దేవాపి మహర్షి బోధనలు - 26


🌹. దేవాపి మహర్షి బోధనలు - 26 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 17. సత్యము - మతము 🌻


సత్య దర్శనము జరిగినపుడెల్ల అందుండి ఒక మతము ఉద్భవించును. మానవుడు మహాత్ముడైనపుడెల్ల అది ఒక సత్య దర్శన ఘట్టము, సత్య మొక్కటియే యైనను దర్శించిన రూపము (జీవుడు) వేరు గనుక అతని నుండి సత్యము మరల అపూర్వముగ వ్యక్తమగు చుండును. సత్యము, దానిని పొందు సూత్రము ఒకటియే అయినప్పటికి అది వ్యక్తమైనప్పుడు ఉపాధి కారణమున వైవిధ్యము చెందుట గమనింపవలెను.

ఒకే కీర్తన పదిమంది కంఠముల నుండి వెలువడి నపుడు వైవిధ్యము చూచుచున్నాము కదా! వైవిధ్యము కంఠమునకు సంబంధించినవే కాని కీర్తనకు సంబంధించినది కాదు కదా! ప్రతి

జీవియు తన తోటి జీవికన్న వైవిధ్యముగ నుండును. అది కారణముగ సత్యము పలురకములుగ వ్యక్తమగుచుండును.

సత్యమొక్కటియే! దానిని తెలిసినవారు వివరించు పద్ధతుల వారిని బట్టి, కాలమును బట్టి, దేశమును బట్టి మారుచుండును. ఇట్టి వివిధములుగ గోచరించు బోధనల యందలి సత్యమొక్కటే అని గ్రహించువాడు బుద్ధిమంతుడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


08 Feb 2021

No comments:

Post a Comment