దేవాపి మహర్షి బోధనలు - 12


🌹. దేవాపి మహర్షి బోధనలు - 12 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 4. అశ్వవిద్య - 4 🌻


పర్జన్య శక్తి ఇట్లే భూమి జలములను ఆకాశమునకు గొనిపోవుట, ఆకాశజలములను భూమికి
కొనువచ్చుట చేయుచున్నది.

ఈ రహస్యములను తెలుపు యజ్ఞమునే జ్యోతిప్టోమము అందురు. అగ్నికి వాయువునకు గల ఋతు నిర్మాణాత్మక శక్తి ఇందు చమత్కరింపబడినవి.

బ్రాహ్మీకరణములైన యజ్ఞములలో ఈ అశ్వవిద్యను అశ్వమేధ మందురు.

మేధ్యమైన అశ్వము ఈ సంవత్సర విద్యయే. జ్యోతిర్మార్గమున జీవి శ్వాస గమనాగమనములను, జీవన్మరణములను, కర్మ ఫలములను తెలుసుకొనుటకు సర్వజ్ఞమగు స్వస్వరూప జ్ఞానమునకు ఈ విద్య దారితీయును. సమస్తములకు మూల కారణమైన ఆత్మ తత్వము లేక సూర్య తత్వము ఒక అశ్వము శిరస్సుగా రూపింబడినది.

ఉషస్సు అశ్వమునకు శిరస్సని బృహదారణ్యక ఉపనిషత్తు చెప్పు చున్నది. ఈ ఉషస్సు ప్రతి దినము ప్రారంభము నందు, ప్రతి సంవత్సర ప్రారంభము నందుకూడ దర్శన మిచ్చును. సంవత్సర ఉషస్సు అశ్వనీ నక్షత్రమున ఆరంభమగును.

అదియే దేవతల సూర్యోదయము. ఇది మానవులకు సంవత్సరమున కొకమారు వచ్చును. అప్పుడు వసంత ఉష్ణ కిరణ ధారలచే సూర్యుడు భూమిని తడుపును. అట్టి సూర్యుని ఉచ్ఛస్తుడందురు. అతడే అశ్వని శిరస్సు గల దేవత. ఈ రహస్యమే తరువాత హయగ్రీవ విద్యగా తంత్రశాస్త్రమున నెలకొనినది.

హయగ్రీవుడు సర్వవిద్యలకును ఆధారము. జ్ఞానానంద మయమగు వెలుగు. నిర్మలమైన స్ఫటికాకృతి కలవాడు. ఇతడు వాగ్గేవతలలో ఒకడుగా దర్శింపబడినాడు. గుఱ్ఱపు సకిలింపులో గల హల్లులను, అచ్చులను, ఒక క్రమముగ నేర్పరచినచో హయగ్రీవ మంత్రమగును. వాని నుచ్చరించుటలో మానవుని నాడీమండలము లోని సప్తాశ్వములు ప్రచోదనము చేయబడి సర్వవిద్యల రహస్య ద్వారములు తెరచుకొనును.

దానికి మూలిక బ్రహ్మీ అను వృక్షపర్ణము. ఈ విధముగ లోకసాక్షి యగు సూర్యునకు ప్రతిబింబమగు అంతస్సాక్షి అగు సూర్యుని ఉషస్సుగా భావించి ఉపాసించుటయే హయగ్రీవ విద్య.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


25 Jan 2021

No comments:

Post a Comment