✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 71 📚
ఏ మనుజుడైతే రాగద్వేషములను విడుచునో, ఎవడైతే విషయముల యందు ఆసక్తి విడుచునో, మమకారమును అహంకారమును విడుచునో అట్టివాడు శాంతిని పొందునని భగవానుడు ఈ శ్లోకమున తెలుపుచున్నాడు. ఇందు నాలుగు స్థితులను వివరించుచున్నాడు.
విహాయ కామాన్ య స్సర్వాన్ పుమాం శ్ఛరతి నిస్స్పృహః |
నిర్మమో నిరహంకారః స శాంతి మధిగచ్ఛతి || 71
ఇందు మొదటిది కామ విసర్జనము. సర్వమతముల యందు, సర్వశాస్త్రముల యందు కామమును విసర్జింపుమని తెలుపబడుచునే యుండును. కర్తవ్యము ననుసరించుట వలన మాత్రమే కామము విసర్జించుటకు వీలుపడునని తెలియవలెను.
కర్తవ్యమనగా చేయవలసిన పని. కామ మనగా చేయదలచిన పని. తాను తలచిన పనులు చేయుటకాక, వలసిన పనులను చేయుట ముఖ్యము. ఇవి ఆరోహణ క్రమమునకు గడప వంటివి.
అట్లు కర్తవ్యమును మాత్రమే చేయ దీక్ష పూనిన వానికి మార్గమున అనేకానేక విషయములు కన్పట్టుచుండును. అందనురక్తి కొన్నవాడు కర్తవ్య విముఖుడు కాగలడు.
విషయానురక్తుడు కర్తవ్యపాలనము చేయలేడు. అందుచే విషయాసక్తిని విసర్జించుచు, కర్తవ్యము నిర్వర్తించుచు సాగిపోవలెను. అటు పైన సాధకునకు మమకార మను అవరోధమేర్పడును. నాది అను భావమే మమకారము. తన శరీరము, తన వారు, తన సంపద అనునవి మమకార స్థానములు.
తనది అనుకొనినదంతయు నిజమునకు దైవమునదే అని భావించుట సాధనగ సాగవలెను. శరీరమునకు, తనను ఆశ్రయించిన వారికి, తన చుట్టూ ఏర్పడిన సంపదకు యజమాని దైవమే యనియు, తాను కేవలము ధర్మకర్త అనియు భావింప వలెను. ధర్మకర్తయనగా వాని యందు తన ధర్మము నిర్వర్తించుటే గాని యాజమాన్యము కాదు. ఇట్టి భావనను థిరపరుచుకున్నవానికే మమకారమను పొర తెగును.
అహంకారము వర్ణించుట తుది మెట్టు. కర్తవ్యమును చేకొని కామమును వర్ణించుట, కర్తవ్య పాలనమున ఆకర్షణీయమగు విషయముల యందు అనురక్తిని వర్ణించుట, "తనది” అను భావమును వర్ణించుట అను మూడు సోపానములను అధిరోహించిన సాధకుడు “తాను” అను భావమును కూడ వర్ణించుట తుది మెట్టు.
నిజమునకు తానులేడు. తానుగ దైవమే యున్నాడు. కాని తా నున్నాడననుకొను చున్నాడు. అట్లనుకొనుటయే అహంకారము.
తనకొక ప్రత్యేక అస్థిత్వము లేదు. దైవమే జీవుడుగా నుండగ, జీవుడు తానున్నాడను కొనుటయే మొదటి మాయావరణము. బంగారము లేక ఉంగరము లేదు. మట్టి లేక కుండ లేదు. సముద్రము లేక కెరటము లేదు. దైవము లేక జీవుడు లేడు. ఈ జ్ఞానము పూర్ణ జ్ఞానమునకు తుది మెట్టు. దీని నధిరోహించుటకు "తా నుండుట అనగా నేమి?" అను అంశముపై విచారణ తీవ్రముగ సాగవలెను.
సమాధానము దర్శించినపుడు అహంకారము నశించును. నిరహంకారి యగును. అతనిది స్థిరమైన శాంతి. అహంకారికి శాంతి లేదు. మమకారికి అసలు లేదు.
విషయానురక్తునకు బొత్తిగ శాంతి లేదు. కాముకునకు అశాంతి స్థిరముగ నుండును. ఈ నాలుగ సోపానములు అధిరోహింప జేయుటకే పదునెనిమిది అధ్యాయముల గీతోపదేశము.
ఈ సోపానముల నధిరోహించుటనే ఉపనిషత్తులు సూచించుచున్నవి. యోగవిద్య బోధించుచున్నది. బ్రహ్మవిద్య ఘోషించుచున్నది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
27 Sep 2020
No comments:
Post a Comment