గీతోపనిషత్తు -131
🌹. గీతోపనిషత్తు -131 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚
శ్లోకము 16
🍀. 14. నిరహంకారము - జ్ఞానము అజ్ఞానము చేత ఆవరింపబడి యుండునని, అందుచేత జీవులు భ్రమను చెందుచున్నారని, పరమాత్మ తటస్థుడు, సాక్షీభూతుడని ముందు శ్లోకమున తెలుపబడినది. జ్ఞానము కలుగుచున్న కొలది ప్రతి ఒక్కనికి తన స్వరూప స్వభావములు స్పష్టమగు చుండును. క్రమముగ 'తాను' అను అహంకార పురుషుడు నశించి పరతత్వమే ఉన్నదని తెలియును. 'నేను' అను అంతర్యామి తత్త్వము 'నేను' అను అహంకార పురుషుని ద్వారా ప్రకాశించును. నిజముగ జ్ఞానము కలిగినవాడు తానున్నానను భ్రమను చెందడు. దైవమే తానుగ నున్నాడని తెలిసియుండును. నిజముగ దైవమే యున్నాడని తెలిసియుండును. ఇట్లు తెలిసినవారే సద్గురువులు. నిరహంకారులు. పూర్ణ జ్ఞానులు. 🍀
జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశిత మాత్మనః |
తేషా మాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్ || 16
జ్ఞానముచేత అజ్ఞానము నాశన మొనర్పబడినపుడు ఆజ్ఞానము ఆదిత్యునివలె పరతత్వమును ప్రకాశింపజేయును. జ్ఞానము అజ్ఞానము చేత ఆవరింపబడి యుండునని, అందుచేత జీవులు భ్రమను చెందుచున్నారని, పరమాత్మ తటస్థుడు, సాక్షీభూతుడని ముందు శ్లోకమున తెలుపబడినది. ఈ శ్లోకమున జ్ఞానమగు వెలుగు కలుగుచున్నకొలది. అజ్ఞానమగు చీకటి తొలగుచు నుండునని తెలుపబడినది.
జ్ఞానము సూర్యోదయము వంటిది. సూర్యుడు ఉదయించు చున్నకొలది చీకటి తొలగి పోవుచు నుండును. అట్లే జ్ఞానము కలుగుచున్నకొలది చిత్తభ్రమలు, భ్రాంతులు నశించు చుండును. దైవమును గూర్చిన సదవగాహన జ్ఞానముచే తెలియబడినట్లు, అజ్ఞానమున తెలియబడదు.
జ్ఞానము కలుగుచున్న కొలది ప్రతి ఒక్కనికి తన స్వరూప స్వభావములు స్పష్టమగు చుండును. క్రమముగ 'తాను' అను అహంకార పురుషుడు నశించి పరతత్వమే ఉన్నదని తెలియును. 'ఆదిత్యవత్' అను శ్లోకమును వాడుటలో ఒక సూక్ష్మమున్నది. ఆదిత్యుడు సవిత్రు మండలమునకు, సూర్య మండలమునకు వెలుగును ప్రసాదించు వాడు. అట్టి ఆదిత్యుడు కూడ స్వయం ప్రకాశకుడు కాదు. అతని నుండి వెలుగునది పరతత్వమే.
'నేను' అను అంతర్యామి తత్త్వము 'నేను' అను అహంకార పురుషుని ద్వారా ప్రకాశించును. విద్యుద్దీపము ఎంత ప్రకాశించు చున్నను, ఆ ప్రకాశమునకు మూలము కనబడని విద్యుత్తే కదా! ప్రకాశించు దీపమే గోచరించును గాని, విద్యుత్తు గోచరించదు. అట్లే కనబడుచున్న వెలుగునకు కనబడని వెలుగాధారము. నిజముగ జ్ఞానము కలిగినవాడు తానున్నానను భ్రమను చెందడు. దైవమే తానుగ నున్నాడని తెలిసియుండును. నిజముగ దైవమే యున్నాడని తెలిసియుండును.
ముందు అధ్యాయములలో దైవము “నేను సూర్యున కుపదేశించితిని. సూర్యుడు మనువున కుపదేశించెను. మనువు ఇక్ష్వాకున కుపదేశించెను” అని యొక రహస్యము తెలిపినాడు. అనగా 'నేను' అను అంతర్యామియగు వాసుదేవుడు, నే నను అహంకార పురుషుడగు సంకర్షణుని యందు ప్రకాశించును.
అటుపైన ఆ నేనే బుద్ధియగు ప్రద్యుమ్నుని నుండి, చిత్తమగు అనిరుద్ధుని నుండి కూడ ప్రకాశించుచున్నది. ఇంద్రియములు (చిత్తము), మనసు, బుద్ధి, అహంకారము వీటినుండి ప్రకాశించునది ఒకే వెలుగు. అది తన యందు పరిసరముల యందు వ్యాపించి యుండును. ఇట్లు తెలిసినవానికి తాను, యితరులు అను బేధముండదు.
అంతయు పరతత్వమే నిండి యుండునని పరమానంద భరితుడై యుండును. ఇట్లు తెలిసినవారే ఆదిత్యుని వలె పరబ్రహ్మ స్వరూపమునకు వాహికలై యుందురు. వారే సద్గురువులు. నిరహంకారులు. పూర్ణ జ్ఞానులు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
23 Jan 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment