భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 208


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 208 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. చ్యవనమహర్షి-సుకన్య - 5 🌻


23. ధర్మశాస్త్రం ఏది చెపుతోందో, దానిని నిర్మొహమాటంగా అలా చూచినప్పుడు, మహర్షులు చెప్పిన వాక్యాలకు సంబంధించిన ధర్మములు వాళ్ళు ఎంత నిష్కర్షగా చెప్పారో తెలుస్తుంది. “బ్రహ్మక్షత్రం, బ్రహ్మక్షత్రం, బ్రహ్మక్షత్రం” అని, రెండు లక్షణములూ ఎవరియందైనా ఉండవచ్చు.

24. క్షాత్రం అనే లక్షణంచేత, అంటే ఆ లక్షణంవలనే క్షత్రియుడవుతాడు. అతడికి వేదవిహితమయిన ధర్మములన్నీ చెప్పబడ్డాయి. ఉపనయనాది సంస్కారములన్నీ క్షత్రియుని యందున్నాయి.

25. బ్రాహ్మణుడికి ఏ సంస్కృతి ఉందో, అదంతా క్షత్రియుడికీ ఉంది. బ్రాహ్మణుడికి మాత్రమే గల యాజనము తప్ప, మిగిలినవన్నీ ఇద్దరికీ సమానంగానే ఉన్నాయి. ఈ ప్రకారంగా అప్పుడు వర్ణవ్యవస్థ ఉంది. వ్యాసమహర్షి పరాశరుడి కుమారుడు. మరి అతని తల్లి సత్యవతి? కాని ఆయన బ్రాహ్మణుడిగానే చెల్లుబడి అయ్యాడు మనకు.

26. అంటే లక్షణము చేతనే బ్రాహ్మణత్వం ఉంది అని అర్థం. తపస్సులందరికీ సామాన్యమే! అందరికీ ఉండేటటువంటి ఆధ్యాత్మికసంపద తపోబలం. తపోధనం ఉన్నంతవరకు వాళ్ళకు వర్ణాది విభేదములు లేనేలేవు.

27. వాళ్ళు ఎవరిననుగ్రహిస్తే వాళ్ళు, వాళ్ళ వర్ణంలో చేరినవాళ్ళే. అట్లాంటి స్వతంత్రులు మహర్షులు. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. సామాన్యుడు అస్వతంత్రుడై తన వర్ణధర్మాన్ని అనుసరించి చక్కగా వెళితేనే వాడు క్షేమంగా ఉంటాడు.

28. కాని తపోబలం చేత అన్నిటినీ అతిక్రమించిన ఉత్తముడు అయినవాడికి ఏ ధర్మములూ వర్తించవు. అతడే ధర్మాలన్నిటికీ శాసనకర్త అవుతాడు. మహర్షుల చరిత్రలన్నీకూడా వారు అటువంటి శాసనకర్తలే తప్ప; ఒక సంప్రదాయంలో నిబంధించబడిన (అందులోని నిబంధనలకు లోబడిన) సామాన్యవ్యక్తులు కాదు అనే చెబుతున్నాయి.

29. వారు చెప్పిన ధర్మ శాస్త్రాలే మనకు ఇప్పటికీ జీవనసూత్రాలు. వారు ఏది ధర్మమని చెపుతున్నారో అది మనం అనుసరిస్తున్నాం తప్ప, వాళ్ళ కోసం చెప్పబడినటు వంటి ధర్మాలంటూ ఏమీ లేవు. మహర్షుల అంత స్వతంత్రులని వాళ్ళను గురించి మనం గుర్తుపెట్టుకోవాలి.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




13 Jan 2021

No comments:

Post a Comment