భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 159


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 159 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. నారద మహర్షి - 33 🌻

235. ఒకనాడు శ్రీకృష్ణదర్శనానికి నారదుడు వెళ్ళినప్పుడు, వారి మధ్య ఒక సంవాదం జరిగింది. కృష్ణుడు నారదునితో, “నారదా! నువ్వు చాలా కాలం తరువాత వచ్చావు, బాగుంది. ఇక్కడ సుఖం, శాంతి లేదు. నన్ను ప్రభువు అంటారు. ద్వారకాధీశుడేమో బలరాముడు. ఒక దాస్యవృత్తిలో నేను ఉన్నానయ్యా! ఊళ్ళో ఏ సంఘటన జరిగినా నా దగ్గరికే తీసుకొస్తారు. నేను ఏదో వాళ్ళకు చెప్పాల్సివస్తుంది. అందువల్ల శాంతి లేకుండా ఉండటానికి అదొక కారణం.

236. అనేక భోగాల్లో ఉన్నానుకాని శాంతి లేదు. ఒట్టి భోగి, భోగలాలసుడు అని చెప్పి నిందకు గురవుతున్నాను. భోగంలో ఉండటం అనేది బాగానే ఉన్నది కాని నిందాస్పదుడు అవటం ఆనందంగా లేదు. జ్ఞాతుల బాధలు కూడా నన్ను పీడిస్తున్నవి. ఇలాంటప్పుడు నా కర్తవ్యమేమిటి?” అని అడిగాడు కృష్ణుడు.

237. కేవలం లౌకికమయిన ప్రశ్న అది. కృష్ణుడి ప్రశ్నకు సమాధానమిస్తూ, “తనకు వచ్చినటువంటి వ్యధ లేదా దుఃఖముందే ఇది రెండు రకాలుగా ఉంటుంది వాసుదేవా! బాహ్యము, అభ్యంతరము అని. అంటే బయటివ్యధ, లోపలివ్యధ అన్నమాట. ఇప్పుడు నీకున్న ఆపద అంతా అభ్యంతరం, నీ లోపల ఉన్నటువంటిదే. బయటకు ఏమీ కష్టంలేదు. ఈ లోపలి వ్యధను దాటాలంటే, నాతోచిన దేమంటే, శాంత స్వభావం కలిగి ఉండటం వల్లనే అది సాధ్యం.

238. శాంతి కోరటం, అన్నదానం చేయటం, అర్హతానర్హతలతో సంబంధం లేకుండా అందరితోనూ మృదువుగా ప్రవర్తించటం, ఎవరికి పూజార్హత ఉందో వాళ్ళను పూజాస్థానంలో కూర్చుండబెట్టి పూజించటము అనే పనులు చెయ్యి.

239. శాంతమెప్పుడూ గొప్పవస్తువే! ఇంద్రియాలు నిగ్రహించుకోవడం ప్రతీవాడికీ కర్తవ్యం. ఏ వస్తువు యందు కూడా, కావాలనే లోభబుద్ధి పెట్టుకోకూడాదు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


13 Nov 2020

No comments:

Post a Comment