శ్రీ శివ మహా పురాణము - 333


🌹 . శ్రీ శివ మహా పురాణము - 333 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

84. అధ్యాయము - 39

🌻. విష్ణుదధీచి యుద్ధము - 1 🌻



బ్రహ్మ ఇట్లు పలికెను -

భక్త వత్సలుడగు విష్ణుభగవానుడు క్షువునకు హితమును చేయగోరి బ్రాహ్మణ వేషముతో దధీచుని అశ్రమమునకు వెళ్లెను (1). క్షువుని కార్యము కొరకై మారు వేషములో నున్నవాడు, జగద్గురువు అగు విష్ణువు శివభక్తులలో శ్రేష్ఠుడు, మహర్షియగు దధీచునితో నిట్లనెను (2).

విష్ణువు ఇట్లు పలికెను -

ఓయీ దధీచా! మహర్షీ! నీవు శివారాధకులలో అగ్ర గణ్యుడవు, నాశము లేనివాడవు. నీ నుండి ఒక వరమును కోరెదను. నీవు దానిని ఈయ దగుదువు (3).

బ్రహ్మ ఇట్లు పలికెను -

క్షువుని కార్యమును చేయగోరిన దేవదేవుడు విష్ణువుచే యాచింపబడిన శివ భక్తశ్రేష్ఠుడగు దధీచి వెంటనే విష్ణువుతో నిట్లనెను (4).

దధీచుడు ఇట్లు పలికెను -

హే బ్రాహ్మణా! నీ కోరిక నాకు తెలిసినది. నీవు క్షవుని కార్యము కొరకు బ్రాహ్మణ రూపములో వచ్చిన మాయావియగు విష్ణు భగవానుడవు (5). హే జనార్దనా! దేవదేవా! రుద్రుని అనుగ్రహముచే నాకు ఎల్ల వేళలా భూత భవిష్యద్వర్తమానములనే మూడు కాలముల సంగతులు తెలియచుండును (6). నీవు పాపహరుడవగు విష్ణువు అని నాకు తెలియును. ఓయీ గొప్ప వ్రతము గలవాడా! బ్రాహ్మణ వేషమును వీడుము. దుష్టబుద్ధియగు క్షువమహారాజు నిన్ను ఆరాధించినాడు (7). హే హరీ! భగవాన్‌! నీ భక్తవాత్సల్యమును నేను ఎరుంగుదును. నీవు మారు వేషమును వీడి సహజరూపమును స్వీకరించి శంకరుని స్మరింపుము (8).

శివుని అర్చించుటయందు అభిరుచి గలవానికి ఎవనికైననూ భయము ఉన్నచో నీవు నాతో సత్యప్రతిజ్ఞను చేసి నిశ్చితముగా చెప్పవలెను (9). నేను అసత్యమును ఎట్టి సందర్భములోనైననూ పలుకను. శివుని స్మరించుటయందు లగ్నమైన బుద్ధిగల నేను ఈ జగత్తులో దేవతలకు గాని, రాక్షసులకు గాని, ఇతరులకు గాని ఎవ్వరికీ భయపడను (10).

విష్ణువు ఇట్లు పలికెను -

దధీచా! గొప్ప వ్రతము గలవాడా! నీకు సర్వత్ర భయము తొలగి పోయినది. నీవు శివుని పూజించుట యందు నిష్ఠగలవాడవు. అందువలననే సర్వజ్ఞుడవైనావు (11). నీకు నమస్కారము. నా ఆజ్ఞచే నీవు 'భయపడుచున్నాను' అని ఒక్కసారి నీ శత్రువు అగు క్షువమహారాజు ఎదుట చెప్పవలెను (12).

బ్రహ్మ ఇట్లు పలికెను -

విష్ణువు యొక్కఆ వాక్యమును విని కూడ భయమును పొందనివాడై శివభక్తాగ్రగణ్యుడగు దధీచ మహాముని నవ్వి ఇట్లు పలికెను (13).

దధీచుడు ఇట్లు పలికెను -

పినాకధారి, దేవ దేవుడు అగు శంభుని ప్రభావము వలనే నేను ఏకాలమునందైననూ, ఏదేశమునందైననూ, ఏ వస్తువు వలన అయిననూ లేశ##మైననూ భయపడను (14).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆ మహర్షి యొక్క ఈ మాటను విని విష్ణువు కోపించి, ఆ మహర్షిని దహించు కోరికతో చక్రమునెత్తి నిలబడెను (15). ఈశ్వరుని మహిమచే మిక్కిలి భయంకరమగు ఆ చక్రము ఆ బ్రాహ్మణుని యందు వ్యర్థమయ్యెను. క్షువ మహారాజు సన్నిధిలో కూడ అటులనే జరిగినది కదా !(16). మొక్క వోయిన చక్రము గల ఆ విష్ణువును చూచి దధీచుడు, సదసద్రూపమగు జగత్తు ఆవిర్భవించుటకు కారణభూతుడైన ఆ విష్ణువు ఎదుట చిరునవ్వుతో నిట్లనెను (17).

దధీచుడిట్లు పలికెను -

హే భగవాన్‌! నీవు పూర్వము ప్రయత్నమును చేసి అతి భయంకరమగు ఈ చక్రమును పొంది యుంటివి. ఇది లోకములో సుదర్శన మనియు, విష్ణు చక్రమనియు ప్రఖ్యాతిని గాంచినది (18). శివుడు అనుగ్రహించిన ఆ శుభచక్రము నన్ను సంహరింప నిచ్చగించుకున్నది. భగవానుడవగు నీవు కోపించి (19) బ్రహ్మాస్త్రము మొదలగు అస్త్రములతో, బాణములతో నన్ను సంహరించు యుత్నము చేయవచ్చును.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


25 Jan 2021

No comments:

Post a Comment