కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 152


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 152 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము - 82 🌻


పంచదార తెల్లగానే ఉంది, ఉప్పు తెల్లగానే ఉంది. ఈ రెండిటిని కలిపేశాము. ఇప్పుడు ఈ రెండిటిని వేరు చేయాలంటే ఎలాగా? రెండూ నీళ్ళల్లో కరిగిపోతాయి. మరి ఎట్లా వేరు చేయాలి? అని ఆలోచన చేస్తే, దానికో ఉపమానం చెప్పారు.

అంటే సాధకుడు చీమలాగా, ఆ పంచదారను ఉప్పు కలిసినటువంటిది తీసుకొచ్చి, చీమల ముందు పోసినట్లైతే, చీమ ఏం చేస్తుంది? ఉప్పు అంతా వదిలేసి, పంచదార పట్టుకెళ్ళిపోతుంది. ఎందుకంటే, దానికి స్పష్టంగా తెలుసు, ఉప్పేదో, పంచదార ఏదో...! అట్లాగే, ఈ ఆత్మ-అనాత్మ రెండూ ఒక్కచోటే ఉన్నాయి.

కానీ, మనిషి మాత్రం ఏమైపోతున్నాడంటే, కలగాపులగంగా అయిపోయి, అనాత్మను ఆశ్రయించి, ఆత్మ వస్తువును గుర్తించ లేకుండా ఉన్నాడు. కారణం ఏమిటి అంటే శరీర అధ్యాస. దీనిని ఏమన్నారు అంటే శరీర అధ్యాస.

ఎప్పటికప్పుడు శరీర అధ్యాసని పొందుతున్నాడు. ఏ స్థితిలో ఉంటే, ఆ స్థితికి సంబంధించినటువంటి శరీర అధ్యాసను పొందుతున్నాడు. అందుకని, ఇక్కడ ఎనిమిది శరీరాల యొక్క ప్రతిపాదన చేశారు. పరిణామ క్రమంలో మానవుడు తన వివేక స్థాయిలో ఎనిమిది శరీర భ్రాంతులను పొందుచున్నాడు.

ఎనిమిది అధ్యాసలను పొందుచున్నాడు. జాగ్రదావస్థలో జగత్తుతో తాదాత్మ్యత చెంది, జగత్తును భోగ్యవస్తుగా చూచి భోగ్య పదార్దముల యందు, శబ్దాది విషయములయందు ఆసక్తి కలిగి వ్యవహారశీలియై, వ్యవహారమే సత్యమనుకుంటూ, వ్యవహారం లేనిదే తాను లేనని, తన ఉనికిని, వ్యవహారశీలమైనటువంటి వజగత్ వస్తుభ్రాంతితో ముడిపడి, తాను ఏమయ్యాడు అంటే, ఆభాస రూపుడైనటువంటి జీవుడయ్యాడు, ప్రతిబింబరూపుడైనటువంటి జీవుడయ్యాడు.

అయితే ఈ జగత్‌ వ్యాపారము నంతటిని సాక్షిగా చూస్తున్నటువంటి వాడెవడో, వాడు విశ్వుడు. ఇదే జీవుడు ఈ శరీరము నుంచి తప్పుకోగానే, ఈ శరీరము ఎందుకు కొరగానిది అవుతోంది. ఈ శరీరము నిరుపయోగము అవుతోంది. ఈ శరీరము నిష్ప్రయోజనము అవుతోంది.

ఈ శరీరాన్ని పంచభూతాత్మకమైనటువంటి దేహం కాబట్టి, ఆ పంచభూతాలలోనే మరల కలిపేసే ప్రయత్నం చేస్తున్నారు. దహనం చేసో, ఖననం చేసో, ఏదో ఒక రూపంలో ఈ దేహాన్ని ఏ పంచభూతాలనుంచైతే ఇది ఉత్పన్నమైందో, మరల అదే పంచభూతాలలో కలిసిపోవడానికి మార్గం సుగమం చేస్తున్నారు.

మరి, తరలిపోయిన జీవుడు ఏమయ్యాడయ్యా? తరలి పోయిన జీవుడు తన కర్మఫల విశేషం చేత, తన కర్మల బరువు చేత, తాను చేసుకున్నటువంటి ద్వంద్వాది రూప, విహిత కర్మ, అవిహిత కర్మల చేత, పుణ్యపాపముల చేత, ఏ సుఖదుఃఖాది మిశ్రిత కర్మ చేత, కర్మల సంచిని మోసుకొంటూ మరొక దేహానికి తరలి వెళ్ళిపోయాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


04 Jan 2021

No comments:

Post a Comment