గీతోపనిషత్తు - 74


🌹. గీతోపనిషత్తు - 74 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍀 12. స్వభావము - దైవము కర్మలను బట్టి గుణవిభజనము సృష్టి యందున్నదని, గుణములను బట్టి కర్మలు నిర్వర్తింపబడు చున్నవని, గుణములు ప్రకృతిచే నిర్వర్తింపబడుచున్నవని, ప్రకృతికి అతీతుడుగా కర్మలకు తాను కర్తను కాదని, ప్రకృతి యందు అధీనుడుగా తాను కర్తనని కూడ తెలియ జేయుచున్నాడు. 🍀

📚. 4. జ్ఞానయోగము - 13 📚

🌻. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః |

తస్య కర్తార మపి మాం విద్యకర్తార మవ్యయమ్ || 13 🌻

భగవద్గీతయందీ శ్లోకము అవగాహన చేసుకొనుట అత్యంత ప్రధానము. దైవము కర్మలను బట్టి గుణవిభజనము సృష్టి యందున్నదని, గుణములను బట్టి కర్మలు నిర్వర్తింపబడు చున్నవని, గుణములు ప్రకృతిచే నిర్వర్తింపబడుచున్నవని, ప్రకృతికి అతీతుడుగా కర్మలకు తాను కర్తను కాదని, ప్రకృతియందు అధీనుడుగా తాను కర్తనని కూడ తెలియజేయుచున్నాడు.

మానవులు కొన్ని పనులు చేయుటకు యిష్టపడుదురు. కొన్ని పనులకు యిష్టపడలేరు. కొన్ని సమర్థతలు కలిగియుందురు. కొన్ని సమర్థతలు పొందలేరు. అందరికిని ఒకే రకములైన భావములుండవు. వారి వారి పరిణామమును బట్టి ఆయా భావములు తరచు కలుగుచుండును. ఇది మనము సులభముగ గుర్తించ వచ్చును. మనము చేయు పనులన్నిటికి మనకు కలుగు భావములే పునాది. మన భావములకు మన స్వభావము పునాది.

మన స్వభావమునకు మనయందలి గుణముల మిశ్రమము పునాది. మనలో తమోగుణము మిక్కుటముగ కలిగి, రజో గుణము స్వల్పముగ నున్నచో మన మనస్సు శరీర శ్రమకు ఎక్కువ యిష్టపడదు. అట్లే తమోగుణము, రజోగుణము సమానముగ కలిగి సత్త్వగుణము స్వల్పముగ నున్నచో, స్వభావము నందు వ్యాపారదృష్టి మిక్కుటముగ నుండును.

రజోగుణము మిగిలిన రెండు గుణముల కన్న అధికముగ నున్నచో సహజమగు శౌర్యము, ధైర్యము, పాలనాశక్తికి సంబంధించిన స్వభావములు; సత్త్వగుణము అధికమై మిగిలిన గుణములు స్వల్పముగ నున్నచో తపస్సు, స్వాధ్యాయము, విద్యాబోధనము నందాసక్తి, శమ దమాదులు యుండును. మన స్వభావములను మనము పరిశీలించి చూసుకున్నపుడు, స్థూలముగ పై నాలుగు తరగతులుగ మానవులు గోచరింతురు.

ఈ చతుర్విధములైన స్వభావములను బట్టి, స్థూలముగ చతుర్విధములగు కార్యక్రమములు భూమిపై జరుగుచుండును. ప్రతి మానవునియందు కూడ ఈ నాలుగు విధములైన స్వభావములు ఒక అనుక్రమమున గోచరించును. ఆ క్రమమును బట్టే వర్ణము లేర్పడినవి. ఇవి గుణములచే నిర్వర్తింప బడుటచే గుణముల యందలి మిశ్రమమును సత్త్వము వైపునకు క్రమముగ మళ్ళించుట పరిణామమునకు దారితీయును.

జీవుల పరిణామములోని వివిధ స్థితులను బట్టి వివిధములగు మిశ్రమములు ఉండును. మానవ సంఘమున మానవులు గుంపులు గుంపులుగ వారి వారి స్వభావమును బట్టి ఏర్పడు చుందురు. వారి మధ్య సంబంధ బాంధవ్యముల నేర్పరుచు కొందురు. కాల క్రమమున అవి కులములై స్థిరపడినవి.

కాని వర్ణముల విభాగము గుణమును బట్టి యని తెలియవలెను. ఆయా కులములలో ఆయా స్వభావములు యుండుననుటలో సత్యము లేదు. ఆయా గుణములలో ఆయా స్వభావమున్నది యనుటలో సత్యమున్నది. కావున గుణమును బట్టి కులమని భగవద్గీత స్పష్టము చేయుచున్నది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


13 Nov 2020

No comments:

Post a Comment