గీతోపనిషత్తు -146


🌹. గీతోపనిషత్తు -146 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚

శ్లోకము 29

🍀 27. సాన్నిధ్యము - తపస్సు, యజ్ఞముల భోక్తను నేను. సర్వలోకముల అధిపతులకు ఈశ్వరుడను నేను. సృష్టి యందు పుట్టిన సమస్త ప్రాణులకు సుహృదయుడను నేను. ఈ విధముగ నన్ను తెలుసు కొనిన వాడు శాశ్వతముగ శాంతిని పొందుచున్నాడు. సన్న్యాస స్థితికి చరమ గీతముగ భగవంతుడు ఈ వాక్యమును పలికినాడు. “నేను” అను అంతర్యామి ప్రజ్ఞగ అందరి హృదయములందు తా నున్నాడు. అట్టివాని చూచుట ప్రధానము. “కర్మ సన్న్యాసయోగము" అని నామ కరణము చేయుటలో గల ఔచిత్య మేమనగ, సత్సాధకుడు తన మనో బుద్ధి యింద్రియములను 'నేను' అను అంతర్యామి ప్రజ్ఞ యందు లగ్నము చేసియుండగ, అతని సమస్త కార్యములు యాంత్రికముగ సాగిపోవును. ఇదియే ఈ అధ్యాయ రహస్యము 🍀

భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరమ్ |
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి || 29


తపస్సు, యజ్ఞముల భోక్తను నేను. సర్వలోకముల అధిపతులకు ఈశ్వరుడను నేను. సృష్టి యందు పుట్టిన సమస్త ప్రాణులకు సుహృదయుడను నేను. ఈ విధముగ నన్ను తెలుసు కొనిన వాడు శాశ్వతముగ శాంతిని పొందుచున్నాడు. సన్న్యాస స్థితికి చరమ గీతముగ భగవంతుడు ఈ వాక్యమును పలికినాడు.

“నేను” అను అంతర్యామి ప్రజ్ఞగ అందరి హృదయములందు తా నున్నాడు. అట్టివాని చూచుట ప్రధానము. అతడే సమస్తమునకు స్వామి. అతడే గమ్యము. అట్టి వానిని 'నేను'గ తనయందు, సర్వభూతముల యందు దర్శించుచు దేశమును, కాలమును బట్టి సంచరించువాడు సన్న్యాసి యని, అట్టి సన్న్యాసి శాంతియే ప్రధాన లక్షణముగ యుండునని తెలియ వలెను.

ఈ అధ్యాయమునకు “కర్మ సన్న్యాసయోగము" అని నామ కరణము చేయుటలో గల ఔచిత్య మేమనగ, సత్సాధకుడు తన మనో బుద్ధి యింద్రియములను 'నేను' అను అంతర్యామి ప్రజ్ఞ యందు లగ్నము చేసియుండగ, అతని సమస్త కార్యములు యాంత్రికముగ సాగిపోవును. చేయుచున్నట్లనిపించదు. దీనికి

భక్తుల జీవితమున చాల ఉదాహరణలు గలవు.

1. గోపికలు : గోపికల మనసు అహర్నిశలు శ్రీ కృష్ణుని యందే లగ్నమై యుండగ, వారి దైనందిన జీవితమంతయు అనాయాస ముగ సాగిపోయినది. అన్నిటియందు వారు కృష్ణుని దర్శించుటచే

కృష్ణ దర్శన మాధుర్యము గూడ నిరంతర ముండెడిది.

2. సక్కుబాయి : ఈమెకు మానవ సాధ్యము కాని బరువు బాధ్యతలు అప్పచెప్పబడినను, కృష్ణ సాన్నిధ్యమున నుండుటచే, అసాధ్యము లన్నియు సుసాధ్యములైనవి. దుష్కరమైన కార్యములు

కూడ తాను చేసితినను భావనయే లేక ఫలించినవి.

3. హనుమంతుని సముద్రోల్లంఘనము, నారదుని వీణా గానము కూడ ఈ కోవకు చెందినవే.

(మనసు కర్మల యందు లగ్నము కాక, దైవమునందు లగ్నమగుటచే కర్మలు అప్రయత్నముగను, అనాయాసముగను సాగునని తెలుపుట 'కర్మ సన్న్యాసయోగ' రహస్యము.)

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


09 Feb 2021

No comments:

Post a Comment