దేవాపి మహర్షి బోధనలు - 10
🌹. దేవాపి మహర్షి బోధనలు - 10 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 4. అశ్వవిద్య - 2 🌻
అశ్వవిద్య యనగా ప్రస్తుతము జీవించు సాధన. గతించిన విషయముల యందు రాబోవు విషయముల యందు మనసును విహరింపనీయక ప్రస్తుతమునందు నియమించుట వలన సాధకుడు ప్రాణవంతుడుగను, తేజోవంతుడుగను, అప్రమత్తుడుగను జీవించ గలడు.
ప్రస్తుతము లేక వర్తమానము నిర్దేశించుచున్న కర్తవ్యములందు మేల్కాంచియున్న జీవుడు సన్నివేశములయందు అప్రమత్తుడై యుండుట వలన ఏకాగ్ర మనస్కుడై తత్సన్నివేశముల నుండి పూర్ణానుభూతిని పొందును. ఈ సాధనయందు సిద్ధి పొందిన వారు జీవిత సన్నివేశముల యందు రసానుభూతి పొందుట కరులగుదురు.
నిత్యమూ ప్రస్తుతము నందే నియమింపబడిన మనస్సు రస స్వరూపుడైన భగవంతుని ఆస్వాదింపగల స్థితి యందుండును. గతమునందు, భవిష్యత్తునందు తగుల్కొని మనస్సు ప్రస్తుతమును మరచుటచే అనుభూతి కరవగుచుండును.
భోజనానుభూతిగాని, కర్మానుభూతిగాని, విశ్రాంతి అనుభూతిగాని దక్కనీయక రాబోవు లేక అయిపోయిన విషయముల యందు రమించు మనస్సు శవము వంటిదని ఋషులు పేర్కొనిరి.
ప్రస్తుతమున ఏకాగ్రతతో కర్తవ్యమున కేంద్రీకృతమైన మనస్సులకు మాత్రమే ఆనందానుభూతి సులభము. ఇట్లు అశ్వమునందు స్థిరపడిన మనస్సు ప్రతిచిన్న విషయమునందు కూడ పూర్ణముగ రమింపగలదు. ఇది ప్రాథమికమైన విద్య. ఇది ఆధారముగ సర్వవిద్యలను గ్రహింపవచ్చును.
అశ్వముఖుడుగ భగవంతుని చిత్రీకరించుట కిదీయే సంకేతార్థము. 'ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే అని వేదవాక్యము. అనగా సర్వ విద్యలకు ఆధారము అశ్వము తలగా గల దేవత యని అర్థము. ఈ విద్య నేర్పి, ఇతర విద్యలు నేర్పుట వేద సంప్రదాయము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
23 Jan 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment