కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 170
🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 170 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 100 🌖
చివరి బాగము.
ఈ సాధనకు తోడ్పడేటువంటి సాంఖ్య విచారణ అంతా నువ్వు తెలుసుకోవాలి. పంచకోశ విచారణ, శరీరత్రయ విచారణ, దేహత్రయ విచారణ, అవస్థాత్రయ విచారణ, గుణత్రయ విచారణ, ఋణత్రయ విచారణ, తాపత్రయ విచారణ ఈ రకంగా మలత్రయ విచారణ ఇలా రకరకాల విచారణలు అన్నీ కూడాను వివేక చూడామణిలో, బ్రహ్మవిద్యలో చక్కగా బోధించబడ్డాయి.
ఇది ప్రతి ఒక్కరూ బాగా పరిశీలించవలసినటువంటి అంశం. అలా పరిశీలించి మీరు వాటిని నిజజీవితంలో వినియోగించుకోవాలి. ఈ ఇంద్రియాలను ఉపయోగించి తింటున్నా, తినకపోతున్నా, కూర్చొన్నా, నిలబడినా, ఆలోచించినా ఏ రకమైన వ్యవహారంలో నిమగ్నమై ఉన్నా, ఆయా ఇంద్రియ స్థానములు అన్నీ కూడా, తత్ ఇంద్రియాధిష్ఠాన దేవతల యొక్క అనుగ్రహ ఫలం చేత వ్యవహరిస్తున్నాయని,
ఇట్టి ఇంద్రియములకు కానీ, తనకు కానీ, ఎట్టి కర్తృత్వ భోక్తృతాభిమానములు లేవని, కేవలము కారణ స్వరూపమైనటువంటి ఇంద్రియాధిష్టాన దేవతలే బాధ్యులుకానీ, తాను అబాధ్యుడను అని తనను తాను బుద్ధి కంటే వేరైన వాడినని, బుద్ధి సాక్షి అని, ప్రత్యగాత్మనని చైతన్యమునని శుద్ధాహమని వేరు పరుచుకోవాలి.
ఇలా సాక్షి భావనను ఆశ్రయించి ఎవరైతే ప్రతి రోజూ ఈ నిర్మలాంతఃకరణమున కొరకై సాధన చేస్తారో, వాళ్ళు మాత్రమే ఈ ప్రత్యగాత్మ సాక్షాత్కారాన్ని, తదుపరి ప్రత్యక్ పరమాత్మలు అభిన్నులనేటటువంటి బ్రహ్మాత్మైక్యభావాన్ని పొందడానికి అధికారులు అవుతున్నారు.
కాబట్టి, ఆచరణ శీలురు కానటువంటి ‘శుష్క వేదాంత తమో భాస్కరం’ అనేటటువంటి గ్రంథాన్ని సద్గురు మళయాళ యతీంద్రులు రచించారు. ఎవరైతే మెట్ట వేదాంతం చెబుతుంటారో, అంటే ఆచరణ శీలురు కానటువంటి శాస్త్ర వాదులు ఎవరైతే ఉంటారో, ఎవరికైతే అనేక సంవత్సరాల నుంచి ఏదైనా గానీ మీరు చెప్పారనుకోండి ఇదంతా తెలిసిందేనండీ, ఇదంతా మేము విన్నదేనండీ, ఇదంతా గ్రహించిందేనండీ అంటారు.
తెలుసుకున్నావు, విన్నావు, గ్రహించావు, అర్థం చేసుకున్నావు... మరేం సాధించావు? అంటే, ఇంకా ఏమీ సాధించలేదండీ అంటారు. మరి ఏం సాధించకపోతే ఇంతకాలం నుంచి విని శ్రవణం చేయడం ద్వారా ఏమి నువ్వు పొందావు మరి? నాకు అంతా కూడా తెలిసిందేనండి. సిద్ధాంతం అంతా తెలిసిందేనండి.
ఏమి చేయాలో తెలియదండి! సిద్ధాంతం అంతా తెలిసినాక, ఏమి చేయాలో తెలియకపోవడం అంటే ఏమిటి? శ్రవణ కాలంలో సరిగ్గా శ్రవణం చేయలేదని అర్థం. కాబట్టి శ్రద్ధతో చేసే దానినే శ్రవణము అన్నారు. పైగా శ్రవణకాలమందే ఏ సాధన చేయాలనేటటువంటి నిర్ణయానికి రాకపోవడం మరొక దోషం.
చిత్తవిక్షేపం బలంగా ఉందన్నమాట. కాబట్టి, ఆ విక్షేపదోషాన్ని ప్రతి ఒక్కరూ తొలగించుకోవాలి. మల, విక్షేప, ఆవరణ దోషాలనేటటువంటి దోషత్రయాన్ని బాగా పరిశీలించాలి. అలా పరిశీలించి తమను తాము ఉద్ధరించుకోవడానికి, తన్ను తాను ఉద్ధిరించుకోవడానికి, “ఉద్ధరేదాత్మనాత్మానాం ఆత్మానామవసాధయేత్” ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి.
తనను తెలుసుకోవాలి. తాను ఏదై ఉన్నాడో, సర్వకాల సర్వ అవస్థలయందు మార్పుచెందక, పరిణామ రహితముగా ఏ స్థితి యందు, తానైనటువంటి ఆత్మస్థితి యందు తానున్నాడో అట్టి ఆత్మను తెలుసుకొనుటకు మిగిలినవన్నీ సహాయకారులే. - విద్యా సాగర్ గారు
సమాప్తం...
🌹 🌹 🌹 🌹 🌹
23 Jan 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment