శ్రీ శివ మహా పురాణము - 271


🌹 . శ్రీ శివ మహా పురాణము - 271 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

64. అధ్యాయము - 19

🌻. సతీకల్యాణము - శివలీల -3 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను -

విష్ణువు ప్రియమైన వాడుగా గల శంకరుడు అపుడు ఇట్లు పలికి, విష్ణువుమాటను స్మరించి, శూలమునెత్తి బ్రహ్మను సంహరింప నుద్యమించెను (34). హే ద్విజశ్రేష్ఠా! శంభుడు శూలమునెత్తి నన్ను చంపుటకు సిద్ధపడగా, మరీచి మొదలగు వారందరు హహాకారములను చేసిరి (35).

అపుడు సర్వదేవగణములు, మునులు మరియు ఇతరులు అందరు, మండిపడుతూ భయంకరముగానున్న శంకరుని స్తుతించిరి (36).

దేవతలు ఇట్లు పలికిరి -

హే దేవదేవా! మహాదేవా! నీవు శరణుజొచ్చిన వారిని ప్రేమతో రక్షించెదవు. ఈశ్వరా! బ్రహ్మను రక్షింపుము. మహేశ్వరా!దయను చూపుము (37). మహేశ్వరా! నీవు జగత్తునకు తండ్రివి. సతీదేవి జగన్మాత. హే దేవ ప్రభో! హరిబ్రహ్మాదులందరు నీకు దాసులు (38). నీ ఆకారము, నీ లీలలు అద్భుతమైనవి. హే ప్రభో! నీ మాయ అద్భుతమైనది. హే ఈశ్వరా! నీ భక్తి లేని వరినందరినీ ఆ మాయ మోహింపజేయును (39).

బ్రహ్మ ఇట్లు పలికెను -

క్రోధావేశమును పొందిన దేవదేవేశ్వరుడగు మహేశ్వరుని ఆ దేవతలు మరియు మునులు ఈ తీరున దీనముగా అనేక విధములుగా స్తుతించిరి (40). దక్షుడు భీతుడై వద్దు వద్దు అని పలుకుచూ వేగముగా ముందునకురికి చేతిని పట్టుకొని భూతనాథుడగు శివుని ఆపివేసెను (41). అపుడు మహేశ్వరుడు విష్ణువు యొక్క అభ్యర్థనను స్మరించి, ముందునకు వచ్చిన దక్షుని చూచి, ఆతనిని ఉద్దేశించి ఈ అప్రియవచనములను పలికెను (42).

మహేశ్వరుడిట్లు పలికెను -

ఓ ప్రజాపతీ! నాకు గొప్ప భక్తుడగు విష్ణువు నాకు ఇంతకు ముందు చెప్పిన సలహాను ఆచరించుటకు నేను అంగీకరించితిని. కాన, నేనా సలహాను ఇపుడు అక్కడ ఆచరణలో పెట్టెదను (43). ఓ ప్రభూ! సతిని కామనా దృష్టితో చూచు వానిని వధింపుమని విష్ణువు చెప్పియున్నాడు. నేను బ్రహ్మను వధించి ఆ మాటను సత్యము చేసెదను (44). బ్రహ్మ సతీదేవిని కామ దృష్టితో ఎట్లు చూడగల్గినాడు? పైగా రేతస్ఖ్సలనము కూడ జరిగినది గనుక, ఈ పాపిని సంహరించెను (45).

బ్రహ్మ ఇట్లు పలికెను -

దేవదేవుడగు మహేశ్వరుడు కోపముతో మండి పడుతూ ఇట్లు పలుకగానే దేవతలు, మునులు, ఇతరులు సర్వులు వణికి పోయిరి (46). గొప్ప హాహాకారము బయలు దేరెను. అందరు ఉదాసీనులై ఉండిరి. అపుడు నేనా ఘటనచే మోహితుడనై మిక్కిలి దుఃఖితుడనై యుంటిని (47).

మహేశ్వరునకు మిక్కిలి ప్రియుడు, కార్యకుశలుడు, బుద్ధిశాలి యగు విష్ణువు అపుడు ఈ విధముగా పలుకుచున్న రుద్రునికి నమస్కరించి స్తుతించెను (48). భక్తవత్సలుడగు శంకరుని వివిధస్తోత్రములచే స్తుతించి, విష్ణువు ముందునకు వేగముగా వచ్చి ఆ రుద్రుని వారించుచూ ఇట్లు పలికెను (49).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

13 Nov 2020

No comments:

Post a Comment