కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 57


🌹.  కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 57  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ



🌻. ఆత్మ విచారణ పద్ధతి - 21 🌻

ఆత్మ తన బుద్ధిగుహ యందే వున్నప్పటికీ, విషయాలతో కూడుకుని వున్న సాధారణ మానవుడు తెలుసుకొనలేక యున్నాడు.

ఎక్కడ తెలుసుకోవాలి? ఎక్కడ తెలుసుకోవాలి అని కాశీ వెళ్ళినా, రామేశ్వరం వెళ్ళినా, ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరిగినా, అష్టాదశ శక్తిపీఠాలు తిరిగినా, ప్రపంచంలో వున్న ఏడువింతల్ని తిరిగి చూసినా కూడా నీవు ఆత్మతత్త్వాన్ని పొందలేవు.

భూమండలానికి ఒక విమానం వేసుకుని ప్రదక్షిణం చేసి తిరిగి వచ్చినా సరే, పొందలేవు. ఎందువలన అంటే, ఇది నీ బుద్ధి గుహయందే వున్నది కాబట్టి. నీ హృదయస్థానమందే వున్నది కాబట్టి. నీవు ఎప్పటికైనా సరే, నీ హృదయస్థాన నిర్ణయాన్ని తెలుసుకుని, అదే స్థానమున ఉన్నటువంటి, స్వస్వరూపజ్ఞాన సాక్షాత్కార నిర్ణయాన్ని నీవు దర్శనపద్ధతిగా పొందాలి.

అట్లా పొందినటువంటి వాడు ఎవడైతే వున్నాడో, వాడు మాత్రమే ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని అందుకోగలుగుచున్నాడు. ఇతరత్రా ఏ కర్మల చేత గానీ, ఏ నిర్ణయముల చేత గానీ, ఏ పనుల చేత గానీ, ఏ పద్ధతుల చేత గానీ ఇది సాధింపబడదు. తదేక నిశ్చలత కలిగి వుండి, చిత్తమును చైతన్యమునందు రమింప చేయగలిగేటటువంటి సమర్థుడవు కావలెను - అని మరలా స్పష్టముగా, నిర్ణయముగా బోధించుచున్నారు.

మృత్యువు వశుడగుటచేత మనుష్యుడు మర్త్యుడున బడుచున్నాడు. ఈ మనుష్యుడు నేను చెప్పబోవునట్టి ఆత్మతత్త్వమును, ఆచార్యుని ఉపదేశమును శ్రద్ధగా విని మననాదులచేత బాగుగా నెరింగి, ఆనందాది ధర్మయుక్తమున, అతి సూక్ష్మమును అగు ఆత్మతత్వంను, శరీరాదికము నుండి వేరుపరిచి బాగుగా గ్రహించును, అట్లాత్మను బొందిన విద్వాంసుడు సర్వ దుఃఖముల నుండి విముక్తుడై బ్రహ్మానందము ననుభవించును. అర్హుడైన నచికేతునకు మోక్షద్వారములు తెరువబడి యున్నవని తలంచుచున్నాను.

అధికారిత్వము పొందగానే, నీకు ఆ అధికారిత్వం ప్రభావం చేత, మోక్షద్వారములు తెరువబడుతాయి. ఇది చాలా ముఖ్యం. ఎట్లా అట ఇది? ఆత్మ వల్ల ఏమిటండీ? ‘ఆత్మసాక్షాత్కార జ్ఞానం’ పొందటం వలన నీకేమిటి ప్రయోజనం? అంటే, సర్వదుఃఖముల నుండీ విముక్తుడై, బ్రహ్మానందమును అనుభవించును. ఇది చాలా ముఖ్యం.

పిపీలికాది బ్రహ్మపర్యంతము ఉన్నటువంటి సమస్త జగత్తునందు వ్యాపకమై వున్నటువంటి, బ్రహ్మతత్వము ఏదైతే వున్నదో, అట్టి బ్రహ్మానుభూతిని బడసి, సర్వవ్యాపకమైన స్థితియందు స్థిరముగా నిలబడియుండి, తానే బ్రహ్మమైనటువంటి అహంబ్రహ్మాస్మి అనే బ్రహ్మనిష్ఠను పొందుతాడు. అట్లా బ్రహ్మనిష్ఠను పొందడం ద్వారా సచ్చిదానందమనెడి స్థితిని, నిరంతరాయమానంగా అనుభూతమొనర్చుకుంటూ వుంటాడు. ఇది చాలా ముఖ్యం. శరీరాదికమునుండీ వేరుపరచీ ఇది చాలా ముఖ్యము.

నీవు నీ శరీరంలోనే విడివడిపోయి వున్నటువంటి స్థితిని నీవు గుర్తించాలి. ఆ గుర్తింపు శక్తి రావాలి. శరీరమే నేనుగా వున్నటువంటి స్థితినుంచీ, శరీరము నేను కాదు, శరీరము నందు నేను వేరే. క్షేత్రము వేరే క్షేత్రజ్ఞుడు వేరే, దేహము వేరే దేహి వేరే, శరీరము వేరే శరీరి వేరే. ఆత్మ అనేది సాక్షి. ఇట్టి సాక్షిభూతమైనటువంటి వాడు, శరీరము నుంచీ వేరుగా వున్నాడు. అది ఎలా పొందాలట?

‘మర్త్యుడు’ - అన్న పేరెందుకు పెట్టారంటే మానవులందరికీ మృత్యువుకు వశమై వున్నాడు. ఎల్లప్పుడూ ఆ మరణభయాన్ని పొందుతూ వుంటాడు. ఆ మృత్యువుకు సిద్ధముగా వుండడు. ఇంకా ఈ చూరు పట్టుకునే అనేక జన్మలు వేళాడుదామనేటటువంటి పద్ధతిగా, గబ్బిళం పద్ధతిగా వుంటాడు.

ఈ శరీరాన్ని నేను విడవను, ఈ శరీరాన్ని నేను విడవను, ఈ శరీరమే నాకు కావాలి, శరీమందు వుంటేనే కదా, నేను ఏమైనా అనుభోక్తవ్యం అయ్యేది? కాబట్టి శరీరమును నేను విడువజాలను అని శరీరాన్నే పట్టుకుని, శరీర తాదాత్మ్యత భావము చేత పొందేటటుంవంటి నరకమునంతా అనుభవిస్తూ వుంటాడు. కాబట్టి మానవులందరికి ‘మర్త్యులు’ అని పేరు పెట్టారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


20 Sep 2020

No comments:

Post a Comment