దేవాపి మహర్షి బోధనలు - 1


🌹. దేవాపి మహర్షి బోధనలు - 1 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. 1. కర్తవ్యము - 1 🌻


పరహితము నొనర్చుట, దివ్యత్వమునకు చేరువగుట అనునవి సత్సాధకునకు కల్గు రెండు నిరంతర భావములు. గమ్యము చేరువరకు అనగా సత్యమును తెలియు వరకు ఆ సత్యము తానే అని తెలియు వరకు సత్సాధకుడు పరితృప్తి చెందడు. తాను చేయు పర'హిత' కార్యములు, ధ్యానాదికములు అత్యల్పముగా తోచుచుండును.

తాను చేయు సాధన కాని, కార్యములు గాని చెప్పుకొనుటకు సిగ్గుపడు చుండును. జీవన విధానమును అన్ని విధములుగా దివ్యత్వము వైపునకు మరల్చు కొనుటకు కృషి సలుపుచుండును.

అనగా కుటుంబము నందు, వృత్తియందు సంఘపరమైన కార్యముల యందు, దైవమును, ధర్మమును జొప్పించు చుండును. చేయుచున్నది చాలదని ఆరాటపడుచుండును. చేయవలసినది మిక్కుటముగ నున్నదని భావించు చుండును.

సాధనయందు సోమరితనము చోటు చేసుకొన్నచో తానిప్పటికే చాలా చేసితినని, చేయుచుంటినని తన శక్తి సామర్థ్యముల మేరకు పనిచేయుచుంటినని తృప్తి చెందుట, గర్వపడుటగా నుండును. రోజునగల ఇరువది నాలుగు గంటలలో ఒకటి, రెండు గంటలు మాస్టరుగారి కార్యముల నొనర్చి చాలా చేయుచుంటినని భ్రమపడు చుండును.

తనకున్న కుటుంబపరమైన బాధ్యతలు అంతకన్న సాధనకుగాని, పరహిత కార్యమునకు గాని అనుమతించనని తనకు తానే సర్ది చెప్పుకొను చుండును. కుటుంబ సభ్యులతో తాను మెలగు విధానమును ప్రేమపూరితమైన యుక్తితో నిర్వర్తించు కొనిన గృహము నందే మిక్కుటముగా అంతర్ముఖముగను, బహిర్ముఖముగను కార్యము లను నిర్వర్తించుకొన గలుగును.

తన భ్రమ తనకు సత్య మనిపించుట వలన సాధనకు కొంత సమయమే కేటాయించుట చేయుచుండును. ఇది సోమరితనము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


13 Jan 2021

No comments:

Post a Comment