✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మ విచారణ పద్ధతి - 27 🌻
కాబట్టి నచికేతునికి కూడా ప్రధమముగా యమధర్మరాజు ఈ ఓంకారతత్వము యొక్క విశిష్టతను తెలియజెబుతూ ఓంకార తత్వము యొక్క వివరణని అందిస్తున్నారు.
ఆది ఓంకార శబ్ద వాచ్యము. ఏ పదము నుచ్ఛరించుటచేత ఏ వస్తువు శ్రోతకు స్ఫురించుచున్నదో ఆ వస్తువు ఆ పదమునకు వాచ్యమగును. ఆ పదము వాచికము. రామకృష్ణాది నామములనుచ్ఛరించునపుడు రాముని, కృష్ణుని రూపములు మనకు స్ఫురించునట్లుగా ఓంకారము నుచ్ఛరించుటచేత నామరూప రహితమైన, సూక్ష్మమైన పరబ్రహ్మమే స్ఫురించును. ఓంకారము వాచికము, పరబ్రహ్మము వాచ్యము. నీవెరుగగోరిన తత్వమిదియే.
ఈ పరబ్రహ్మతత్వమే నాశములేనిది. అన్నిటికంటే గొప్పది. అతి సూక్ష్మమైనది. మహత్తుకన్న మహత్తైనది. అణువుకన్న అణువైనదియునగు, ఈ బ్రహ్మము నెరిగిన వారి కోరికలన్నియు సిద్ధించును.
ఓంకార శబ్దము యొక్క, ఓంకార తత్వము యొక్క లక్షణాలని ప్రాధమికంగా మొట్టమొదట మనకి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మనము ఎవరికైనా సరే ఏదైనా ఒక శబ్దాన్ని గ్రహించగానే మానవ మేధస్సు (బుద్ధి) ఆ శబ్ద గ్రాహ్యతను దృశ్యరూపంగా మారుస్తుంది.
అంటే ఉదాహరణ ఏనుగు అనగానే నీకు తెలిసినటువంటి ఏనుగు యొక్క రూపాన్ని అది నీ కళ్ళముందు ఉంచుతుంది. ఏ శబ్దాన్ని విన్నప్పటికీ కూడా ఆ యా శబ్దముల యొక్క దృశ్యరూపాన్ని నీ కళ్ళ ముందు వుంచుతుంది.
సాకార పద్ధతిగా సాధనలతో చిన్నప్పటి నుండి సాధనలతో అలవాటు పడినటువంటి మానవ మేధస్సు ఆ యా నామరూపాలతో కూడుకున్నటువంటి అర్చామూర్తులను దృశ్య రూపంగా తన కళ్ళ ముందు వుంచుతూ వుంటుంది.
కాబట్టి ధ్యానం చేసేటప్పుడు ప్రాధమికంగా మొట్టమొదట తమతమ ఇష్ట దేవతా అర్చామూర్తులను, తమ తమ ఇష్టదేవతా రూపమైన సద్గురు మూర్తులను సాకార పద్ధతిగా భావించి ఆశ్రయించేటటువంటి విధానం ధ్యానంలో మొట్టమొదట ఏర్పాటు చేయబడింది.
అయితే ‘ఓం’ అనేటటువంటి శబ్దమును వినగానే నీలో నిరాకార తత్వమైనటువంటి ఆకాశమునకు అతీతమైనటువంటి దృశ్యము గోచరిస్తుంది. ఏ సాకార తత్వమూ ఈ ఓంకారతత్వము చేత నిరూపించబడటము లేదు.
ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకనంటే రామ అనగానే రాముని యొక్క ఆకారం మనకి స్ఫురిస్తుంది. కోదండ రాముడు, జానకి రాముడు, దశరధ రాముడు, పట్టాభి రాముడు అలా రకరకాలైనటువంటి రామనామంతోటి మనం అనుబంధపడివున్నాం కాబట్టి, ఎవరికి ఇష్టమైనటువంటి రామ రూపం ఆ కళ్ళ ముందు మెదలాడుతుంది.
అట్లాగే కృష్ణ శబ్దం వినగానే బాల కృష్ణుడో, గోపికా కృష్ణుడో, రాధా కృష్ణుడో, ధ్యానముద్రాంకిత కృష్ణుడో, గోవర్ధన గిరినెత్తిన కృష్ణుడో, కాళీయ మర్ధన సంఘటనలోని కృష్ణుడో, వెన్నదొంగిలించే కృష్ణుడో, రకరకాల రూపములైనటువంటి గీతా బోధకుడైనటువంటి గీతాచార్యుడైనటువంటి శ్రీ కృష్ణ మూర్తియో, విశ్వరూపమును ప్రదర్శించినటువంటి, విరాట్ రూపమును ప్రదర్శించినటువంటి కృష్ణమూర్తియో, ఎవరికైతే ధ్యాన మూర్తుల యందు ఏ ఆసక్తి కలిగిన వారు వుంటారో అటువంటి కృష్ణ మూర్తి యొక్క సందర్శనం జరుగుతుంది.
ఈ రకంగా నామ రూపములు స్ఫురిస్తూ వుంటాయి శబ్ద గ్రాహ్యత చేత. కారణమేమిటీ అంటే వాచ్యము, వాచకము. శబ్దరూపముగా వున్నప్పుడు వాచ్యమని, అది దృశ్యరూపము ధరించినప్పుడు వాచికమని పిలవబడుతున్నది. వాచ్య వాచికములు. లక్ష్య లక్ష్యార్ధములు.
వాచ్య వాచ్యార్ధములు అని అంటారనమాట. వేదాంత పద్ధతిలో ప్రతి ఒక్కరూ తప్పక గ్రహించవలసినది ఏమిటంటే వాచ్యార్ధ లక్ష్యార్ధములను తప్పక గ్రహించాలి. ఏమి విడవాలి అంటే వాచ్యము వాచికములో వాచ్యమును విడవాలి, వాచికమును ఆశ్రయించాలి.
అంటే వాచ్య వాచ్యార్ధములలో వాచ్యార్ధమనే లక్ష్యాన్ని, లక్ష్య లక్ష్యార్ధములలో లక్ష్యార్ధమనేటటువంటి దానిని ఆశ్రయించాలి. - విద్యా సాగర్ స్వామి
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
27 Sep 2020
No comments:
Post a Comment