శ్రీ శివ మహా పురాణము - 314


🌹 . శ్రీ శివ మహా పురాణము - 314 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

78. అధ్యాయము - 33

🌻. వీరభద్రుని యాత్ర - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను -


శ్రీ మహేశ్వరుని ఈ మాటలను ఆదరముతో విని, వీర భద్రుడు మిక్కిలి సంతసించి, మహేశ్వరునకు ప్రణమిల్లెను (1). దేవ దేవుడు, శూలధారియగు శివుని శాసనమును శిరస్సుచే ధరించి, అపుడు వీరభద్రుడు శీఘ్రమే యజ్ఞ స్థానమునకు బయల్వెడలెను (2).

అపుడు శివుడు శోభకొరకై వీరభద్రునకు తోడుగా మహావీరులు, ప్రళయకాలాగ్ని వలె ప్రకాశించువారునగు కోట్లాది గణములను పంపెను (3). అపుడు వీరులు, బలశాలురు, కుతూహలమును రేకెత్తించువారునగు ఆ గణములు వీరభద్రుని ఎదుట మరియు వెనుక నడచిరి (4).

మృత్యువునకు మృత్యువు అగు రుద్రుని అనుయాయులు, స్వయముగా రుద్రస్వరూపులు అగు వందలాది వేలాది ఆ గణులన్నియూ వీరభద్రుని చుట్టు వారియుండెను (5). ఆ గణములతో కూడి మిక్కిలి భయమును గొల్పువాడు, మహాత్ముడు, శివుని వేషము మరియు భూషణములు గలవాడు, వేయి బాహువులు గలవాడు, నాగాభరణములతో గొప్పగా ప్రకాశించువాడు. మహా బలశాలియగు ఆ వీరభద్రుడు రథమునధిష్ఠించి వెళ్లెను (6).

ఆ రథము రెండు వేల చేతుల ప్రమాణము కలిగియుండెను. పదివేల సింహములు ఆ రథమును ప్రయత్న పూర్వకముగా లాగుచుండెను (7). మరియు, మహా బలశాలులగు అనేక సింహములు, శార్దూలములు, మొసళ్లు, మత్స్యములు, వేలాది ఏనుగులు ఆయనకు పార్శ్వములయందు రక్షకులుగా నుండెను (8).

వీరభద్రుడు దక్షుని నాశము కొరకై వేగముగా బయలుదేరగా, ఆ సమయములో కల్పవృక్షము నుండి పుట్టిన పుష్పముల వర్షము కురిసెను (9). శివుని ఆజ్ఞను పాలించుటకు ఉద్యుక్తుడైన వీరుడగు వీరభద్రుని గుణములు స్తుతించినవి. గణములన్నియు ఆ యాత్రయందు ఉత్సవములను చేసి కుతూహలమును కలిగించిరి (10).

కాళి, కాత్యాయని, ఈశాని, చాముండ, మండమర్దిని, భద్రకాళి, భద్రా మరియు మిక్కిలి వేగము గల వైష్టవి (11) అనే ఈ తొమ్మిది దుర్గలతో గూడి మహాకాళి భూత గణములన్నింటితో బాటు దక్షుని వినాశము కొరకు బయలు దేరెను (12). డాకిని, శానికి, భూతములు, ప్రమథగణములు, యక్షులు కుష్మాండులు, పర్పటులు, చటకులు మరియు బ్రహ్మ రాక్షసులు కూడ తరలి వెళ్లిరి (13).

వీరులైన భైరవులు, క్షేత్ర పాలకులు శివాజ్ఞను పాలించువారై దక్షుని యజ్ఞమును నాశము చేయుటకొరకై వేగముగా పయనమైరి (14). మరియు యోగినుల సమూహము మిక్కిలి కోపించి అరువది నాల్గు గణములతో గూడి దక్షయజ్ఞమును ధ్వంసము చేయుట కొరకు వేగముగా తరలివెళ్లెను(15). ఓ నారదా !మహాబలవంతులు, ధైర్యశాలురునగు సర్వ గణా ధ్యక్షులచే నడిపింపబడిన ఆ గణముల లెక్కను చెప్పెదను వినుము (16).

శంకుకర్ణుడగు గణాధ్యక్షుడు పదికోట్లు, కేకరాక్షకుడు పది, వికృతుడు ఎనిమిది (17), విశాఖుడు అరవై నాలుగు, పారియాత్రికుడు తొమ్మిది, వీరుడు, వికృతమగు ముఖము గలవాడునగు సర్వాంకకుడు ఆరు కోట్ల గణములతో తరలివెళ్లిరి (18).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


04 Jan 2021

No comments:

Post a Comment