రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
87. అధ్యాయము - 42
🌻. దక్షుని ఉద్ధారము -2 🌻
హే వీరభద్రా! మహాబాహో! నీవు ఎట్టి కర్మను చేసితివి ? వత్సా? చూడుము. నీవు దేవతలు, ఋషులు మొదలగు వారిపై అతిశీఘ్రముగా కఠినమగు దండమును అమలు చేసితివి (19). వత్సా! దక్షుడు ఇట్టి విచిత్రమగు యజ్ఞమును అనుష్ఠించి, ఇట్టి ఫలమును పొందినాడు. నీవాతనిని శీఘ్రముగా గొనిరమ్ము (20). ఈ తీరున శంకరునిచే ఆజ్ఞాపింపబడినవాడై వీరభద్రుడు సత్వరమే దక్షుని మొండెమును తెచ్చి శంభుని ఎదుట పారవైచెను (21). ఓ మహర్షీ! లోకములకు శుభములనిచ్చు ఆ శంకరుడు తలలేని ఆ మొండెమును చూచి చిరునవ్వుతో వీరభద్రుని ఉద్దేశించి ఇట్లనెను (22).
శిరస్సు ఎక్కడ ? అని ప్రశ్నించగా, వీరభద్రప్రభుడు ' హే శంకరా! నేను శిరస్సును ఆ సమయములోనే అగ్నిహోత్రమునందు హోమము జేసితిని' అని పలికెను (23). వీరభద్రుని ఈ పలుకులను విని శంకురుడు తాను పూర్వమునందు చెప్పిన తీరుగనే దేతలను ఆజ్ఞాపించెను (24). శివభగవానుడు చెప్పిన తీరుగనే మేము విష్ణువు మొదలగు అందరితో గూడి భృగువు మొదలగు వారిని శీఘ్రముగా స్వస్థులను చేసితిమి (25). అపుడు శంభుని గొప్ప ఆజ్ఞచే ఆ దక్ష ప్రజాపతికి యజ్ఞ పశువు యొక్క శిరస్సును వెంటనే సంధానము చేసిరి (26). శిరస్సును సంధించగానే, శంభుని కృపాదృష్టి వానిపై పడెను. వెంటనే ఆ ప్రజాపతి ప్రాణములను పొంది నిద్రనుండి లేచిన వాడు వలె లేచి నిలబడెను (27).
దక్షుడు లేవగానే ఎదురుగా కరుణానిధియగు శంభుని చూచి, సంతసించిన మనస్సు గలవాడై, మిక్కిలి ప్రసన్నమైన అంతరంగము గలవాడై ప్రీతితో నిలబడెను (28). అతడు పూర్వము శివుని యందలి తీవ్రమగు ద్వేషముచే మలినీకృతమైన అంతరంగము కలవాడుగా నుండెను. శివుని చూచుట తోడనే ఆతని అంతరంగము శరత్కాలచంద్రుని వలెన నిర్మలమాయెను (29). అతడు అపుడు శివుని స్తుతింపగోరెను. కాని మరణించిన కుమార్తె గుర్తుకు వచ్చుటచే ఆ దుఃఖముతో, మరియు శివుని యందలి భక్తితో ఆతడు మాటలాడలేక పోయెను (30). అపుడు దక్షుడు కొంతసేపటికి ప్రసన్నమైన మనస్సుగలవాడై సిగ్గుతో కూడినవాడై, లోకములకు మంగళములనిచ్చు శివశంకరుని నమస్కరించి స్తుతించెను (31).
దక్షుడిట్లు పలికెను -
వరములనిచ్చువాడు, సర్వశ్రేష్ఠుడు, జ్ఞాన సముద్రుడు, సనాతనుడు, దేవ ప్రభువులకు ప్రభువు, పాపములను హరించువాడు, సర్వదా సుఖస్వరూపుడు, ప్రాణులకు ఏకైక బంధువు అగు మహేశ్వర దేవుని నమస్కరించుచున్నాను (32). జగత్తునకు అధీశ్వరుడు, జగత్స్వరూపుడు, పురాతనుడు, పరబ్రహ్మయే స్వీయ ఆత్మగా గలవాడు, ప్రాణులను సంహరించువాడు, జగత్తులోని పదార్థముల ఉనికికి మూలమైన సత్తా స్వరూపుడు, పరాత్పరుడు అగు శంకరుని నమస్కరించుచున్నాను (33). ఓ దేవదేవా !మహాదేవా!దయను చూపుము. నీకు నమస్కారము. హే శంభో! దయానిధీ!ఈనాడు నేను చేసిన అపరాధమును క్షమించుము (34).
నీత్త్వము తెలిసినది. నీవు సర్వులపై అధీశ్వరుడవు. విష్ణు బ్రహ్మాదులు నిన్ను సేవించెదరు. కల్ప వృక్షము వంటి వాడవు. నీవు సర్వదా దుష్టులను దండించెదవు. స్వతంత్రుడు, భక్తులకు కోరికలను వరరూపములో నిచ్చువాడు అగు పరమాత్మవు నీవే (37).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
08 Feb 2021
No comments:
Post a Comment