గీతోపనిషత్తు -133


🌹. గీతోపనిషత్తు -133 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚

శ్లోకము 18

🍀. 16. సమదర్శనము - అన్నిటి యందును సమదర్శనము చేయువారే జ్ఞానులు. అన్నిటి యందు ఉన్నది ఒక్కటియే. ఉన్నదాని చుట్టును ప్రకృతి తన గుణముల చేత, పంచభూతముల చేత వివిధములగు అల్లికలు చేయుచు నుండును. ఈ అల్లికలలో వైవిధ్యమున్నది. అన్నిటియందు వసించి యున్నటువంటి తత్వమునే దర్శించుచు, స్వభావము ప్రకృతి యొక్క విలాసముగ దర్శించువారు నిజమగు జ్ఞానులు. స్వభావములను చూచువారు మాయను బడక తప్పదు. ఉన్నదానిని చూచు వారిని ప్రకృతి బంధింపదు. సమదృష్టి యనగ వైవిధ్యమునకు మూలము ఒక్కటే యని తెలియుట. అంతియే కాని స్వభావముల యందు సమానత్వము నాపాదించుట కాదు. సృష్టి యందు ఏడు లోకములు, ఏడు రకముల చైతన్యముతో కూడిన జీవులున్నారు. ఇవి యన్నియు చైతన్యావస్థలు. దానికాధారముగ నున్న పురుషుడు మాత్రము అన్నిటి యందు ఒకే స్థితి గొని యున్నాడు. పురుషుని దర్శించుట సమ దర్శనము కలవారికే వీలగును. 🍀

విద్యా వినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని |
శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః || 18


విద్య, వినయ సంపన్నులైన బ్రాహ్మణుల యందు, గోవుల యందు, ఏనుగు నందును, కుక్క యందును, కుక్క మాంసము తిను చండాలుని యందును సమదర్శనము చేయువారే జ్ఞానులు. అన్నిటి యందు ఉన్నది ఒక్కటియే. ఉన్నది సత్యము అని ముందు తెలిపితిమి.

ఉన్నదాని చుట్టును ప్రకృతి తన గుణముల చేత, పంచభూతముల చేత వివిధములగు అల్లికలు చేయుచు నుండును. ఈ అల్లికలలో వైవిధ్యమున్నది. విద్య, వినయము సంపదగా గలిగిన బ్రాహ్మణులకు మూలముగ ఏది యున్నదో అదియే చండాలుని యందు, కుక్క యందు, ఏనుగు నందు దర్శించుట సమదర్శనము. సామాన్యముగ మనసు, బుద్ధి ఆధారముగ జీవించు మానవులు యితరుల స్వభావమునే దర్శింతురుగాని, స్వభావమునకు మూలమున నున్న తత్త్వమును దర్శింపలేరు.

అన్నిటియందు వసించి యున్నటువంటి తత్వమునే దర్శించుచు, స్వభావము ప్రకృతి యొక్క విలాసముగ దర్శించువారు నిజమగు జ్ఞానులు, సన్న్యాసులు. మంచి స్వభావము కలవారు, చెడ్డ స్వభావము కల వారు, ప్రాణము కలవి, ప్రాణము లేనివి అన్నిటి యందు ఉన్న దొక్కటే. త్రిగుణముల కలయికలు వేరగుటచేత అవి వేరు వేరు స్వభావములతో గోచరించును. స్వభావములను చూచువారు మాయను బడక తప్పదు. ఉన్నదానిని చూచు వారిని ప్రకృతి బంధింపదు.

ఉన్నది చూచుట జ్ఞానము, సమదర్శనము. అట్లు చూచు వారే పండితులు. అనగా తెలిసినవారు. ఇతరములను చూచువారు శ్రీకృష్ణుని దృష్టిలో పండితులు కారు. అట్టివారు కేవలము చదివిన వారే కాని తెలిసినవారు కారని మాస్టర్ ఇ.కె. తెలుపుచునుండిరి.

అధికులని, అధములని భేదములు సృష్టిలో నుండుట ప్రకృతి అమరిక. తదతీతమైన సత్యమున యివి ఏవియును లేవు. ప్రపంచమున ప్రవర్తించినపుడు పేడ-బెల్లము కలుపు కొనుట, గుఱ్ఱమును-గాడిదను సమానమని భావించుట, గంగి గోవును-దున్నపోతును సమానముగ భావించుట, సంస్కారులు - కుసంస్కారులు సమానమేనని భావించుట అజ్ఞానము. అది సమదృష్టి కాదు.

సమదృష్టి యనగ వైవిధ్యమునకు మూలము ఒక్కటే యని తెలియుట. అంతియే కాని స్వభావముల యందు సమానత్వము నాపాదించుట కాదు. స్వభావపరముగ ఆరోహణ, అవరోహణ క్రమములున్నవి. మూలమున కవి వర్తింపవు.

సంఘమున బాధ్యత గలవారు, బాధ్యత లేనివారు యిరువురు సమానమా? స్వభావపరముగ వారు సమానము కాదు. కాని వారియందు మూలముగ నున్నది ఒక్కటియే. ఇట్లేకత్వమును గమనించుచు, వైవిధ్యమును మన్నించుచు సాగవలెను.

ఏకత్వము స్థిరపడినపుడు అన్నింటి యందును ప్రేమ యుండును. అంత మాత్రము చేత వైవిధ్యమును మరువరాదు. శిశుపాలుడు, అర్జునుడు తత్త్వమున ఒకటియే. స్వభావమున చాల వ్యత్యాసమున్నది. అర్జునుని శ్రీకృష్ణుడు ప్రేమతో రక్షించెను. శిశుపాలుని ప్రేమతోనే శిక్షించెను.

ఉండుటను సత్య మందురు. ప్రకృతి స్వభావమును చైతన్యమందురు. చైతన్యమునకే స్థితి భేదము. ఉండుటకు స్థితి భేదము లేదు. చైతన్యమునకు నిద్రావస్థ, స్వప్నావస్థ, మానసికావస్థ, బుద్ధి యిత్యాది అవస్థలు. ఎక్కువ చైతన్యము, తక్కువ చైతన్యము గల జీవులుందురు. దీనిని బట్టే స్థావరములు, జంగమములు, ప్రాణము లేని, ప్రాణము ఉన్న జీవులు, భూమి జీవులు, దేవతలు.

దేవతలలో కూడ, పితృదేవతలు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు ఏర్పడి యున్నారు. సృష్టి యందు ఏడు లోకములు, ఏడు రకముల చైతన్యముతో కూడిన జీవులున్నారు. ఇవి యన్నియు చైతన్యావస్థలు. అజ్ఞానుల నుండి, జ్ఞానుల వరకు అనేక అవస్థలలో మానవులున్నారు. ఇది యంతయు ప్రకృతి విలాసము.

దానికాధారముగ నున్న పురుషుడు మాత్రము అన్నిటి యందు ఒకే స్థితి గొని యున్నాడు. పురుషుని దర్శించుట సమ దర్శనము కలవారికే వీలగును. వారు ప్రకృతి విలాసమున అంతర్గతుడై స్థితి చెందిన దైవమును కూడ చూతురు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


25 Jan 2021

No comments:

Post a Comment