శ్రీ శివ మహా పురాణము - 233


🌹 .   శ్రీ శివ మహా పురాణము - 233   🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

51. అధ్యాయము - 6

🌻. సంధ్య తపస్సును చేయుట - 3 🌻

నమో నమః కారణకారణాయ దివ్యామృత జ్ఞాన విభూతిదాయ |
సమస్తలో కాంతర భూతిదాయ ప్రకాశరూపాయ పరాత్పరాయ || 20

యస్యాsపరం నో జగదు చ్యతే పదాత్‌ క్షితిర్దిశస్సూర్య ఇందు ర్మనోజః |
బహిర్ముఖా నాభితశ్చాంతరింక్షం తస్మై తుభ్యం శంభవే మే నమోsస్తు || 21

యస్య నాదిర్న మధ్యం చ నాంతమస్తి జగద్యతః | 
కథం స్తోష్యామి తం దేవం వా ఙ్మనోsగోచరం హరమ్‌ || 22


సర్వకారణకారుణుడు, దివ్యమగు అమృతము వంటి జ్ఞాన సంపదను ఇచ్చువాడు, ఇతర పుణ్యలోకములలో కూడా సంపదనిచ్చువాడు, ప్రకాశస్వరూపుడు, పరాత్పరుడు అగు నీకు నమస్కారము (20).

భూమి, దిక్కులు, సూర్య చంద్రులు, మన్మథుడు ఇత్యాది జగత్తు శివుని కంటె భిన్నముగా లేదని శాస్త్రము బోధించుచున్నది. అంతర్ముఖులే గాక, బహిర్ముఖులు కూడా ఆయన స్వరూపమమే. ఆయన నాభినుండి అంతరిక్షము ఉదయించినది. హే శంభో! అట్టి నీకు నా నమస్కారము (21).

ఎవనికి ఆదిమధ్యాంతములు లేవో, ఎవని నుండి జగత్తు పుట్టినదో అట్టి, వాక్కునకు మనస్సునకు గోచరము కాని ఆ దేవుని శివుని నేను ఎట్లు స్తుతించగలను? (22).


యస్య బ్రహ్మాదయో దేవా మునయశ్చ తపోధనా ః | 
న విప్రణ్వంతి రూపాణి వర్ణ నీయాః కథాం సమే || 23

స్త్రి యా మయా తే కింజ్ఞేయా నిర్గుణస్య గుణాః ప్రభో | 
నైవ జానంతి యద్రూపం సేంద్రా అపి సురాసురాః || 24

నమస్తుభ్యం మహేశాన నమస్తుభ్యం తపోమయ | 
ప్రసీద శంభో దేవేశ భూయో భూయో నమోsస్తుతే || 25


ఎవని రూపములను బ్రహ్మాది దేవతలు, తపోనిష్ఠులగు మునులు కూడ వర్ణింపజాలరో అట్టి రూపములను నేనెట్లు వర్ణించగలను ? (23).

హే ప్రభూ! ఎవని రూపమును ఇంద్రాది దేవతలు, రాక్షసులు కూడ తెలియ జాలరో, ఇట్టి నిర్గుణుని గుణములను స్త్రీనగు నేనెట్లు తెలియగలను? (24).

ఓ మహేశ్వరా! నీకు నమస్కారము. తపస్స్వరూపుడవగు హే శంభో! నీకు నమస్కారము. నాపై దయచూపుము. హే దేవదేవా! నీకు అనేక నమస్కారములు (25).


బ్రహ్మోవాచ |


ఇత్యాకర్ణ్య వచస్తస్యా స్సంస్తుతః పరమేశ్వరః | 
సుప్రసన్నతరశ్చా భూ చ్ఛంకరో భక్తవత్సలః || 26

అథ తస్యాశ్శరీరం తు వల్కలాజిన సంయుతమ్‌ | 
పరిచ్ఛిన్నం జటావ్రాలైః పవిత్రే మూర్ధ్ని రాజితైః || 27

హిమానీ తర్జితాం భోజసదృశం వదనం తదా | 
నిరీక్ష్య కృపయావిష్టో హరః ప్రోవాచ తామిదమ్‌ || 28


బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆమె చేసిన ఈ స్తుతిని విని పరమేశ్వరుడు, భక్తవత్సలుడు అగు శంకరుడు మరింత ప్రసన్నుడాయెను (26).

ఆమె శరీరముపై నార బట్టను, మృగచర్మమును ధరించి యుండెను. పవిత్రమగు ఆమె శిరస్సుపై కేశములు జడలు కట్టి ప్రకాశించెను (27).

ఆమె ముఖము మంచు దెబ్బకు వాడిపోయిన పద్మమువలె నుండెను. ఆమెను చూచి దయ కలిగిన హరుడు ఆమెతో నిట్లనెను (28).


మహేశ్వర ఉవాచ |

ప్రీతాస్మి తపసా భ##ద్రే భవత్యాః పరమేణ వై | 
స్తవేన చ శుభ ప్రాజ్ఞే వరం వరయ సాంప్రతమ్‌ || 29

యేన తే విద్యతే కార్యం వరేణాస్మిన్మనోగతమ్‌ | 
తత్కరిష్యే చ భద్రం తే ప్రసన్నోsహం తవ వ్రతైః || 30


మహేశ్వరుడిట్లు పలికెను -


హే భద్రే! నీవు చేసిన గొప్ప తపస్సు చేత, స్తోత్రముచే త నేను ప్రీతుడనైతిని. ఓ శుభకరమగు బుధ్ధి గలదానా! ఇపుడు వరమును కోరుకొనుము (29).

నీ మనస్సులో నున్న కార్యసిద్ధిని నేను కలిగించెదను. వరమునిచ్చెదను. నీకు మంగళమగు గాక ! నీ వ్రతములచే నేను ప్రసన్నుడనైతిని (30).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


27 Sep 2020

No comments:

Post a Comment