33. గీతోపనిషత్ - ప్రసాద స్థితి - రాగద్వేషాది ద్వంద్వములు లేక దీర్ఘకాలము కర్తవ్యమును నిర్వర్తించు వానికి ఈ నిర్మల స్థితి ఏర్పడును. అదియే ప్రసాద స్థితి


🌹  33. గీతోపనిషత్ - ప్రసాద స్థితి - రాగద్వేషాది ద్వంద్వములు లేక దీర్ఘకాలము కర్తవ్యమును నిర్వర్తించు వానికి ఈ నిర్మల స్థితి ఏర్పడును. అదియే ప్రసాద స్థితి  🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ



📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 65 📚


65. ప్రసాదే సర్వదు:ఖానాం హాని రస్యోపజాయతే |

ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధి: పర్యవతిష్ఠతి


బుద్ధిమంతుడగు సాధకుడు సధ్రంథములందు వాడిన పదములను శ్రద్ధాభక్తులతో, పరిశీలనా దృష్టితో గ్రహించుట నేర్వవలెను. అపుడే గ్రంథస్థ విషయము నందలి లోతులు లేక రహస్యములు బయల్పడగలవు. ఈ దృష్టి శ్రద్ధాళువుల కుండును.

కావున గ్రంథ పఠనమునకు శ్రద్ధ అత్యంత అవసరము. ఉదాహరణకు పై శ్లోకమున ప్రసాదము స్వీకరించుటచే సర్వ దుఃఖములు నశించుననియు, ప్రసన్నమైన మనస్సు కలుగుననియు, అట్టి మనస్సు బుద్ధియందు స్థిరపడుననియు తెలుపబడి యున్నది. ఇది కారణముగ భగవత్కార్యముల యందు ప్రసాదము నకు విశేష స్థాన మేర్పడినది.

నిజమునకు ప్రసాదమనగా తిండి పదార్థము కాదు. ప్రశస్తమైన మనో నిర్మలత్వము. పూజ, అభిషేకము, హోమము మొదలగు దైవారాధన కార్యములను సత్వగుణ ప్రధాన ముగ నిర్వర్తించు వానికి ఏర్పడు స్థితి “ప్రసాద స్థితి."

అతడు పై కార్యములను సత్వగుణ ప్రధానముగ నిర్వర్తించుటచే అందలి ఫలితముగ మనో నిర్మలత్వమును పొందుచున్నాడు. అట్టి మనో నిర్మలత్వము కారణముగ వృద్ధి గావింపబడిన అతని చేతస్సు బుద్ధియందు స్థిరపడుచున్నది. అది ప్రసాద ఫలితము.

కేవలము 'పొట్ట నిండ ప్రసాదము మెక్కువానికి ఈ స్థితి కలుగదు. వారు మరియొక ప్రసాద భక్తులు. భగవంతుడు తెలిపిన ప్రసాదము సామాన్యు లెరిగిన ప్రసాదము కాదని తెలియవలెను. పూజాది కార్యక్రమములను డంబాచారముగ, కీర్తికొరకు నిర్వర్తించువారు రజోగుణ దోషము కలిగిన వారు.

వీరు ఎన్ని పూజలు నిర్వర్తించి నప్పటికిని మనశ్శాంతి కొరవడును. ఆరాటములు, తత్సంబంధిత వికారములు, వారి ప్రవర్తనల యందు గోచరించుచుండును. వారి నుండి అనుస్యూతము అశాంతి ప్రసరించుచుండును.

శాస్త్ర విధుల నుల్లంఘించి, పూజాది క్రతువులను తమ ఇష్టము వచ్చినట్లు చేయువారు తమోగుణ దోషము కలవారు. వీరు చేయు క్రతువులు వీరినే బంధించగలవు. దుష్పలితములు గూడ ఏర్పడగలవు. యజ్ఞార్థ కర్మలు, దైవకార్యములు మనోనిర్మలత్వమును చేకూర్చ వలెను. అదియే ప్రసాద స్థితి.

తెలుగువారు "సాద, సీద” అను పదములను వాడుచుందురు. ఒక వ్యక్తి నుద్దేశించి అతడు సాద, సీద మనిషి అని అనుచుందురు. నిజమునకు వారీ ఉద్దేశ్యము స్పష్టత, ముక్కుసూటితనము కలవాడని తెలుపుటకు పై పదములు వాడుదురు.

సాద అన్న పదము స్పష్టతకు సంకేతమైనచో ప్రసాద అను పదము ప్రశస్తమైన స్పష్టత అని తెలియవలెను. అట్లే సీద అను పదమును ప్రసీదగా భావించ వలెను. ఇట్టి పరిశీలనా బుద్ధి చదువరు లేర్పరచుకొందురు గాక !

ప్రసాద స్థితి వలన సర్వదు:ఖములు నశించుట సహజము. ప్రసాద మనగా మనో నిర్మలత్వము అని ఇదివరకే తెలుపబడినది. రాగద్వేషాది ద్వంద్వములు లేక దీర్ఘకాలము కర్తవ్యమును నిర్వర్తించు వానికి ఈ నిర్మల స్థితి ఏర్పడునని కూడ ఇదివరకే తెలుపబడినది. రాగద్వేష విముక్తునకు మాత్రమే కదా ప్రసాదస్థితి.

ద్వంద్వములతో ముడి తెగినవానికి కర్తవ్యమే ఉండును గాని, దాని ఫలితము లిట్లుండవలెనని ఆశయ ముండదు. ఇది భగవానుని ముఖ్యమైన బోధ. “నీ ధర్మమును నీవు నిర్వర్తింపుము. ధర్మ నిర్వహణ యందు ప్రశాంతత యున్నది. అట్టి ప్రశాంతత ఫలితములను కోరినపుడు లేదు.

జయము, అపజయము నీ కనవసరము. కర్తవ్య నిర్వహణమే నీవంతు.” అని అర్జునునకు మరల మరల బోధించినాడు కదా. జీవుని మనస్సు కర్తవ్యము నందే నిమగ్నమై నపుడు "ఇట్లు జరుగవలెను. ఇట్లు జరుగరాదు" అను భావములందు చిక్కుకొన నపుడు అతనికి దుఃఖ కారణమే లేదు. కావున దుఃఖమే లేదు.

అట్టి నిర్మలత్వము నొందిన మనస్సు మిక్కుటముగ, శీఘ్రముగ బుద్ధియను వెలుగునందు నిలచును. 64, 65 శ్లోకములు జీవచైతన్యము ఇంద్రియార్థముల నుండి బుద్ధిని చేరు సోపాన మును వివరించుచున్నవి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

20 Sep 2020

No comments:

Post a Comment