రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
83. అధ్యాయము - 38
🌻. క్షువదధీచుల వివాదము - 3 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను-
వత్సా! శుక్రుడు తన వంశములోని వాడు, మహర్షియగు దధీచికి ఇట్లు ఉపదేశించి, శంకర ప్రభుని స్మరిస్తూ తన స్థానమునకు వెళ్ళెను(35). దధీచి మహాముని ఆయన చెప్పిన ఆ మాటలను విని, మహాప్రీతితో శివుని స్మరిస్తూ , తపస్సు కొరకు వనమునకు వెళ్ళెను(36)
ఆయన వనమునకు వెళ్ళి ఆ మహామృత్యుంజయ మంత్రమును యథావిధిగా జపిస్తూ శివుని ప్రీతితో స్మరిస్తూ తపస్సును చేసెను (37).
ఆయన ఆ మంత్రమును చిరకాలము జపించి తపస్సును చేసి శంకరుని ఆరాధించెను. ఆయన మహామృత్యుంజయ మంత్రమును జపించుటచే శివుడు సంతసించెను(38) ఓ మహర్షీ! అపుడు భక్తవత్సలుడగు శంభుడు ఆ జపముచే ప్రసన్నమైన మనస్సు గలవాడై ప్రీతితో అతని ఎదుట ఆవిర్భవించెను(39) ఆ మహర్షి తన ప్రభుడగు ఆ శంభుని చూచి సంతోషించి ప్రణమిల్లి దోసిలి యొగ్గి భక్తితో స్తుతించెను(40)
వత్సా! నారదమునీ! అపుడు శివుడు ప్రసన్నమైన మనస్సుగలవాడై చ్యవనుని కుమారుడగు దధీచితో వరమును కోరుకొమ్మనెను(41). భక్త శిఖామణి యగు దధీచుడు ఆ శంభుని మాటను విని దోసిలి యొగ్గి నమస్కరించి భక్తవత్సలుడగు శంకరునితో నిట్లనెను(42).
దధీచుడు పలికెను -
దేవదేవా! మహాదేవా! వజ్రమువలె దృఢమగు ఎముకలను కలిగియుండుట, ఎవ్వరైననూ నన్ను సంహరింపలేక పోవుట, సర్వకాలములయందు దైన్యము లేకుండుట అను మూడు వరములను నాకు ఇమ్ము (43).
బ్రహ్మ ఇట్లు పలికెను -
పరమేశ్వరుడు ఆతని మాటను విని ప్రసన్నుడై దధీచుని కొరకు 'తథాస్తు' అని పలికి ఆ మూడు వరములను ఇచ్చెను (44). వేద మార్గమునందు స్థిరమైన నిష్ఠగల ఆ మహాముని శివుని నుండి ఆ మూడు వరములను పొంది ఆనందించిన వాడై వెంటనే క్షువుడు ఉన్న స్థలమునకు వెళ్లెను (45).
ఆతడు శివుని నుండి అవధ్యత్వము, వజ్రాస్థిత్వము, అదైన్యము అను మూడు వరములను పొంది ఆ మహారాజును అరికాలితో శిరస్సుపై తన్నెను (46). అపుడు క్షువమహారాజు విష్ణువు తనకు ఇచ్చిన ఆదరముచే గర్వితుడై గొప్ప క్రోధమును పొంది దధీచుని వక్షస్థ్సలమునందు వజ్రముతో కొట్టెను (47).
పరమేశ్వరుని ప్రభావముచే ఆ వజ్రము మహాత్ముడగు దధీచుని నశింప జేయలేక పోయెను. బ్రహ్మపుత్రుడగు క్షువుడు అచ్చెరువందెను (48).
వజ్రమునకు అతిశయించిన ప్రభావము గలదు. కాని దధీచి మహర్షి అవధ్యుడుగ, అదీనుడుగ నిలిచియుండుటను గాంచి బ్రహ్మపుత్రుడగు క్షువుడు మనస్సులో విస్మయమును పొందెను (49). మృత్యుంజయ జపము చేయు దధీచునిచే పరాజితుడైన ఆ క్షువుడు వెంటనే అడవికి పోయి, పాపములను పోగొట్టువాడు, ఇంద్రుని సోదరుడు, భక్తులను రక్షించువాడు అగు విష్ణువును ఆరాధించెను (50).
గరుడధ్వజుడగు మధుసూదనుడు ఆతని పూజచే సంతసించి ఆతనికి తన దివ్య దర్శనము నొసంగెను (51). గరుడధ్వజుడగు జనార్దన దేవుని దివ్యదర్శనమును పొందిన క్షువుడు ప్రణమిల్లి ప్రీతికరములగు వాక్కులతో స్తుతించెను (52). దేవతలచే, ఇంద్రాదులచే స్తుతింపబడు వాడు, అజేయుడు, సర్వరక్షకుడు అగు జనార్దన దేవుని ఈ తీరున పూజించి, ఆయనను దర్శించి, భక్తితో శిరసువంచి నమస్కరించి ఆతడు ఇట్లు విన్నవించుకొనెను (53).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
23 Jan 2021
No comments:
Post a Comment