గీతోపనిషత్తు -123


🌹. గీతోపనిషత్తు -123 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚

శ్లోకము 7

🍀. 6. సోపానములు - యోగము - యోగయుక్తుడైనవాడు పరిశుద్ధమైన హృదయము గల వాడగును. సమస్త ప్రాణికోటి యందును ఒకే ఆత్మ యున్నదని తెలిసినవాడు. ఇట్టి జ్ఞానము గలవాడు పనులాచరించు చున్నప్పుడు గూడ బంధమున పడడు. యోగయుక్తు డనగ విచక్షణ (బుద్ధితో నిష్కామముగ కర్తవ్యముల నాచరించుచు, త్యాగనిరతితో జీవించుచు నుండును. అట్టి వానిని 'విజితాత్ము'డని దైవము సంబోధించు చున్నాడు. నిత్యము భగవత్స్మరణము నందుండువాడే (మననము చేయువాడె) ముని యని తెలుపబడినది. “విశ్వం విష్ణుః " అని పలుకుట సులభమే. తెలియుట శ్రద్ధాళువునకు మాత్రమే అనుభవైకము. 🍀

7. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మా జితేంద్రియః |
సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నది న లిప్యతే 7 ||


యోగయుక్తుడైనవాడు పరిశుద్ధమైన హృదయము గల వాడగును. మనోవికారములను జయించిన వాడగును. ఇంద్రియములను జయించిన వాడగును. సమస్త ప్రాణికోటి యందును ఒకే ఆత్మ యున్నదని తెలిసినవాడు. ఇట్టి జ్ఞానము గలవాడు పనులాచరించు చున్నప్పుడు గూడ బంధమున పడడు.

యోగయుక్తు డనగ విచక్షణ (బుద్ధితో నిష్కామముగ కర్తవ్యముల నాచరించుచు, త్యాగనిరతితో జీవించుచు నుండు వాడని ముందు అధ్యాయము లందలి సారాంశము గ్రహించినచో తెలియును. అట్టివాడు యింద్రియ వినియోగము విచక్షణతో గావించును. కావున జితేంద్రియు డగును.

ఇంద్రియ వ్యాపారములు శమించినపుడు మనసునకు పూర్ణమగు జయమే లభించును. అట్టి మనసు కామబద్ధము కాదు గనుక, బుద్ధియను వెలుగును ప్రతిబింబింపజేయుచు పూర్ణచంద్రునివలె యుండును. కామము మితిమీరినపుడే మనసునకు హెచ్చుతగ్గు లుండును. కామము విచక్షణకు లోనుగ పనిచేయుచుండుట వలన మనసు నకు స్థిరము కలుగును. వికారములు చెందక యుండును. అట్టి వానిని 'విజితాత్ము'డని దైవము సంబోధించు చున్నాడు. నిర్మలమగు మనసు కలిగినవానికి హృదయము విశుద్ధమై యుండును. పరిశుద్ధమై యుండును.

పరిశుద్ధమగు హృదయము, ప్రశాంతమగు మనస్సు, విధేయులైన యింద్రియములు గల జీవుడు నిర్వర్తించు కార్యములు క్రమబద్ధముగ నుండును. అందు ఫలాసక్తి లేదు. ఫలితముల యందు ఆకర్షణయు లేదు. చేయుట యందు వక్రతయు లేదు. అట్టి వానిని కర్మలెట్లు బంధించగలవు? బంధించలేవు. వాని కనుదిన కర్మాచరణము ఆనందమే. వానికాచరణమే ఆనందము. అట్టివాడు యోగయుక్తుడు.

యోగయుక్తుడైన వాడు, భగవత్స్మరణమున కూడ యుండునని ముందు శ్లోకమున దైవము తెలిపినాడు. పై తెలిపిన నియమములకు మననము కూడ తోడైనచో అన్ని జీవుల యందు తన యందున్నవాడే యున్నాడని తెలియును. ఇది ఒక చక్కని సోపానక్రమము.

1. విచక్షణ - ఇంద్రియములు నిబద్ధత - జితేంద్రియుడు

2. నిష్కామ కర్మ - మనసు ప్రశాంతత చెందుట - విజితాత్మ

3. యజ్ఞార్థ కర్మ - మనసు నిర్మల మగుట - విశుద్ధాత్మ

4. సన్న్యాసము - రాగద్వేషములు మనస్సు విడచుట - యోగము

5. మననము - అన్నిజీవులయందలి ఆత్మను దర్శించుట - ముక్తస్థితి.

అధ్యాయముల యందలి సూత్రములను పూసకెక్కించి నట్లుగ అమర్చుకొనుచు, అవగాహన చేసుకొనుచు శ్రద్ధాళువగు ఆత్మ సాధకుడు ముందుకు సాగవలెను. నిత్యము భగవత్స్మరణము నందుండువాడే (మననము చేయువాడె) ముని యని తెలుపబడినది.

అట్లు స్మరణము చేయుట వలన అన్నిటియందు మూలముగ నున్న బ్రహ్మమును పొందగలడని కూడ తెలుప బడుచున్నది. అనగా అన్నిటి యందలి దైవము దర్శించినవాడు మననము ఫలించిన వాడే యగుచున్నాడు.

మననము జరుగుటకు హృదయ నైర్మల్యము, మనో ప్రశాంతత ఆధారమై యున్నవి. మనోప్రశాంతతకు కామము లేని కర్తవ్య కర్మ, విచక్షణ ఆధారములై యున్నవి.

ఇటుకమీద యిటుక పేర్చి యిల్లు కట్టినట్లు, ఈ వరుస క్రమమును గ్రహించి అట్లాచరించి పురోగతి చెందవలెనే గాని, మరియొక మార్గము లేదు. సరాసరిగ అందరి ఆత్మలయందు వసించియున్న దైవమును చూచుట వీలుపడదు. “విశ్వం విష్ణుః " అని పలుకుట సులభమే. తెలియుట శ్రద్ధాళువునకు మాత్రమే అనుభవైకము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


13 Jan 2021

No comments:

Post a Comment