రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
81. అధ్యాయము - 36
🌻. విష్ణు వీర భద్ర సంవాదము - 3 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఇట్లు పలికి గణాధ్యక్షుడగు వీర భద్రుడు కోపముతో కూడిన వాడై, ఆ దేవతలనందరినీ వెనువెంటనే వాడి బాణములతో కొట్టెను (35). ఇంద్రుడు మొదలగు లోకపాలకులందురు ఆ బాణములచే కొట్టబడినవారై పది దిక్కులకు పారిపోయిరి (36).
లోకపాలకులు, దేవతలు పారిపోగానే వీరభద్రుడు గణములతో కూడి యజ్ఞశాల సమీపముకు వచ్చెను (37). అపుడా ఋషులందరు భయపడి విష్ణువును వేగముగా సమీపించి, ఆయనతో విన్నపము చేయగోరి, నమస్కరించి ఇట్లు పలికిరి (38).
ఋషులు ఇట్లు పలికిరి -
ఓ దేవదేవా!లక్ష్మీపతీ!సర్వేశ్వరా!మహాప్రభూ! దక్షుని యజ్ఞమును రక్షింపుము. యజ్ఞము నీ స్వరూపమే అనుటలో సందియము లేదు. (39). యజమాని నీ స్వరూపమే. యజ్ఞములోని అంగములు నీస్వరూపమే. యజ్ఞమును రక్షించువాడవు నీవే. కావున, నీవు యజ్ఞమును నిశ్చయముగా రక్షింపుము. నీవుతక్క మరియొక రక్షకుడు లేడు (40).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఆ మహర్షుల ఈ మాటలను విని విష్ణువు యుద్ధమును చేయగోరెను. కాని ఆ వీరభద్రునితో యుద్ధమునకు భయపడెను (41). చతుర్భుజుడగు విష్ణువు నాల్గు భుజములలో చక్రము మొదలగు ఆయుధములను ధరించి యుద్ధమునకు సన్నద్ధుడాయెను. మహాబలుడగు విష్ణువు దేవ గణములతో గూడి యజ్ఞ వాటిక నుండి బయటకు వచ్చెను (42). అనేక గణములతో గూడి,చేత శూలమును ధరించియున్న వీరభద్రుడు యుద్దమును చేయగోరి సంసిద్ధుడైన మహా ప్రభుడగు విష్ణువును చూచెను (43).
ఆయన ను చూడగనే పాపిని చూచిన యమునకు వలె, ఏనుగును చూచిన సింహమునకు వలె, వీరభద్రుని కనుబొమలు ముడిపడెను (44). ఆ విధముగా యుద్ధ సన్నద్ధుడగు విష్ణువును చూచి, శత్రువులను సంహరించువాడు, వీరులగు గణములతో కూడియున్న వాడు అగు వీరభద్రుడు కోపించి వేగముగా నిట్లు పలికెను (45).
వీరభద్రుడిట్లు పలికెను-
ఓరీ హరీ! నీ వీనాడు మహాదేవుని శపథమును ఎట్లు ఉల్లంఘించగల్గితివి ? నీ మనస్సులో గర్వము గలదు. నీకు ఏమి అయెను ? (46). శ్రీ రుద్రుని శపథమును ఉల్లంఘించు శక్తి నీకు గలదా ఏమి ? నీవెవడవు ? ముల్లోకములలో నిన్ను రక్షించువాడు గలడా? (47).
నీ విచటకు వచ్చుటలో గల కారణమును మేము తెలియకున్నాము. నీవు దక్షుని యత్రమునకు రక్షకుడవు ఎట్లు అయితివో చెప్పుము (48). దాక్షాయణి ఏమి చేసినదో నీవు చూడలేదా ?దధీచుని పలుకులను నీవు వినలేదా ?(49).
నీవుకూడా ఈ దక్షయజ్ఞమునందు యజ్ఞభాగముకొరకు వచ్చినాము హే మహాబాహో నీకు కూడా నేను యజ్ఞభాగమునిచ్చెదను (50) హే హరీ! నేను నీవక్షస్థ్సలమును చీల్చివేసెదను. ఈనాడు నిన్ను రక్షించుటకు నీ సమీపమునకు వచ్చువాడెవ్వడు గలడు? (51) నేను నిన్ను నేలపై పడవేసి , అగ్నితో దగ్ధుని చేసి, దగ్ధుడవగు నిన్ను ఈ నాడు శీఘ్రముగా పిండి చేసెదను(52)
ఓరీ హరీ! దురాచారా! నీవు మహేశన్వరునకు ద్రోహము తలపెట్టిన అధముడవు. పావనమగు శ్రీరుద్రుని మహిమను నీవు ఎరుంగవా? (53) హే మహాబాహొ! నీవు ఆ మహిమను ఎరింగియూ యుద్దమును చేయగోరి ఎదుట నిలబడితివి,. నీవు నా ఎదుట నిలబడగల్గినచో, నేను నీచే ఆ మహిమను వల్లె వేయించెదను(54)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
13 Jan 2021
No comments:
Post a Comment