శ్రీ శివ మహా పురాణము - 345
🌹 . శ్రీ శివ మహా పురాణము - 345 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
87. అధ్యాయము - 42
🌻. దక్షుని ఉద్ధారము -3 🌻
పరమేశ్వరుడవగు నీవు ఆత్మ తత్త్వము లోకములో ప్రవర్తిల్ల జేయుటకై విద్యను, తపస్సును, దీక్షను కలిగియున్న బ్రాహ్మణులను ముందుగా నీ ముఖము నుండి సృజించితివి (38). నీవు పశువుల కాపరి పశువులను పాలించు తీరున భక్తులను సర్వ విధముల ఆపదలనుండి రక్షించెదవు. మరియు ధర్మ మర్యాదలను పాలించె నీవు దుష్టులపై దండమును ప్రయోగించెదవు (39).
నేను చెడుమాటలనే బాణములతో పరమేశ్వరుని వేధించితిని. అయిననూ నీవు నన్ను అనుగ్రహించితివి. అటులనే మిక్కిలి దీనమగు ముఖములు గల ఈ దేవతలను అనుగ్రహించుము (40). హే దీనబంధూ!శంభో!భక్తవత్సలా! అట్టి నీవు భగవానుడవు. పరాత్పరుడవు. నీవు సృష్టించుకున్న నీ స్వరూపమైన ఈ విస్తారమైన బ్రహ్మండములో నీవు ఆనందరూపుడవై ఉన్నావు (41).
బ్రహ్మ ఇట్లు పలికెను -
లోకములకు మంగళములనిచ్చే మహా ప్రభుడగు మహేశ్వరుని దక్ష ప్రజాపతి ఈ తీరున వినయముతో నిండిన అంతకరణము గల వాడై స్తుతించి ఊరకుండెను (42). అపుడు విష్ణువు దోసిలి యొగ్గి నమస్కరించి కన్నీటితో బొంగురుపోయిన పలుకులతో ప్రసన్నమగు మనస్సుతో వృషభధ్వజుని స్తుతించెను (43).
విష్ణువు ఇట్లు పలికెను -
హే మహాదేవా!మహేశ్వరా! లోకములననుగ్రహించువాడా!దీనబంధో! దయానిధీ! పరబ్రహ్మ పరమాత్మవు నీవే (44). హే ప్రభో! సర్వ వ్యాపి, యథేచ్ఛా సంచారి, వేదములచే తెలియదగిన యశస్సు గలవాడు అగు నీవు అనుగ్రహమును చూపితివి. మేము పాపములను చేయునట్లు ఆ దక్షుడు చేసినాడు (45).
నా భక్తుడగు ఈ దక్షుడు పూర్వములో నిన్ను నిందించినాడు. ఈతడు దుష్టుడు. కాని మహేశా! నీవు నిర్వికారుడవు. కాన నీవు ఆ దోషమును మన్నించుము (46). హే శంకరా! అజ్ఞానముచే నేను కూడ నీయందు అపరాధమును సలిపితిని. నేను దక్షుని పక్షమున నుండి నీ గణములకు అధ్యక్షుడగు వీరభద్రునితో యుద్ధమును చేసితిని (47). నాకు ప్రభువగు పరబ్రహ్మవు నీవే. హే సదాశివా! నేను నీ దాసుడను. నీవు అందరికీ తండ్రివి గాన, నీవు నన్ను కూడ సర్వదా రక్షించవలెను (48).
బ్రహ్మ ఇట్లు పలికెను -
దేవ దేవా! మహాదేవా! కరుణా సముద్రా! ప్రభూ! నీవు స్వతంత్రుడవగు పరమాత్మవు.అద్వితీయ, అవ్యయ, పరమేశ్వరుడవు నీవే (49). హే ఈశ్వరా! దేవా! నీవు నీకు కలిగిన అవమానమును లెక్కించకుండగా నా కుమారునిపై అనుగ్రహమును చూపితివి. దక్షుని యజ్ఞమును ఉద్ధరించుము (50).
దేవేశా! నీవు ప్రసన్నుడవు కమ్ము. శాపముల నన్నిటినీ త్రోసిపుచ్చుము. జ్ఞాన స్వరూపుడవగు నీవే నన్నీ తీరున ప్రేరేపించితివి. దీనిని నివారించవలసినది నీవే. ఓ మహర్షీ! ఇట్లు నేను దోసిలియొగ్గి తలవంచి నమస్కరించి ఆ పరమ మహేశ్వరుని స్తుతించితిని (52).
తరువాత ఇంద్రుడు మొదలగు లోకపాలురు, దేవతలు మంచి మనస్సు గలవారై, ప్రసన్నమైన ముఖ పద్మము గల శంకర దేవుని స్తుతించిరి (53). తరువాత ప్రసన్నమగు మనస్సు గల దేవతలందరు, ఇతరులు, సిద్ధులు, ఋషులు, ప్రజాపతులు శంకరుని ఆనందముతో స్తుతించిరి (54). మరియు ఉపదేవతలు, నాగులు, సభలో నున్న బ్రాహ్మణులు శివుని వేర్వేరుగా పరాభక్తితో నమస్కరించి స్తుతించిరి (55).
శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీఖండలో దక్షదుఃఖ నిరాకరణ వర్ణనమనే నలుబది రెండవ అధ్యాయము ముగిసినది (42).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
09 Feb 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment