కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 161


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 161 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము - 91 🌻


నాయనా! నీ జీవితంలో నీవు ఏమి సాధించావు నాయనా? అనే ప్రశ్న నలభై ఏళ్ళు దాటిన దగ్గర నుంచీ వస్తుంది. నలభై ఏళ్ళు దాటిన దగ్గర నుంచీ గృహస్థాశ్రమము మీద ప్రశ్నలు కలుగుతూ ఉంటాయి. ప్రశ్నలు వస్తే, వెనక్కి తిరిగి చూస్తే, ఇవే కనబడుతూ ఉంటాయి. ఘట శరావాదులు, అంటే, మన ఇంట్లో ఒక వేయి గిన్నెలు ఉన్నాయండి. మా ఇంట్లో ఒక పది సోఫాలున్నాయండి. మా ఇంట్లో పది అంతస్థులు ఉన్నాయండి. మా ఇంట్లో పది కిలోల బంగారం ఉందండి. మాకు పది మంది కుటుంబ సభ్యులున్నారండి.

ఈ రకంగా అనేకత్వ నానాత్వ భ్రాంతికి చెందినటువంటి సమస్త వస్తూపజాలము యొక్క విశేషములన్నింటిని చెప్పుతూ, అవి తానే అయిఉన్నట్లుగా భ్రాంతి చెందుతూ వాటితో తాదాత్మ్యతను పొంది, అవే సుఖమును ఇస్తున్నాయనేటటువంటి భ్రమకు గురై, మోహాన్ని చెంది, గృహస్థాశ్రమాన్ని గడిపేశావు. గడపగా, గడపగా, గడపగా, గడపగా ఏమైందంటే... వ్యామోహం క్షీణించిపోయింది, ఇంద్రియాలు అశక్తమైపోయాయి, వృద్ధాప్యం వచ్చేసింది.

ఇప్పుడు ఈశ్వరా, ఈశ్వరా, ఈశ్వరా అంటుంటాడు. ఎందుకని? అశక్తత చేత. కాళ్ళు సహకరించడం లేదు నాయనా, నడవాలంటే, నీ దేవాలయానికి రావాలంటే. కాబట్టి, ఇక్కడి నుంచే ఓ నమస్కారం.

నీ నామ స్మరణ చేయాలంటే, బుద్ధి నిలకడగా ఉండడం లేదు నాయనా, కాబట్టి, తోచినప్పుడు చేస్తా, ఈశ్వరా నీకో నమస్కారం. కాబట్టి వృద్ధాప్యంలో ఈ రకమైనటువంటి అవస్థలను అన్నిటిని ఏకరువు పెట్టుకుంటూ ఉంటాడు. ఇంకా ఏమి అడుగుతూ ఉంటాడు? ఇంకా ఎప్పటికయ్యా? నన్ను తీసుకుపోయేది నువ్వు అని అడుగుతూ ఉంటాడు.

జీవితకాలమంతానేమో వస్తూపలబ్ధికై శ్రమించి, కాంక్షాయుతంగా జీవించి, దాచుకున్నటువంటి వస్తువులు, తయారు చేసుకున్నటువంటి సంసారం, తయారు చేసుకున్నటువంటి జగత్‌ భ్రాంతి, తనకు చిట్టచివరి కాలంలో ఉపయోగపడకపోయేటప్పటికి, ఆ చివరి కాలంలో, ఈశ్వరా ఈశ్వరా అని పలవరిస్తాడు.

మరి ఈ జీవన ప్రయాణం అంతా, ఆ జీవన పర్యంతమూ, తాను చేసినటువంటి కర్మ సహితమైనటువంటి, విశేషములన్నీ, ప్రయత్నములన్నీ, వెంటనే విడిచిపెడుతాయా? విడువవు కదా! ఆయా కర్మ భ్రాంతి మమకార రూపంలో, అహంకార రూపంలో, అభిమాన రూపంలో, అజ్ఞానరూపంలో, అవిద్యా రూపంలో, మోహ రూపంలో సూక్ష్మ శరీరాన్ని ఆశ్రయించి ఉంటాయి.

ఇవన్నీ కలిపితే, రజోగుణ, తమోగుణ సముదాయ సంబంధంతో కలిపిన సూక్ష్మ శరీరం. మరి ఆయా సందర్భోచితమైనటు వంటి స్థితులు కలుగుగా, వృద్ధాప్యమందు సదా సాధించినవి, సదా సాధించ వలసినటువంటి వాటి యందు ఆకాంక్ష, చింత.

కాంక్ష ఏమైపోయింది ఇప్పుడు వృద్ధాప్యంలో? చింతగా మారిపోయింది. ఇంకా అది అలా అవ్వలేదు, ఇంకా ఇలా అవ్వలేదు, ఇంకా వాడు ఇల్లు కట్టుకోలేదు, వాడు పెళ్ళి చేసుకోలేదు, ఇంకా మనవడు స్థిరపడలేదు, ఇంకా మునిమనవడు స్థిరపడలేదు, ఇంకా ఆ దేశాన్ని చూడలేదు, ఇంకా ఈ దేశాన్ని చూడలేదు. ఇంకా ఆ రకమైన భ్రాంతి పొందలేదు, ఇంకా ఈ రకమైన భ్రాంతి పొందలేదు.

అది భ్రాంతి అనేటటువంటి దానిని నిజవస్తు స్థితిని గుర్తించలేక, అదే సత్యమని మిడత వలె దీపం ముందు పరిభ్రమిస్తూ కడకు రెక్కలు కాలి, ఆ దీపం చేతనే మృత్యువుకు గురై పోవుచున్నాడు. ఈ రకంగా మృత్యుపాశంలో చిక్కుకున్నాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


13 Jan 2021

No comments:

Post a Comment