🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 102 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -32 🌻
అనేటటువంటి లక్షణాలను నీవు గుర్తించడానికి అనువైనటువంటి జీవన విధానాన్ని ఏర్పాటు చేశారు. అందులో మొట్టమొదటిది దీపారాధన.
ఆ దీపారాధన ఏమిటయ్యా? అంటే, నీ లోపల జరిగేటటువంటి ఆంతరిక యజ్ఞానికి ప్రతీక. నీవు ప్రతి రోజూ, ప్రతి నిత్యమూ, 24 గంటలు చేయవలసినటువంటి ఆంతరిక యజ్ఞానికి ప్రతీక. నీ స్వస్వరూప జ్ఞానానికి ప్రతీక. అందుకని “దీపం జ్యోతి పరం జ్యోతి దీపం సర్వో తమోపః దీపేన సాధ్యతే సర్వం” - అనేటటువంటి మంత్రాన్ని మనం చదువుతున్నాము. ఎందుకనిట, ఆ ప్రకాశమే కనుక లేకపోయినట్లయితే సృష్టే లేదు.
కాబట్టి, అటువంటి ప్రకాశాన్ని నేను ఆశ్రయిస్తున్నాను. స్వస్వరూప జ్ఞానాన్ని ఆశ్రయిస్తున్నాను. స్వప్రకాశాన్ని ఆశ్రయిస్తున్నాను. అనేటటువంటి విధానంతో మనం దీపారాధన చేయాలి. ఆ దీపారాధన వెలుగులో నీ అర్చామూర్తిని చూడాలి. ఆ అర్చామూర్తిని దర్శించడం ద్వారా ఆశ్రయించడం ద్వారా షోడశోపచార విధిని లఘువుగా పూర్తి చేసుకుని, ఇక ఆసన సిద్ధి కొరకు, ప్రాణాయామ శుద్ధి కొరకు నీవు ఇట్లు ఏర్పాటు చేసుకుని, ధ్యానవిధిని అనుసరించి, తప్పక సుమారు గంటన్నర సమయాన్ని మీరు ప్రతి సంధ్యలోనూ ఏర్పాటు చేసుకోవాలి.
ఇది అందరూ, ప్రతి ఒక్కరూ ఆచరించవలసినది. సాధకులందరూ తప్పక ఆచరించాలి. ఎప్పటి వరకూ అంటే, మీరు ఆత్మనిష్ఠలో సహజం అయ్యేంత వరకూ ఈ క్రమాన్ని ఆచరించాలి. సహజమైపోయిన వాళ్ళకి సంధ్యాసమయంతో పనిలేదు. వాళ్ళు నిరంతరాయంగా అదే విధిలోనే ఉంటాడు.
నిరంతరాయంగా సహజనిర్వికల్ప సమాధి నిష్ఠలో ఉండేటటువంటి ఉచ్ఛతమమైనటువంటి లక్ష్యంలో ఉంటాడు కాబట్టి, అతను తిన్నా, తిరిగినా, చేసినా, చేయకపోయినా, ఏదన్నా వ్యవహరించినా, వ్యవహరించకపోయినా సర్వదా సాక్షిస్వరూపుడై ఉంటాడు కాబట్టి, వారు ప్రత్యేక విధులను అనుసరించకపోయినా వారికి ఏర్పడేటటువంటి కర్మలోపం ఉండదన్నమాట! అటువంటి సహజస్థితికి చేరే వరకూ, తప్పక సాధకులందరూ చతుః సంధ్యలలో, అవకాశం వుంటే తప్పక చతుః సంధ్యలలో ఆచరించాలి. ఉదయం 6, మధ్యాహ్నం 12, సాయంత్రం 6, మళ్ళా రాత్రి 12.
ఇందులో ఉదయం ఆరు గంటలు, సాయింత్రం ఆరు గంటలకు షోడశోపచార విధిని పూర్తి చేసుకుని, మాధ్యాహ్నిక సంధ్య అయినటువంటి, ఆ అర్థరాత్రి సంధ్య అయినటువంటి 12 గంటలకి మానసిక విధిని చేసేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే మీకు సామాజిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి.
అలా రాకుండా చూసుకుంటూ, మీరు తప్పక ఈవిధిని అనుసరించి ఆచరించాలి. ఇట్లా ఆచరించేవారికి, మొట్టమొదట ఏర్పడేటటువంటి అవకాశం ఏమిటంటే, స్థిరమైన మనస్సు. స్థిర ప్రాణం ఎవరికైతే ఉంటుందో, వాళ్ళకి స్థిర మనస్సు ఏర్పడుతుంది. స్థిర మనస్సు ఎవరికైతే ఉంటుందో, వారు రజోగుణాన్ని అధిగమించగలుగుతారు. తదుపరి స్థిరమైనటువంటి బుద్ధి, అది సత్వగుణం. స్థిరమైనటువంటి సత్వగుణం ప్రవృత్తి కలుగుతుంది.
అట్లా ఎవరైతే ఉంటారో, వారు మాత్రమే బుద్ధి గుహవైపు ప్రయాణం చేస్తారు. వారు మాత్రమే, హృదయస్థానం వైపు ప్రయాణాన్ని కొనసాగిస్తారు. చేయాలి అంటే, మీకు ఒక స్పష్టమైన విచారణ కలిగియుండాలి. ఏమిటంటే, నీ కర్మేంద్రియాలు గాని, నీ జ్ఞానేంద్రియాలు గాని, నీ ప్రాణేంద్రియాలు గాని, నీ అంతరేంద్రియాలు గాని అన్నీ కూడా గోళకములు, ఇంద్రియములు అనేటటువంటి వ్యవస్థగా విభజింపబడి ఉన్నాయి. ఇది నీవు స్పష్టంగా గ్రహించాలి. ఎందుచేతనంటే, ‘శరీరమే నేను’ అనేటటువంటి బలమైనటువంటి భావన చేతనే జీవుడౌతున్నాడు మానవుడు.
స్వయంగా ఆత్మస్వరూపుడే అయివున్నప్పటికీ, దానిపైన ఆచ్ఛాదితమైనటువంటి ఈ శరీరము చేత, ‘శరీరమే నేను’ అనేటటువంటి సంగత్వ దోషం బలంగా కలిగియుండడం చేత, త్రిగుణ మాలిన్యం బలంగా ఉండడం చేత, ‘ఈ శరీరంలో ఉన్నటువంటి రధికుడైన ఆత్మ - నేను, శరీరమే రధము’ అనేటటువంటి జ్ఞానాన్ని మరచిపోయి, కాళ్ళు, చేతులు నేను, కళ్ళు, ముక్క నేను, చెవులు నేను అనేటటువంటి మౌళికమైనటువంటి అజ్ఞానానికి మానవుడు లోబడుచున్నాడు. ఈ అజ్ఞానాన్ని దూరం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే క్రమేపి మన రోజువారి దైనందిన జీవితంలో ఎలా చేయాలిట?
స్థూలం నుంచి సూక్ష్మానికి, సూక్ష్మం నుంచి సూక్ష్మతరానికి, సూక్ష్మతరం నుంచి సూక్ష్మ తమానికి, దాని నుంచి కారణానికి, దాని నుంచి మహాకారణానికి, దాని నుంచి దానికి సాక్షి అయినటువంటి ప్రత్యగాత్మ స్థితికి. వ్యష్టిగా నీవు ఆత్మనిష్ఠుడవు అయినట్లయితే, అక్కడి నుంచి సమిష్టి స్వరూపాన్ని నువ్వు అధ్యయనం చేసి, సర్వవ్యాపక స్థితిని అవగాహన చేసుకొనగలిగేటటువంటి సమర్థతను సంపాదిస్తావు. కాబట్టి, ప్రతి ఒక్కరూ ఎట్లా జీవించాలి అనేది ఇందులో స్పష్టంగా చెబుతున్నారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹🌹.
13 Nov 2020
No comments:
Post a Comment