భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 199


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 199 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. దుర్వాసమహర్షి-కందళి - 3 🌻


11. దుర్వాసుడి పరీక్షకు ఆగడమంటే ఎవరికీ సాధ్యంకాదు. ఆయన అంతటి క్రోధస్వభావుడు. రుద్రస్వభావుడు. మరి ఆయన జ్ఞాని ఎలా అవుతాడు అంటే? ఆ స్వభావం వారి జ్ఞానాన్ని మరుగుపర్చదు. మహర్షులు కారణజన్ములు. వాళ్ళతో మనను పోల్చుకోకూడదు. మనం మనుష్యులం. సాధకులం. పొందవలసిన పెద్దవస్తువు మనకు ఇంకా ఉన్నది.

12. అజ్ఞానము, కోరికలు, అహంకారము, అవన్నీ అశాంతికి కారణాలు. శాంతి అంటే ఏది? ఏదికోరినా ఒకవేళ మనకు అది లభించకపోతే వచ్చేది దుఃఖము, క్రోధము-ఏదో ఒకటి వస్తుంది. కోరిక లేకుండా ఉండేది ఎక్కడ?

13. శాంతిలోంచి అజ్ఞానం పుట్టదు. కాబట్టి శాంతిలోంచి మళ్ళీ క్రోధం పుట్టదు. కాబట్టి శాంతి మొదటిది. తాపత్రయ శాంతి అని, ‘ఓం శాంతిః శాంతిః శాంతిః’ అని ప్రతీమంత్రానికి చివర చెప్పటంలో పరమోద్దేశ్యం ఏమిటంటే, ఈ మంత్రంచేత త్రివిధ శాంతి కలగాలి అన్నది.

14. భీష్ముడు తన ఒళ్ళుమరచిపోయి తన దివ్యత్వాన్ని, దేవతాలక్షణాలను తెచ్చుకొని ఆ బలంతో యుద్ధంచేయటం మొదలుపెట్టాడు. అయితే ఆయన మానవుడిగాఉంది భీష్ముడిగా ఉంటే, మానవ మాత్రుడిగా యుద్ధం చేయవచ్చు, చంపవచ్చు. అంతవరకు కృష్ణుడు అడ్డుచెప్పలేదు. అది దాటాకే, కృష్ణుడు ఆయనను హెచ్చరించాడు.

15. ‘నువ్వు దేవతామహత్తు చూపించి – ఆ శక్తిని చూపించి యుద్ధంచేస్తే, నేను(ఈశ్వరుడిని) ఇక్కడ ఉన్నాను జాగ్రత్త! నేను మానవమాత్రుడిగానే ఉన్నాను. ఈశ్వరుడిగా నా ప్రభావం చూపించనా? నువ్వు కాస్త దేవతాంశలో పుట్టడంచేత ఆ దేవతా శక్తులను వాడుకుని యుద్దం చేస్తావా ఇక్కడ నేనుండగా?” అని ఆ హెచ్చరికలోని అంతరార్ధం. అందులోని ధర్మసూక్ష్మం అది.

16. ఎప్పుడూ కూడా, ప్రతిమనుష్యుడికీ ప్రతి సందర్భంలోనూ తనహద్దు ఒకటి తనకు ఉంటుంది. “నేను మనుష్యుణ్ణి. వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు” అనేటటువంటిది. లోపల అంతరంగికస్థితి ఏదైనప్పటికీకూడా, అంతస్థనేది వ్యక్తికి ఈ లోకంలో లౌకికజీవనంలో ఒకటుంది. భక్తుడే కావచ్చు. జ్ఞానే కావచ్చు. యోగి అయినా కావచ్చు. ఎవరైనా, ఏదయినా కావచ్చు. తన అంతస్థును మాత్రం అతిక్రమించకూడదు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


04 Jan 2021

No comments:

Post a Comment