గీతోపనిషత్తు -145


🌹. గీతోపనిషత్తు -145 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚

శ్లోకము 28

🍀 26. మననము - మోక్షపరాయణులు యింద్రియ మనో బుద్ధులను నియమముతో బ్రహ్మమున సమర్పణ చేయుదురు. ఇచ్ఛ, భయము, క్రోధముల నుండి వారు విగతులై, పై తెలిపిన సమర్పణ భావనచే ఎల్లప్పుడును మోక్షస్థితి యందుందురు. సద్గుణములను దైవపరముగ ఆరాధించుచు, కాలము దానియందు వినియోగించు కొలది, యితర గుణములు దూరము కాగలవు. మననమున దైవమును స్థిరపరచుకొని బుద్ధి, మనసు, యింద్రియములను కూడ అట్టి దైవ మననమున నింపిన మునులకు నిత్యముండు స్థితి ముక్త స్థితి. భగవానుడు “మనసా, వాచ, కర్మణా నన్నే ఆశ్రయింపుము" అని పలుమార్లు తెలుపుచు నుండును. బ్రహ్మము నాశ్రయించిన వానికి బ్రహ్మమే మిగులును. దైవమును ఆశ్రయించిన వారికి దైవమే మిగులును. 🍀

యతేంద్రియ మనోబుద్ది ర్ముని ర్మోక్షపరాయణః |
విగతేచ్ఛాభయ,ధో యస్సదా ముక్త ఏవ సః || 28

మోక్షపరాయణులు యింద్రియ మనో బుద్ధులను నియమముతో బ్రహ్మమున సమర్పణ చేయుదురు. ఇచ్ఛ, భయము, క్రోధముల నుండి వారు విగతులై, పై తెలిపిన సమర్పణ భావనచే ఎల్లప్పుడును మోక్షస్థితి యందుందురు.

భగవానుడు సుళువగు మార్గములను బోధించు చుండును. ఆ బోధనలు సహితము మానవులు తలక్రిందులు చేసుకొని త్రిప్పలు పడుచుందురు. ఈ శ్లోకమును సామాన్యముగ ఈ క్రింది విధముగ భావింతురు.

ఇష్టము, భయము, క్రోధము అనువానిని విడచి నిగ్రహముతో యింద్రియములను, మనసును, బుద్ధిని అధిగమించి మోక్షపరాయణులు ఎల్లప్పుడును ముక్త స్థితి యందుందురు. పై విధముగ భావించి కోరికలుండరాదని, భయపడరాదని, కోపము కలుగరాదని తెలుపుచుందురు. జన్మల తరబడి సాధన జరిపినను ఈ మూడును వదలవు.

వదల్చుకొనదలచిన విషయములు ఎప్పుడును వదలవు. పొందవలసిన సద్విషయములు పొందుటకు ప్రయత్నము చేయవలెను గాని మరియొక మార్గము లేదు.

సద్గుణములను దైవపరముగ ఆరాధించుచు, కాలము దానియందు వినియోగించు కొలది, యితర గుణములు దూరము కాగలవు. చీట్ల పేక ఆడు వ్యక్తి భగవద్భజన, బోధన, స్తోత్ర పారాయణ, సత్కర్మా చరణములలో సమయము వినియోగించు చున్నచో క్రమముగ చీట్ల పేకాడుట తగ్గును.

ఏమి చేయవలెనో చెప్పవలెను గాని, ఏమి చేయరాదో చెప్పుట వలన ఉపయోగము లేదు. వాహనమునందు ప్రయాణము చేయుచున్న పిల్లవానికి, చేతులు బయట పెట్టకు అని చెప్పినట్లుండును. భగవానుడు “మనసా, వాచ, కర్మణా నన్నే ఆశ్రయింపుము" అని పలుమార్లు తెలుపుచు నుండును. బ్రహ్మము నాశ్రయించిన వానికి బ్రహ్మమే మిగులును. దైవమును ఆశ్రయించిన వారికి దైవమే మిగులును.

దైవసాన్నిధ్యమున నున్నపుడు దైవమునే కోరుట యుండును గాని, యితరములను కోరుట యుండదు గదా! దైవభావన యున్నచోట భయ భావన ఎట్లు కలుగ గలదు? క్రోధమెట్లు కలుగ గలదు?

దైవ స్మరణయందు మనసు, బుద్ధి లగ్నమైన వానికి యిచ్ఛా భయ క్రోధము లుండుట కవకాశమే లేదు. మననమున దైవమును స్థిరపరచుకొని బుద్ధి, మనసు, యింద్రియములను కూడ అట్టి దైవ మననమున నింపిన మునులకు నిత్యముండు స్థితి ముక్త స్థితి. అట్టి వారిని యిచ్ఛా భయ క్రోధములు స్పృశింపనైనా స్పృశింప లేవు.

ఈ అధ్యాయమున ఆరవ శ్లోకముననే మననము ద్వారా బ్రహ్మముతో యోగయుక్తుడై యుండుట తెలుపబడినది. వారే మునులు. వారి యింద్రియములు, మనసు, బుద్ధి, నిరంతర మననము కారణముగ యమము చెంది యుండును. అట్టి మననము కారణముగ భయక్రోధాది భావము లుండవు. ప్రహ్లాదుడు, అంబరీషుడు అట్టివారు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


08 Feb 2021

No comments:

Post a Comment