖ్యం. ఎవరిదగ్గరికైతే వెళితే నీకు తర్కాన్ని ఉపదేశిస్తారో వాళ్ల వలన నీవు ఆత్మోపదేశాన్ని పొందలేవు.

ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అదెలా కుదురుతుందీ, ఇదెలా కుదురుతుందీ, అలా ఎలా కుదురుతుందీ, ఇలా ఎలా కుదురుతుందీ అనే బుద్ధిప్రచోదనం చేత జరిగేటటువంటి చర్చల వల్ల ఆత్మ యొక్క నిర్ణయం జరుగదు.

ఆత్మ నిర్ణయం జరగాలి అంటే మనోబుద్ధులు ఆగిపోయినటువంటి స్థితిలో, మనోబుద్ధులు హృదయస్థానంలో సంయమించబడినటువంటి స్థితిలో, నిర్వాణ ప్రజ్ఞా స్థితిలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అటువంటి నిర్వాణ ప్రజ్ఞను ప్రతిఒక్కరూ పొందాలి అనేటటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని చెప్తున్నారు.

నీవెట్టి దృఢ సంకల్పముతో ప్రలోభములకు లోనుగాక ఆత్మ జ్ఞానము నొందుటకు ధీరచిత్తముతో నుంటివో, అట్టి సత్యధృతివైన నీవంటి శిష్యులు మా దగ్గరకువచ్చి ఆత్మజ్ఞానమును పొందుదురుగాక!

ఇది చాలా ముఖ్యమైనటువంటిదండి. ధీరచిత్తము అంటే చిత్తములో ఏర్పడేటటువంటి వృత్తులు ఏవైతే వున్నాయో , ఆ చిత వృత్తులను నీవు అధిగమించినటువంటి వాడవైనప్పుడు మాత్రమే నీవు ఆత్మ జ్ఞానం కొరకు ప్రయత్నం చేస్తావు.

నీవు ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనేటటువంటి ఉత్తమమైనటువంటి స్థితికి అర్హత సంపాదించాలీ అంటే నీకు అడ్డమైనటువంటి అంశము ఏమిటంటే చిత్తవృత్తి. కాబట్టి యోగమార్గము యొక్క లక్ష్యము ఏమిటంటే ఆత్మ సాక్షాత్కార జ్ఞానం. “యోగాః చిత్తవృత్తి నిరోధకః” అనే సూత్రం ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానమ్మ్ దృష్ట్యానే, ఆ లక్ష్యం దృష్ట్యానే ఏర్పరచబడింది.

ఎవరైతే వారివారి చిత్తవృత్తులను బాగుగా, నిశ్శేషముగా నిరోధించి చిత్త ఉపశాంతి, చిత్తశుద్ధి, నిర్మలమైనటువంటి చిత్తము ఎవరైతే సాధిస్తారో, వాళ్ళు మాత్రమే సరియైనటువంటి ఆచార్యుడిని ఆశ్రయించి వాళ్ళు ఆత్మజ్ఞానమును పొందెదరుగాక! అనేటటువంటి ఆశీఃపూర్వకమైన వాక్యమును ఇక్కడ వేశారనమాట. చూడండి ఎంత దృఢంగా చెప్తున్నారో.

“అట్టి సత్యధృతివైన నీవంటి శిష్యులు మా దగ్గరకువచ్చి ఆత్మజ్ఞానమును పొందుదురుగాక!”

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

02 Sep 2020

No comments:

Post a Comment